Geneva, November 29: కరోనా వైరస్ తాజా రూపాంతరం ‘ఒమిక్రాన్’ యావత్ ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. వెలుగుచూసిన నాలుగు రోజుల్లోనే డజనుకు పైగా దేశాలకు వ్యాపించిన ఈ వేరియంట్ (Omicron COVID-19 Variant) వేగాన్ని శాస్త్రవేత్తలు కూడా అంచనా వేయలేకపోతున్నారు. మహమ్మారి కట్టడికి ఇప్పటికే పలు దేశాలు ఆంక్షల బాట పట్టాయి. సరిహద్దులను మూసివేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త కరోనా వేరియంట్ B.1.1.529(ఒమిక్రాన్)తో రిస్క్ చాలా తీవ్ర స్థాయిలో ఉన్నట్లు ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియంట్ వల్ల పెను ప్రమాదం (New Coronavirus Variant is Assessed As Very High) పొంచి ఉన్నట్లు చెప్పింది. అయితే ఆ వేరియంట్ వ్యాప్తిస్తున్న తీరు, అది ఎంత ప్రమాదకరమన్న విషయం అస్పష్టంగా ఉన్నట్లు కూడా డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఒకవేళ ఒమిక్రాన్ వేరియంట్ వల్ల వైరస్ హెచ్చు స్థాయిలో ప్రబలితే, దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని డబ్ల్యూహెచ్‌వో తన టెక్నికల్ నోట్‌లో తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఒమిక్రాన్ వల్ల ఎక్కడా మరణాలు రికార్డు కాలేదు.
B.1.1.529 వేరియంట్ కు డబ్ల్యూహెచ్‌వో (WHO) ఒమిక్రాన్ అని నామకరణం చేసిన సంగతి విదితమే. ఒమిక్రాన్‌లో (Omicron COVID-19 Variant) మ్యుటేషన్లు ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. సుమారు 26 నుంచి 32 వరకు స్పైక్ ప్రోటీన్లు పరివర్తనం చెందుతున్నట్లు గుర్తించారు. దీని వల్ల ఇమ్యూనిటీకి ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వ్యాప్తి కూడా ఎక్కువ రేంజ్ ఉంటుందన్నారు.ఈ వేరియంట్ డెల్టా కన్నా ఆరు రెట్లు ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్‌లో ఉన్న విపరీత మ్యుటేషన్లను నిర్వీర్యం చేయడం కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ కానీ కాక్‌టెయిల్ ట్రీట్మెంట్ కూడా ఒమిక్రాన్ వేరియంట్‌ను నిర్వీర్యం చేయదని ఫార్మా నిపుణులు చెబుతున్నారు. దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ప్రిలిమినరీ విశ్లేషణ ద్వారా వాళ్లు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ కరోనా ఆర్ వాల్యూ ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రోగనిరోధక వ్యవస్థపై పెను ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. వ్యాక్సిన్లు కూడా పనిచేయకపోవచ్చు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
తీవ్ర నష్టాన్ని మిగిల్చిన డెల్టా వేరియంట్.. మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీకి స్పందించింది. అయితే డెల్టా నుంచి వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ మాత్రం మోనోక్లోనల్ థెరపీకి స్పందించలేదు. నిజానికి మోనోక్లోనల్ చికిత్స ఓ అద్భుతమని మొదట్లో అనుకున్నారు. కానీ డెల్టా ప్లస్‌పై ఆ చికిత్స పనిచేయకపోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇక ఒమిక్రాన్‌పై ఆ యాంటీబాడీ చికిత్స పనిచేయకపోవచ్చు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒమిక్రాన్‌లో ఉన్న G339D, S373P, G496S, Q498R, Y505H స్పైక్ ప్రోటీన్లు మోనోక్లోనల్ యాంటీబాడీలను తట్టుకోగలవని ఐజీఐబీలో పనిచేస్తున్న రీసర్చ్ స్కాలర్ మెర్సీ రోఫినా తెలిపారు. ఎటిసివిమాబ్, బామ్లనివిమాబ్, కసిరివిమాబ్, ఇండివిమాబ్‌తో పాటు వాటి కాక్‌టెయిల్స్‌ను కూడా ఒమిక్రాన్ తట్టుకుంటుందని రోఫినా తెలిపారు. నిజానికి ఒమిక్రాన్ వల్ల వ్యాధి తీవ్రత ఎంత ఉంటుందో ఇంకా స్పష్టం కాలేదు. కానీ వైరస్ ప్రబలుతున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు B.1.1.529 వేరియంట్‌కు విస్తృతంగా జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కెనడాలో (Canada) ప్రత్యక్షమయింది. దేశంలో తొలిసారిగా ఒమిక్రాన్ (Omicron) కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. నైజీరియా నుంచి ఒంటారియోకు వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో సరికొత్త వైరస్ లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌లో ఉంచామని, ఈ మధ్యకాలంలో వారు కలిసిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని ఆరోగ్యశాఖ మంత్రి జీన్ వెస్ తెలిపారు. మానిటరింగ్, టెస్టింగ్ ప్రక్రియ కొనసాగుతున్నదని, దేశంలో మరికొన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.
ఒమిక్రాన్ కరోనా వేరియంట్ ప్రబలుతున్న నేపథ్యంలో.. దక్షిణాఫ్రికా నుంచి వస్తున్న విమానాలపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే తమ దేశ విమానాలపై ఆంక్షలు విధించడాన్ని సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఖండించారు. ఆ చర్యల పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంక్షలు అన్యాయమన్నారు. అర్జెంట్‌గా ఆ ఆంక్షలను ఎత్తివేయాలని ఆయన పిలుపునిచ్చారు. దక్షిణాఫ్రికా నుంచి వస్తున్న ప్రయాణికులపై బ్రిటన్, ఈయూ, అమెరికా దేశాలు ఆంక్షలు విధించాయి.
వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా అమెరికాలో ఇంకా 30 శాతం మంది ప్రజలు కనీసం ఒక్క టీకా డోసు కూడా వేసుకోలేదు. అయితే ఇప్పుడు ‘ఒమిక్రాన్’ భయంతో టీకా వేసుకోవడానికి అమెరికన్లు పోటెత్తుతున్నారు. దీంతో దేశంలోని వందలాది టీకా కేంద్రాల్లో రద్దీ నెలకొన్నది. ‘ఒమిక్రాన్’ అమెరికాకు కూడా వ్యాపించి ఉండవచ్చని అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫాసీ అన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, ఇజ్రాయెల్, హాంకాంగ్, బోట్స్‌వానా, బెల్జియం, చెక్‌రిపబ్లిక్, బవేరియా, ఆస్ట్రియా ,బ్రిటన్, కెనడా దేశాల్లో ఒమిక్రాన్ వైరల్ వెలుగు చూసింది.