New Delhi, August 30: ఢిల్లీ హైకోర్టు మైనర్ బాలిక రేప్ కేసులో కీలక తీర్పును వెలువరించింది. ఏకాభిప్రాయ శారీరక సంబంధంలో ఉన్న వ్యక్తి తన భాగస్వామి పుట్టిన తేదీని న్యాయపరంగా పరిశీలించాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) స్పష్టం చేసింది. అధికారిక పత్రాల ప్రకారం మూడు వేర్వేరు పుట్టిన తేదీలను కలిగి ఉన్న తన మైనర్ భాగస్వామిపై అత్యాచారం చేశాడని ఆరోపించిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి ఆమెతో ఏకాభిప్రాయంతో శారీరక సంబంధం పెట్టుకునే ముందు ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ చూడాల్సిన అవసరం లేదని (Can't Check Aadhaar Card Before Sex) అభిప్రాయపడింది.
ఈ కేసులో తనపై పిల్లల దుర్వినియోగ చట్టంలోని నిబంధనలను అమలు చేయడానికి మాత్రమే బాధితురాలు తన పుట్టిన తేదీలను ఉపయోగించుకుంటోందని నిందితుడి తరఫు న్యాయవాది వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. మైనర్‌ను రేప్ ( Minor's Rape Charge) చేసినట్లు ఓ వ్యక్తిపై కేసు నమోదు అవ్వగా, అతను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ జస్మీత్ సింగ్ విచారించారు.
అయితే ఆ మహిళకు రికార్డుల ప్రకారం మూడు రకాల పుట్టినరోజులు ఉన్నాయని, రేప్ జరిగిన నాటికి ఆమె మైనర్ కాదు అని కోర్టు అభిప్రాయపడింది. ఏకాభిప్రాయంతో శారీరక సంబంధం పెట్టుకున్న వ్యక్తి .. తన భాగస్వామి డేట్ ఆఫ్ బర్త్‌ను తెలుసుకోవాల్సిన అవసరం లేదని, దాని కోసం ఆ వ్యక్తి ఆధార్, ప్యాన్ కార్డును పరిశీలించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొన్నది. ఆధార్ కార్డులో ఆ మహిళ పుట్టిన రోజు 01.01.1998గా ఉందని, ఈ ఒక్క ఆధారంతో ఆమె మైనర్ కాదు అని తెలుస్తోందని జడ్జి తెలిపారు.
అయితే అమ్మాయికి భారీ మొత్తంలో డబ్బు ట్రాన్స్‌ఫర్ అయ్యిందని, బెయిల్ ఇవ్వడానికి ఇది కూడా ఓ కారణం అవుతుందని కోర్టు తెలిపింది. హనీ ట్రాపింగ్ కేసుల గురించి జడ్జి తన తీర్పులో ప్రస్తావించారు. పోలీసులు అలాంటి కేసుల్ని సునిశితంగా విచారించాలని ఆదేశించారు.2019, 2021లో తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు ఆరోపించిన ఈ కేసులో ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, కేసు నమోదుకు ఇంత ఆలస్యం ఎందుకు అయిందనే దానిపై సంతృప్తికర కారణం చూపలేదని కోర్టు గుర్తించింది.
బాధితురాలు ఇతర వ్యక్తులపై కూడా ఇలాంటి కేసులు పెట్టిందని, వాటితో పాటు ఆమె ఆధార్ కార్డు వివరాలపై విచారణ చేపట్టాలని కోర్టు పోలీస్ కమిషనర్ ను హైకోర్టు ఆదేశించింది. రూ. 20 వేల వ్యక్తిగత పూచీకత్తుపై నిందితుడిని విడుదల చేయాలని, కేసు విచారణ కోసం పిలిచినప్పుడల్లా పోలీసు స్టేషన్‌లో రిపోర్టు చేసి కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.