New Delhi, August 30: దేశ రాజధాని ఢిల్లీ మహిళల భద్రతకు (Delhi most unsafe for women) అంత సేఫ్ కాదని NCRB data తెలిపింది. ఢిల్లీలో గత ఏడాది ప్రతి రోజు సగటున ఇద్దరు మైనర్ అమ్మాయిలు అత్యాచారానికి (2 minors raped every day last year) గురైనట్లు ఎన్సీఆర్బీ తన తాజా రిపోర్ట్‌లో పేర్కొన్నది.2021లో మహిళలపై ఢిల్లీలో 13,892 కేసులు నమోదు అయ్యాయి. 2020తో పోలిస్తే అది 40 శాతం ఎక్కువగా అని తేలింది.
2020లో ఢిల్లీలో కేవలం 9782 క్రైమ్ కేసులు మాత్రమే నమోదు అయినట్లు డేటా పేర్కొన్నది. దేశంలోని 19 మెట్రో నగరాలతో పోలిస్తే ఢిల్లీలో నమోదు అయిన కేసుల సంఖ్య 32.20 శాతంగా ఉన్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. ఢిల్లీ తర్వాత స్థానంలో ముంబై నిలిచింది. ఆ నగరంలో 5543 కేసులు నమోదు అవ్వగా, ఆ తర్వాత బెంగుళూరులో 3127 కేసులు రికార్డు అయ్యాయి. ముంబైలో 12.76 శాతం కేసులు రికార్డు అవ్వగా, బెంగుళూరులో ఆ సంఖ్య 7.2 శాతంగా ఉంది.
ఇక ఢిల్లీలో మహిళల కిడ్నాప్ సంఖ్య ఎక్కువగా ఉంది. అక్కడ 3948 కిడ్నాప్ కేసులు నమోదు అయినట్లు ఎన్సీఆర్బీ డేటా స్పష్టం చేసింది. భర్త క్రూరత్వం కింద 4674 కేసులు నమోదు అయ్యాయి. ఇక బాలికల అత్యాచార కేసుల సంఖ్య 833గా ఉంది. ఈ డేటా ఆధారంగా గత ఏడాది ఢిల్లీలో ప్రతి రోజు ఇద్దరు అమ్మాయిలు రేప్‌కు గురైనట్లు అంచనాకు వచ్చారు. 2021లో దేశవ్యాప్తంగా 19 మెట్రో నగరాల్లో 43,414 కేసులు నమోదు అవ్వగా, దాంట్లో కేవలం ఢిల్లీలోనే 13,982 కేసులు నమోదు అయ్యాయి.
ఆత్మహత్యల సంఖ్యాపరంగా దేశవ్యాప్తంగా చూస్తే మహారాష్ట్రలో వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. జాతీయ నేర గణాంకాల బ్యూరో తాజా నివేదికలో పలు విషయాలను ప్రస్తావించింది. 2021 ఏడాదిలో దేశవ్యాప్తంగా 1,64,033 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వృత్తి సమస్యలు, ఒంటరితనం, హింస, కుటుంబ, మానసిక సమస్యలు, మద్యానికి బానిసకావడం, ఆర్థికంగా కుంగుబాటు, అనారోగ్యం ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలని నేర గణాంకాల బ్యూరో తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 22,207 మంది, కర్ణాటకలో 13,056 మంది సూసైడ్ చేసుకున్నారు. దేశంలోని మొత్తం ఆత్మహత్యల్లో సగానికిపైగా సూసైడ్‌లు మహారాష్ట్ర తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్ణాటకలోనే జరిగాయి. 53 నగరాల్లో మొత్తంగా 25వేలకుపైగా సూసైడ్ చేసుకున్నారు.
గత ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన 4.22 లక్షల ట్రాఫిక్ ప్రమాదాల్లో 1.73 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని జాతీయ నేర గణాంకాల బ్యూరో తెలిపింది. యూపీలో ఎక్కువ మరణాలు సంభవించాయి. 2020తో పోలిస్తే 2021లో మరణాలు 18.8 శాతం పెరగడం ఆందోళనకరం.
తెలంగాణలో పెరిగిన క్రైం రేటు
2021లో తెలంగాణలో క్రైం రేటు విపరీతంగా పెరిగింది. అంతేకాదు మహిళలపై దాడులు, చిన్నారులపై లైంగిక వేధింపులు సైతం భారీగా పెరిగాయి. సైబర్ నేరాల్లోనూ తెలంగాణ దేశంలోనే తొలిస్థానలో ఉందని జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడించింది. ఈ మేరకు జాతీయ నేర గణాంక సంస్థ 2021 నివేదిక ప్రకటించింది. దీని ప్రకారం మానవ అక్రమ రవాణా, ఆహార కల్తీ కేసుల్లోనూ తెలంగాణ మళ్లీ టాప్‌గా నిలిచింది. ఇక రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది
2019లో 2,691 సైబర్ నేరాలు నమోదవ్వగా. .2020లో ఈసంఖ్య 5,024కు చేరింది. కాగా 2021లో సైబర్ నేరాలు 200 శాతం పెరిగి ఏకంగా 10,303కు చేరాయి. దేశ వ్యాప్తంగా 52, 430 సైబర్ నేరాల కేసులు వెలుగు చూస్తే అత్యధికంగా తెలంగాణలోనే 20 శాతం నమోదవుతున్నాయి. సైబర్ నేరాల్లో 8, 829 కేసులతో ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.
ఇక తెలంగాణలో ఆర్థిక నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. 2019లో 11, 465.. 2020లో 12.985..కేసులు నమోదయితే 2021లో ఏకంగా 20,759 కేసులు వచ్చాయి. 23, 757 ఆర్థిక నేరాల కేసులతో రాజస్థాన్ అగ్ర స్థానంలో ఉంది. వృద్ధులపై దాడుల్లో తెలంగాణ మూడు, రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ఏటీఎం, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఓటీపీ, మార్ఫింగ్ మోసాలు, ఫేక్ ప్రొఫైల్ తయారీ తెలంగాణలో అధికమని ఎన్‌సీఆర్‌బీ నివేదికలో తేలింది.