టర్కీ, సిరియాలో సంభవించిన వరుస భూకంపాలు (Turkey-Syria Earthquake) పెను విషాదాన్ని మిగిల్చాయి. భూంకంపం వచ్చి 10 రోజులు ధాటినా నేటీకి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా కూలిన భవన శిథిలాలు, వాటి కింద చితికిన బతుకుల ఆనవాళ్లే కనిపిస్తున్నాయి. ఇరు దేశాల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 41 వేలు దాటింది. భూకంపం గత 100 ఏళ్ల కాలంలో కనీవినీ ఎరగనిదిగా పరిశీలకులు భావిస్తున్నారు.
మొత్తంగా ఈ భారీ భూకంపం దెబ్బకు రెండు దేశాల్లో పూడ్చుకోలేని నష్టాన్ని, తీరని శోకాన్ని మిగిల్చింది. అయితే ఇప్పటికీ పలుచోట్ల చిన్నారులు, మహిళలతో సహా కొంతమంది ప్రాణాలతో బయటపడటం అద్భుతమనే చెప్పాలి. ఇక భూకంపం వచ్చిన 9 రోజుల తర్వాత కూడా ఇద్దరు మహిళలు సజీవంగా బయటపడ్డారు.
టర్కీలోని కహ్రామన్‌మారస్‌లో శిథిలాల కింద చిక్కుకున్న 45 ఏళ్ల మెలికే ఇమామోగ్లు, 74 ఏళ్ల సెమిలే కెకెక్ అనే ఇద్దరి మహిళలను రెస్క్యూ సిబ్బంది బుధవారం సురక్షితంగా బయటకు తీశారు. మహిళను రక్షించి అంబులెన్స్‌లో ఆసపత్రికి తరలిస్తున్న దృశ్యాలను డారికా మేయర్ ముజాఫర్ బియిక్ షేర్ చేశారు. మరోవైపు భూకంపాల వల్ల తీవ్రంగా ప్రభావితమైన మరో టర్కీ నగరం అంటాక్యాలో 228 గంటల తర్వాత(గురువారం) శిథిలాల కింద నుంచి ఎరిల్మాజ్ అనే మహిళతోపాటు ఆమె ఇద్దరు పిల్లలను సజీవంగా (mother and her two children were pulled alive ) బయటకు తీశారు.
టర్కీలో మళ్లీ భూకంపం.. 4.7 తీవ్రతతో మరోమారు కంపించిన భూమి
ఆమెను రక్షించిన సిబ్బందితో మొదటగా ‘ఇది ఏ రోజు’ అని అడగటం గమనార్హం. అంతేగాక టర్కీలో ధ్వంసమైన భవనం శిథిలాల నుంచి ముస్తఫా అనే 13 ఏళ్ల బాలుడిని రక్షించారు. సుమారు 74 దేశాలకు చెందిన సహాయక బృందాలు ప్రజలను ప్రాణాలతో కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్నట్లు తుర్కియే ప్రభుత్వం తెలిపింది.
ఇప్పటికి 13 వేల మంది ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. మొత్తం 2,11,000 మంది నివసిస్తున్న 47 వేల భవనాలు కుప్పకూలడమో, తీవ్రంగా దెబ్బతినడమో జరిగింది. 1939లో సంభవించిన ఎర్జింకాన్ భూకంపం కారణంగా 33 వేలమంది పౌరులు మరణించారు. భూకంపం సంభవించిన తొమ్మిది రోజుల తర్వాత కూడా శిథిలాల కింద నుంచి ప్రజల స్వరాలు వినిపిస్తున్నట్లు పలు మీడియా సంస్థలు తెలిపాయి.
నీరు, ఆహారం లేక కొందరు శిథిలాల కిందే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం భూకంపం కారణంగా నిరాశ్రయులైన వారిని ఆదుకోవడంపైనే ప్రధానంగా దృష్టిసారించారు.భూకంపం కారణంగా బాధితులుగా మారిన సిరియాలోని 50 లక్షల మందిని ఆదుకునేందుకు 397 మిలియన్ డాలర్ల సేకరణకు ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది.టర్కీ, సిరియాల్లో 2 కోట్ల 60 లక్షల మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అతిశీతల ఉష్ణోగ్రతలు, అపరిశుభ్రత కారణంగా అనేక రోగాలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.