New Delhi, Nov 23: ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత వ్యవస్థలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. తమకు అనుగుణంగా వ్యవహరించే వ్యక్తినే సీఈసీగా నియమిస్తుందని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దేశ ప్రధాన మంత్రిపై సైతం చర్యలు తీసుకునేంత సత్తా ఉన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ ( Election Commissioner) ప్రస్తుతం మన దేశానికి చాలా అవసరమని దేశ సర్వోత్తమ న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఎన్నికల అధికారిని రాజకీయ పార్టీల ప్రభావం నుంచి దూరంగా ఉంచాలని, అప్పుడే వారు స్వతంత్రంగా వ్యవహరించగలరని వ్యాఖ్యానించింది. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయాలంటే.. ప్రధాన ఎన్నికల అధికారి నియామకం కోసం ఏర్పాటు చేసే కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా చేర్చాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి.. ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థ సరికాదని.. కొలీజియంలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సి.టి.రవికుమార్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం బుధవారం కూడా విచారణ కొనసాగించింది. ఈ క్రమంలోనే బుధవారం విచారణ సందర్భంగా ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది బెంచ్.
ఈ సందర్భంగా కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. 1991 చట్టం ప్రకారం జీతాలు, పదవీకాలాల విషయంలో ఎన్నికల కమిషన్ స్వతంత్రంగానే ఉందని తెలిపారు. సీఈసీ నియామక ప్రక్రియలో ప్రస్తుతం ఉన్న వ్యవస్థ సరిగ్గానే ఉందని, ఇందులో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. సీనియర్ అధికారుల జాబితాను ఎంపిక చేసి దాన్ని న్యాయశాఖకు ఆ తర్వాత ప్రధానికి పంపుతామని తెలిపారు.
దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వ్యవస్థ సరిగా లేదని మేం చెప్పడం లేదు. అయితే ఓ పారదర్శక ప్రక్రియ అవసరం అని అభిప్రాయపడింది.ఎప్పుడూ సివిల్ సర్వెంట్లను ఎందుకు ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తున్నారని ప్రశ్నించింది. దీనికి ఏజీ బదులిస్తూ.. ఇది సంప్రదాయంగా వస్తోంది. దాన్ని మేం ఎలా పాటించకుండా ఉంటాం. ఈ పదవి కోసం జాతీయ స్థాయిలో ఎన్నికలు పెట్టడం సాధ్యం కాదని తెలిపారు.
కేంద్రం వాదనపై అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ.. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేయాలంటే.. కింది స్థాయి నుంచే పారదర్శక నియామక ప్రక్రియ ఉండాలని సూచించింది.దీనికి ఉదాహరణను నొక్కి చెప్పింది. ధర్మాసనం స్పందిస్తూ.. ప్రధానికి వ్యతిరేకంగా ఆరోపణలు వచ్చాయనుకుందాం. ఆ సమయంలో సీఈసీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సీఈసీ గనుక బలహీనంగా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోలేరు కదా అని పేర్కొంది. అది వ్యవస్థను నిర్వీర్యం చేసినట్లు కాదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమైతే ప్రధానిపై చర్యలు తీసుకునే సీఈసీ కావాలి. అందుకే, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నియామకం కోసం సమ్మిళిత ప్రక్రియ అవసరం. ఈ నియామకం కోసం ఏర్పాటు చేసే కమిటీలో సీజేఐను కూడా సభ్యుడిగా చేర్చాలని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ తాజా నియామకాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతుండగా ఆ నియామకం ఎలా చేపట్టారని ప్రశ్నించింది. గోయల్ నియామకానికి సంబంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ.. విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. ప్రభుత్వం తీరుపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈసీ, సీఈసీల నియామకాలకు సంబంధించి ప్రభుత్వాలు 72 ఏళ్లుగా చట్టం తీసుకురాకపోవడాన్ని ప్రశ్నించింది. సీఈసీ, ఈసీ నియామక ప్రక్రియపై రాజ్యాంగ మౌనాన్ని ప్రభుత్వాలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయంటూ సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
సర్వోత్తముడైన వ్యక్తిని ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించేలా ఓ వ్యవస్థను రూపొందించాలని కేంద్రానికి సూచించింది. ఈ క్రమంలో మాజీ సీఈసీ టీఎన్ శేషన్‌ను గుర్తు చేస్తూ.. అలాంటి గట్టి వ్యక్తి, సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సమర్థతే కాకుండా దృఢమైన వ్యక్తిత్వం ఉన్నవారిని సీఈసీగా నియమించేందుకు సరైన విధానం రూపొందించాలని అటార్నీ జనరల్ (ఏజీ) ఆర్.వెంకటరమణికి సూచించింది.
ఏజీ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన బెంచ్.. 2004 నుంచి ఒక్క సీఈసీ కూడా ఆరేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేయలేదని తెలిపింది. యూపీఏ, ఎన్డీయే హయాంలో సీఈసీలు మారిన విషయాన్ని గుర్తు చేసింది. అందువల్ల దృఢమైన వ్యక్తులను నియమించేందుకు స్పష్టమైన విధానం ఉండాలని అభిప్రాయపడింది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియంలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ పిల్ దాఖలైంది గతంలో. ఈ పిల్‌ను అక్టోబర్ 2018లో సీఈసీ, ఈసీలతో కూడిన ఐదుగురు జడ్జిల బెంచ్‌కు సిఫార్సు చేసింది. అయితే కేంద్రం మాత్రం అలాంటి వ్యవస్థ అవసరం లేదంటూ వాదిస్తూ వస్తోంది.