Bengaluru Water Crisis: నీటి సంక్షోభంతో బెంగుళూరును వదిలేస్తున్న టెకీలు, సొంతూరు నుంచి వర్క్ ఫ్రం హోం చేసే దిశగా ఆలోచనలు, నగరంలో తీవ్రమయిన నీటి కొరత
Begaluru Water Crisis (Photo-x/ chitralekha)

Bengaluru, Mar 13: బెంగళూరు వాసుల నీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. బోర్లు ఎండిపోవడంతో గుక్కెడు తాగునీటికీ జనం అల్లాడిపోతున్నారు. స్కూళ్లలో విద్యార్థులకు తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడిందంటే నగరంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నీటి కొరత వల్ల పాఠశాలలను మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని పాఠశాలలు ఇప్పటికే ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నాయి. అటు నగర జలమండలి కూడా సరిపడా నీటిని సరఫరా చేయడం లేదు. దీంతో ప్రజలు ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన దుస్థితి. దీంతో డిమాండ్‌ ఎక్కువవడంతో ట్యాంకర్ల ధరలు అమాంతం పెంచేశారు.

సిటీ అంతటా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. వాటర్ ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీళ్లు సరిపోక ప్రతీ నీటి చుక్కనూ జాగ్రత్తగా వాడుకుంటున్నారు. గొంతు తడుపుకోవడానికే సరిగా నీళ్లు దొరకక ఇబ్బంది పడుతుండడంతో వంట పాత్రలు కడగలేక ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెడుతున్నామని చెబుతున్నారు. గడిచిన నెల రోజుల్లో తాను కేవలం ఐదు సార్లు మాత్రమే స్నానం చేశానని ఓ టెకీ చెప్పాడంటే నీటి కరవు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  బెంగుళూరు వాసులకు చుక్కలు చూపిస్తున్న నీటి కొరత, మా ఇంట్లోనూ బోరుబావి ఎండిపోయిందని తెలిపిన డిప్యూటీ సీఎం డికె శివకుమార్

నగరంలో రోజుకు 2,600-2,800 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే) నీటి అవసరం ఉంటే ఇప్పుడు దాదాపుగా 1,300 ఎంఎల్‌డీ నీరు మాత్రమే సరఫరా అవుతోంది. అంటే, అవసరమైన నీటిలో సగం కూడా సరఫరా జరగడం లేదు. మరోవైపు ఎండాకాలం ఇంకా పూర్తిగా ప్రారంభం కాకముందే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోవు రోజుల్లో పరిస్థితి ఇంకా ఎంత స్థాయికి దిగజారుతుందోనని నగరవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

Here's Videos

ఇక వాటర్ ట్యాంకర్ కు రేటు ఫిక్స్ చేసి, అంతకంటే ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో పరిస్థితి కాస్త చక్కబడుతుందని భావించిన జనాలకు కొత్త సమస్య ఎదురైంది. ప్రభుత్వం కల్పించుకోవడంతో వాటర్ ట్యాంకర్ సప్లయర్లు ట్యాంకర్లను తగ్గించారని జనం ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కూడా వాటర్ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నా.. ఆ ట్యాంకర్ ఎప్పుడొస్తుందో తెలియట్లేదని, ఆన్ లైన్ లో ఆర్డర్ చేసేందుకు అవకాశం కల్పించలేదని విమర్శిస్తున్నారు.  బెంగుళూరులో నీటి సంక్షోభం, కారు వాషింగ్, స్విమ్మింగ్ పూల్స్‌పై నిషేధం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరాఫరా చేస్తామని తెలిపిన ప్రభుత్వం

మళ్లీ వర్షాలు పడితే తప్ప పరిస్థితి మామూలు స్థితికి వచ్చేలా కనిపిచండం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పాలకులపై ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. వరుసగా అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న తీరులోనే సమస్యలు ఉన్నాయని అంటున్నారు. ఏ ప్రభుత్వమూ కూడా ప్రజల శ్రేయస్సును పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లు, రోడ్లను నిర్మించడంపైనే దృష్టి పెడుతున్నారని, భూగర్భజలాలపై దృష్టి పెట్టడం లేదని అన్నారు. అలా చేసి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నీటి కటకట నేపథ్యంలో చాలా మంది టెకీలు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఎంచుకుంటున్నారు. ఇంట్లో ఉంటూ నీటిని పొదుపుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, సొంతూళ్లకు వెళ్లడమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టెకీలు సొంతూళ్లకు వెళ్లి అక్కడి నుంచి వర్క్ చేయడం వల్ల సిటీలో జనాభా తగ్గి నీటి కష్టాలు కొంత తగ్గుతాయని బెంగళూరు వాసులు అంటున్నారు.

నగరంలో తీవ్రమైన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని నీటిని అవసరాల మేరకు వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. తాగునీటిని వాహనాలను తుడిచేందుకు, నిర్మాణం, వినోద కార్యకలాపాల్లో వాడొద్దని, అదేవిధంగా సినిమా హాళ్లు, మాల్స్‌లో తాగునీటి అవసరాల మినహా ఇతరత్రా కోసం వినియోగించవద్దని స్పష్టం చేసింది. ఉల్లంఘనకు పాల్పడిన వారిపై మొదటగా రూ.5 వేలు జరిమానా పడుతుందని, పదేపదే నీటి వృథాతో ఉల్లంఘనకు పాల్పడితే అదనంగా ప్రతిసారి రూ.500 చొప్పున ఫైన్‌గా చెల్లించాల్సి ఉంటుందని బెంగళూరు జలమండలి హెచ్చరించింది.