Supreme Court | (Photo Credits: PTI)

New Delhi, August 11: త‌ల్లిదండ్రుల ఆస్తిలో మహిళల ఆస్తి హక్కుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆడపిల్లలకు ఆస్తిలో హ‌క్కు కల్పించడంపై దాఖలైన వేర్వేరు పిటిష‌న్‌ల‌పై విచారణ అనంతరం సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు వెల్ల‌డించింది. హిందూ వార‌స‌త్వ స‌వ‌ర‌ణ‌ చ‌ట్టం-2005 (Hindu Succession Act-2005) అమ‌ల్లోకి వ‌చ్చిన నాటికి త‌ల్లిదండ్రులు జీవించి ఉన్నా, లేకున్నా ఆడపిల్లలకు వారి ఆస్తుల‌పై కొడుకుల‌తో సమానంగా హక్కు (Equal Property Rights) ఉంటుందని తేల్చిచెప్పింది.

జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కీలక తీర్పునిచ్చింది. ధ‌ర్మాసనంలో జస్టిస్ అరుణ్ మిశ్రాతోపాటు జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఎంఆర్ షా సభ్యులుగా ఉన్నారు. కుమార్తె జీవితాంతం తండ్రిని ప్రేమిస్తూనే ఉంటుందని జ‌స్టిస్ మిశ్రా వ్యాఖ్యానించారు. ప్రకాశ్ వర్సెస్ ఫులావతి కేసులో తుది తీర్పు సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి ఈ వ్యాఖ్య‌లు చేశారు. హిందూ వారసత్వ చట్టంలో 2005 సవరణ ప్రకారం కుమార్తెలకు తండ్రి ఆస్తిలో సంపూర్ణ హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. సవరణ సమయం 2005 సెప్టెంబర్ 9 నాటికి తండ్రి జీవించి ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఆమెకు వారసత్వ హక్కు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. ప‌ది రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని మోదీ రివ్యూ మీటింగ్, కోవిడ్ పరిస్థితులు, అన్‌లాక్‌ 3 అమలు తీరుపై సీఎంలను అడిగి తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

2005లో చట్టం అమల్లోకి వచ్చేనాటికి తండ్రి చనిపోతే సోదరులు ఆస్తిలో వాటా నిరాకరించడంపై దాఖలైన పిటిషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం 2005 నాటికి తండ్రి మరణించినా, బతికి ఉన్నా ఆడపిల్లలకు సమాన వాటా దక్కాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ అంశంపై ట్రయల్ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న విషయాలను ఆరు నెలల్లో నిర్ణయించాలని ధర్మాసనం ఆదేశించింది.

1956 నాటి హిందూ వారసత్వ చట్టానికి 2005లో సవరణ‌లు చేశారు. 2005 సెప్టెంబర్ 9న ఆ చ‌ట్టానికి భార‌త‌ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. తండ్రి సంపాదించిన ఆస్తిలో ఆడ‌బిడ్డ‌ల‌కు సమాన హక్కు ఉంటుందని ఆ చ‌ట్టంలో పేర్కొన్నారు. హిందూ వారసత్వ చట్టంలో సవరణలు చేపట్టే నాటికే కుటుంబంలో ఉన్న ఆడ‌పిల్ల‌ల‌కు కూడా కొత్త చ‌ట్టం వ‌ర్తిస్తుంద‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టంచేసింది.

ప్రకాశ్ వర్సెస్ ఫులావతి కేసులో బాధితురాలి తండ్రి 1999 డిసెంబర్ 11న మరణించారు. ఆస్తిలో ఆడపిల్లకు సమానహక్కు క‌ల్పించే హిందూ వార‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం 2005లో అమ‌ల్లోకి వ‌చ్చినందున ఆ సవరణ జ‌రిగిన‌ తేదీని ప్రాతిపదికగా తీసుకుంటే ఫులావతికి ఆస్తిలో సమానహక్కు దక్కదనేది ప్ర‌తివాదుల వాద‌న‌. దీనిపై భిన్న వాదనలు విన్న‌ సుప్రీంకోర్టు చివ‌రికి వివాదానికి తెరదించింది. ఇంట్లో ఆడపిల్ల ఉంటే చాలు ఆస్తిలో సమానహక్కు ఉంటుందని స్పష్టంచేసింది.