Heavy rains. (Photo Credits: PTI)

Eluru, Sep 19: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం (formation of low pressure in Bay of Bengal) ఏర్పడిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదులుతూ తదుపరి 24 గంటలలో మరింతగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది.

దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అనేకచోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని వివరించింది. దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. అదే సమయంలో, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డాయని ఐఎండీ వెల్లడించింది.

50 ఏళ్లుగా మద్యం వ్యాపారంలో ఉన్నాం, మా బంధువులకు మాగుంట పేరు ఉంటే మాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి

ఇక గత అర్ధరాత్రి నుంచి ఏలూరులో ( Heavy rain lashes Eluru city) కుండపోతగా వాన కురుస్తున్నది. ఫలితంగా ఏలూరు నగరం జలదిగ్భందంలో చిక్కుకున్నది. రహదారులపై మూడు అడుగుల మేర వర్షపు నీరు నిలచింది. దాంతో ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాహనదారులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. ముఖ్యంగా ఆర్‌ఆర్‌ పేట, పవర్‌ పేట ప్రాంతాల్లో ఇంకా వాననీటిలోనే చిక్కుకుని ఉన్నాయి.

ఏలూరు నగరానికి సమీపంలో తమ్మిలేరు ఉండటం వల్ల భారీ వర్షాలకు తమ్మిలేరు నుంచి వాన నీరు నగరంలోకి చేరుతున్నది. దాంతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. చిన్నపాటి వాన కురిసినా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌ పూర్తిగా జలమయం అవుతుండటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవర్‌ పేట రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రధాన రోడ్డు జలమయంగా మారడంతో వెళ్లలేని దుస్థితి ఏర్పడింది.

రానున్న మూడు రోజుల్లో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, ఒడిశా స‌హా ప‌లు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ అంచ‌నా వేసింది. సెప్టెంబర్ 21, 22 తేదీల్లో ఒడిశా, తీర ప్రాంతాలు-ఉత్తర ఆంధ్రప్రదేశ్ లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. అలాగే, గంగా ప‌రివాహ‌క ప్రాంతాలు, ప‌శ్చిమ‌ బెంగాల్‌లో 19 నుండి 21వ తేదీ వరకు, విదర్భ, ఛత్తీస్‌గఢ్ & తూర్పు మధ్యప్రదేశ్‌లలో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ అంచ‌నా వేసింది.

అలాగే, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. వీటితో పాటు అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ సహా పలు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.