Bhopal, August 22: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన (Madhya Pradesh Shocker) చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ పెరిగి పెద్దది కావడంతో భార్య తన భర్తపై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో గల సన్వెర్ తాలూకా గురాన్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు కృష్ణాబాయి, ప్రహ్లాద్ బోరాన శుక్రవారం రాత్రి గొడవ పడ్డారు. గొడవ పెద్దది కావడంతో ఆగ్రహించిన భార్య కృష్ణాబాయి, వంట చేస్తున్న స్టవ్ నుంచి కిరోసిన్‌ను భర్త ప్రహ్లాద్‌పై (Woman pours kerosene on husband) పోసింది. అనంతరం అగ్గిపుల్ల గీసి నిప్పంటించింది. దీంతో మంటలు అంటుకోవడంతో రక్షించాలంటూ ప్రహ్లాద్ కేకలు వేశాడు.
కాగా, ఆగ్రహంతో తాను చేసిన పనికి భార్య కృష్ణాబాయి కంగారుపడింది. వెంటనే స్పందించి భర్త దుస్తులకు అంటుకున్న మంటలను (sets him on fire in Sanwer) ఆర్పివేసింది. అయితే అప్పటికే ప్రహ్లాద్‌కు 30 శాతం కాలిన గాయాలయ్యాయి. దీంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై ఆరా తీశారు. భర్త ప్రహ్లాద్ స్టేట్‌మెంట్ తీసుకున్నారు. అతడిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించిన భార్య కృష్ణాబాయిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతామని పోలీస్ అధికారి తెలిపారు.