Mumbai, NOV 15: సహారా గ్రూప్ వ్యవస్థాపకులు సుబ్రతా రాయ్ (Subrata Roy Dies) దీర్ఘకాల అనారోగ్యంతో మంగళవారం రాత్రి ముంబయిలో కన్నుమూశారు. సహారా ఇండియా పరివార్ (Sahara Group) వ్యవస్థాపకుడు అయిన సుబ్రతా రాయ్ (Subrata Roy) వయసు 75 సంవత్సరాలు. ‘‘సుబ్రతారాయ్ జీ స్ఫూర్తిదాయకమైన నాయకుడు, దార్శనికుడు. రక్తపోటు, మధుమేహం సమస్యలతో బాధపడుతూ గుండెపోటు కారణంగా నవంబర్ 14వతేదీ రాత్రి 10.30 గంటలకు మరణించారు. రాయ్ ఆరోగ్యం క్షీణించిన తర్వాత నవంబర్ 12వతేదీన కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో చేరి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించారు’’ అని సహారా గ్రూప్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు , ఛైర్మన్ సుబ్రతా రాయ్‌కు భార్య స్వప్నా రాయ్, ఇద్దరు కుమారులు సుశాంతో రాయ్, సీమాంటో రాయ్ విదేశాల్లో నివసిస్తున్నారు. 1948వ సంవత్సరం జూన్ 10వతేదీన బీహార్ రాష్ట్రంలోని అరారియాలో జన్మంచిన రాయ్ ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, మీడియా, హాస్పిటాలిటీతోపాటు పలు రంగాల్లో వ్యాపారాలు చేశారు. కేవలం రెండువేల రూపాయల మూలధనంతో ప్రారంభించి సహారా వ్యాపార సంస్థ అగ్రగామిగా నిలిచేందుకు కంపెనీ చాలా దూరం ప్రయాణించిందని సహారా తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. రాయ్ గోరఖ్‌పూర్‌లోని ప్రభుత్వ సాంకేతిక సంస్థలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో విద్యను అభ్యసించి 1976వ సంవత్సరంలో నష్టాల్లో ఉన్న చిట్ ఫండ్ కంపెనీ సహారా ఫైనాన్స్ ను స్వాధీనం చేసుకొని వ్యాపారం ప్రారంభించారు.
BREAKING: Subrata Roy, chairman of the Sahara Group, passes away aged 75 in Mumbai. (Rest in peace also to the life savings of thousands that he is alleged to have preyed on to build his empire.) pic.twitter.com/JrfpoHQhgu
— Shiv Aroor (@ShivAroor) November 14, 2023
1978 వ సంవత్సరం నాటికి సహారా ఇండియా పరివార్ గా (Sahara Group) మార్చి అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. 1992వ సంవత్సరంలో రాయ్ రాష్ట్రీయ సహారా పేరిట హిందీ భాషా వార్తాపత్రికను ప్రారంభించారు. 1990వ సంవత్సరంలో పుణె నగర సమీపంలో ప్రతిష్ఠాత్మక అంబీ వ్యాలీ సిటీ ప్రాజెక్టును చేపట్టారు. సహారా టీవీని కూడా ప్రారంభించి దాన్ని సహారా వన్ గా (Sahara One) మార్చారు. 2000 వ సంవత్సరంలో సహారా లండన్‌లోని గ్రోస్వెనర్ హౌస్ హోటల్,న్యూయార్క్ నగరంలోని ప్లాజా హోటల్ వంటి ఐకానిక్ ప్రాపర్టీలను కొనుగోలు చేసి అంతర్జాతీయ ఖ్యాతి గడించారు.
దేశంలో రైల్వేల తర్వాత సహారా ఇండియా పరివార్ రెండవ అతిపెద్ద సంస్థగా టైమ్ మ్యాగజైన్ ప్రశంసించింది. 9 కోట్లమంది పెట్టుబడిదారులతో 1.2 మిలియన్ల మంది ఉద్యోగులున్న సహారా సంస్థ అతిపెద్ద ఉఫాధి సంస్థగా ఎదిగింది. ఎన్నెన్నో వ్యాపార విజయాలు సాధించిన రాయ్ 2014వ సంవత్సరంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వివాదంతో అరెస్టు అయి తీహార్ జైలులో గడిపారు. అనంతరం అతను పెరోల్ పై విడుదలయ్యారు.
రాయ్ ఈస్ట్ లండన్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, లండన్‌లోని పవర్‌బ్రాండ్స్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్‌లో బిజినెస్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సహా పలు అవార్డులు అందుకున్నారు. రాయ్ ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని అందించే సహారా ఎవోల్స్ వంటి వెంచర్‌లు ప్రారంభించారు. చిన్న పట్టణాలు ,గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ఎడుంగూరుతో ఆన్‌లైన్ విద్యా రంగంలోకి ప్రవేశించాలని యోచించారు.
సహారా గ్రూప్‌లోని ఉద్యోగులు రాయ్ ను సహరాశ్రీగా సంభోదించేవారు. సహారా భారత క్రికెట్, హాకీ జట్లను కూడా స్పాన్సర్ చేసింది. ఈయనకు ఫార్ములా వన్ రేసింగ్ జట్టు ఉంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం రాయ్ తన ఇద్దరు కుమారుల వివాహాలు అత్యంత వైభవంగా చేశారు. ఈయనకు రాజకీయ, బాలీవుడ్ రంగాల్లో ప్రముఖులు స్నేహితులు. రాయ్ తన రెండు కంపెనీల పెట్టుబడిదారులకు 20,000 వేల కోట్లకు పైగా తిరిగి చెల్లించకపోవడం వల్ల తలెత్తిన ధిక్కార కేసులో కోర్టు ముందు హాజరుకాకపోవడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2014వ సంవత్సరంలో అతన్ని అరెస్టు చేశారు. తరువాత అతనికి బెయిల్ లభించింది, కానీ అతని వ్యాపార సంస్థల్లో ఇబ్బందులు కొనసాగాయి.