విప్రో మళ్లీ ఉద్యోగులకు షాకిచ్చింది. ఇప్పటికే రెండేసి ఉద్యోగాలు చేస్తున్న 300 మందిని తొలగించిన ఐటీ దిగ్గజం (Wipro) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.అక్టోబర్ 10 నుంచి సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఏదైనా మూడు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనంటూ ఉద్యోగులకు మెయిల్ పెట్టింది.
విప్రో ఉద్యోగులకు పంపిన ఇ - మెయిల్స్‌లో హైబ్రిడ్ పని విధానాన్ని కొనసాగిస్తూ ఉద్యోగులు మధ్య స్నేహ పూర్వకమైన వాతావరణాన్ని కల్పించే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం ( report to office) తీసుకున్నట్లు పేర్కొంది మా రిటర్న్ టు ఆఫీస్ పాలసీలో సౌకర్యవంతమైన, హైబ్రిడ్ విధానాన్ని విప్రో అవలంభిస్తోంది. అక్టోబర్ 10 నుండి లీడర్‌షిప్ రోల్స్‌లో ఉన్న ఉద్యోగులు వారానికి మూడుసార్లు తిరిగి కార్యాలయాలకు రావాలి. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఆఫీసుల్లో (three days in a week) ఉద్యోగులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
అయితే విప్రో తీసుకున్న ఈ నిర్ణయంపై ఐటీ రంగ ఉద్యోగుల సంఘం (నైట్స్) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆఫీసుకు రావాలంటూ ఉద్యోగులకు విప్రో పెట్టిన మెయిల్‌పై ఐటీ రంగ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్ (ఎన్‌ఐటీఈఎస్) ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సలూజ స్పందించారు. దేశీయ టెక్ సంస్థ ఉద్యోగులకు అకస్మాత్తుగా ఈ-మెయిల్ పంపింది. ‘కంపెనీ నెల క్రితమే మెయిల్ పంపి ఉండాల్సింది. ఉద్యోగులకు కావాల్సిన ప్రాంతాలకు చేరుకునే వెసులుబాటు ఉండేది. అలాగే, ఉద్యోగుల అనుమతి, వారి అభిప్రాయాలను కంపెనీ పరిగణనలోకి తీసుకోవాల్సిందని’ అన్నారు.
గత సెప్టెంబర్‌లో మరో ఐటీ రంగ సంస్థ టీసీఎస్ ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలని చెప్పింది. రిటర్న్ టూ ఆఫీస్ పాలసీలో భాగంగా టీం లీడర్లు హెచ్ ఆర్ టీం విభాగంతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కాగా ఐటీ కంపెనీల్లో మూన్‌లైటింగ్ వివాదం దుమారం రేపుతోంది.