Hyderabad, Jan 12: పట్నంలో, పల్లెల్లో సంక్రాంతి పండుగ (Sankranti) శోభ కనిపిస్తున్నది. పెద్ద పండుగ నేపథ్యంలో పట్టణవాసులందరూ పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ (Hyderabad) నగరం నుంచి విజయవాడ, కర్నూల్, తమిళనాడు వెళ్లే రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే వాహనాలను 11 టోల్ గేట్ల ద్వారా టోల్ సిబ్బంది అనుమతిస్తున్నారు. శుక్ర, శనివారం రెండు రోజుల్లో టోల్ ప్లాజా నుంచి ఏపీ వైపునకు 1,43,000 వాహనాలు తరలివెళ్లాయి. రైళ్లల్లో రిజర్వేషన్ దొరక్కపోవడం, ప్రయివేటు బస్సుల్లో ఛార్జీలు భారీగా ఉండడంతో చాలా మంది సొంత వాహనాలు, బైక్ లపైనే సొంతూళ్లకు వెళ్తున్నారు.
రద్దీగా మారిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్న వారితో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇక ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్ సుఖ్ నగర్, ఎల్‌బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్ వద్ద ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది. ఆర్టీసీ బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు.