Hyd, January 12: తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా నడవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన, కావలసిన నిధులను తెచ్చుకోవడంలో అందరూ సహకరించాలని కోరారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు (సాగర్ జీ) ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దాలంటే మెట్రో రైలు, రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్ వంటి ప్రాజెక్టులు అవసరమని అన్నారు.
హైదరాబాద్ మెట్రో దేశంలోనే రెండో స్థానంలో ఉండగా, గడిచిన పదేళ్లలో ఎలాంటి ప్రగతి లేని కారణంగా 9 వ స్థానానికి పడిపోయిందని, కేంద్ర మంత్రిమండలి రాబోయే సమావేశంలో మెట్రో విస్తరణకు ఆమోదముద్ర పడేలా నాయకులు చొరవ చూపాలని కోరారు.
తెలంగాణ అభివృద్ధిని ఇప్పుడు విస్మరిస్తే మరెప్పుడూ ముందుకుపోలేమని అన్నారు. దేశాన్ని 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తయారు చేయడంలో తెలంగాణ వంతు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి గారికి చెప్పానని, ఆ సాధన దిశగా తెలంగాణలో అభివృద్ధి పనులకు కేంద్రం సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
తెలంగాణకు పోర్టు లేని కారణంగా డ్రైపోర్టుకు అనుమతి ఇవ్వాలని, అలాగే సమీపంలోని బందరు రేవుకు కనెక్టివిటీ ఉండాలన్న విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తెచ్చామన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని అంశాన్ని కూడా ప్రధాని సహకారం కోరామని, ఇలాంటి విషయాల్లో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు సహకరించాలని కోరారు.
తెలంగాణలో 60 శాతం ఆదాయం హైదరాబాద్ నగరం నుంచే వస్తోందని, హైదరాబాద్ దేశంలోని ఏ ఇతర నగరాలతో కాకుండా న్యూయార్క్, టోక్యో వంటి నగరాలతో పోటీ పడుదామని చెప్పారు.తమిళనాడులో రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో సమిష్టిగా పనిచేస్తారని ఉదహరిస్తూ తెలంగాణ అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ముఖ్యమంత్రి గారు కోరారు.
తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ముందుండి పోరాటాలు చేశారని గుర్తుచేస్తూ ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నామంటే విద్యార్థులు రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించడమేనని అన్నారు.విద్యార్థి దశలో సిద్దాంతపరమైన రాజకీయాలు చేస్తే పార్టీకి కట్టుబడి ఉంటారని, అలాంటి రాజకీయాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో రాణించాలని భావించే వారు ఉనిక పుస్తకాన్ని చదవాలని అన్నారు. ఫార్ములా ఈ రేస్‌లో అవినీతి జరగలేదని చెప్పలేదు..కేటీఆర్‌కు క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వలేదన్న ఎమ్మెల్యే దానం నాగేందర్, హైడ్రాపై పునరాలోచించాలని కామెంట్
చట్టసభల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షం ఎత్తి చూపించాలని, కాలక్రమేణా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కోల్పోతున్నామని, ప్రజాస్వామిక స్ఫూర్తిని ప్రదర్శించాలన్న ఉద్దేశంతోనే గత 13 నెలల్లో జరిగిన అసెంబ్లీ తీరుతెన్నులే ఉదహారణగా చెప్పారు.ఉత్తర తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే గోదావరి జలాలు తీసుకురావాలని సాగర్ జీ పాదయాత్ర చేశారని, అలాగే గోదావరి జలాల వినియోగం కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును తీసుకొచ్చారని అన్నారు.
గోదావరి జలాల వినియోగంపై సాగర్ జీ సలహాలు, సూచనలు ఎంతో అవసరమని, మహారాష్ట్రలో మునుగుతున్న భూములకు సంబంధించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడమని గతంలో నేను సాగర్ జీని కోరిన విషయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. తనకు భేషజాలు లేవని, తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా, అందరి సహకారం తీసుకుంటానని అన్నారు. సాగర్ జీ గవర్నర్‌గా మహారాష్ట్ర, తమిళనాడు రెండు రాష్ట్రాల్లో సమర్థవంతంగా పనిచేసి తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టారు.
విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడం కోసం రాష్ట్రంలో 75 ఐటీఐలను ఏటీసీలుగా మార్చడం, ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో #YoungIndiaSkillsUniversity ఏర్పాటు, దాని ఆవశ్యకత, క్రీడల అభివృద్ధికి స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ వంటి పలు కీలక అంశాలను వేదిక నుంచి ముఖ్యమంత్రి వివరించారు.