Ambati Rayudu (Photo-IPL)

రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో చెన్నై విజేతగా నిలిచింది. బంతి బంతికి ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో ధోనీ సేన దుమ్మురేపింది. వరుణుడి ఆటంకం మధ్య డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో ఫలితం తేలిన పోరులో చెన్నై 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ను మట్టికరిపించింది. తద్వారా ఐపీఎల్లో ఐదో టైటిల్‌ నెగ్గి.. ముంబై ఇండియన్స్‌ను సమం చేసింది.

ఇక చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లతో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో తన ఐపీఎల్ కెరీర్ కి ముగింపు పలికాడు. గుజరాత్‌తో ఐపీఎల్‌ ఫైనల్‌ రూపంలో తన కెరీర్‌లో ఆఖరి మ్యాచ్‌ ఆడిన అతడు కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి ఉన్నంతసేపు మెరుపు షాట్లతో చెన్నైని విజయానికి చేరువ చేసి ఔటయ్యాడు.25 బంతుల్లో 55 పరుగులు చేయాల్సి స్థితిలో క్రీజులోకి వచ్చిన అతడు.. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్లో మోహిత్‌ బౌలింగ్‌లో వరుసగా 6,4,6తో లక్ష్యాన్ని తేలిక చేశాడు.

రిటైర్మెంట్ రూమర్స్‌కు చెక్ పెట్టిన ధోనీ, మరో ఐపీఎల్ సీజన్ ఆడుతానని స్పష్టం చేసిన సీఎస్కే కెప్టెన్

అతడు ఔటయ్యేసరికి చెన్నై 15 బంతుల్లో 23 పరుగులు చేయాలి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అంబటి.. ఐపీఎల్‌కు అల్విదా చెప్పడంతో ఇక మైదానంలో కనబడడు. ఐపీఎల్‌లో 204 మ్యాచ్‌లు ఆడిన రాయుడు 4348 పరుగులు చేశాడు. 23సార్లు 50 పైన స్కోర్లు సాధించాడు. ముంబయి తరఫున మూడుసార్లు (2013, 15, 17), చెన్నై తరఫున మూడుసార్లు (2018, 2021, 2023) ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

ఒక్క వీడియోతో అన్ని రూమర్లకు పుల్‌స్టాప్, జడేజాను ఎత్తుకుని కన్నీటి పర్యంతమైన ధోనీ, మిలియన్‌కు పైగా వ్యూస్‌తో దూసుకుపోతున్న వీడియో

ఫైనల్ తర్వాత రిటైర్ అవుతున్న అంబటి రాయుడు మాట్లాడుతూ.. "అవును, ఇది ఒక అద్భుత కథ ముగింపు. నేను ఇంతకు మించి అడగలేకపోయాను. నా ఉద్దేశ్యం ఇది నమ్మశక్యం కాదు. నిజంగా గొప్ప జట్లలో ఆడినందుకు అదృష్టం. నేను నా జీవితాంతం నవ్వగలను. గత 30 సంవత్సరాలుగా చేసిన కృషి అంతా ఈ రాత్రికి పూర్తి అయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను నిజంగా ఆడాలనుకుంటున్నాను. ఈ ఉద్యమంలో నాకు సహకరించిన నా కుటుంబానికి కృతజ్ఞతలు. ముఖ్యంగా మా నాన్నగారికి అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.

Dhoni on Rayudu

Rayudu Speech

ఇక గత కొన్నేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన రాయుడికి ధోనీ అరుదైన గౌరవం కల్పించాడు. ట్రోఫీని అందుకునే సమయంలో.. తాను పక్కకు నిల్చొని రాయుడిని ట్రోఫీ అందుకోవాలని సూచించాడు. దీంతో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, జై షా చేతుల మీదుగా రాయుడు ట్రోఫీని అందుకున్నాడు. అంబటి రాయుడి పట్ల ధోనీకి ఉన్న గౌరవానికి, నమ్మకానికి ఈ ఘటనే నిదర్శనం.

రాయుడి గురించి ధోనీ మాట్లాడుతూ.. అతడు మైదానంలో ఉంటే నూటికి నూరు శాతం అంకితభావంతో ఆడతాడన్నాడు. రాయుడు జట్టులో ఉన్నప్పుడు తానెప్పుడూ ఫెయిర్ ప్లే అవార్డు గెలవలేదని.. అతడు త్వరగా రియాక్ట్ అవుతాడని ధోనీ సరదాగా చెప్పాడు. రాయుడు అద్భుతమైన క్రికెటర్ అని ప్రశంసించిన ధోనీ.. తామిద్దరం కలిసి ఇండియా-ఏ తరఫున ఆడామని గుర్తు చేసుకున్నాడు. స్పిన్, ఫాస్ట్ బౌలర్లను ఇద్దర్నీ రాయుడు సమర్థవంతంగా ఎదుర్కొంటాడన్న మహీ.. ఈ మ్యాచ్‌లో అతడు ఏదైనా స్పెషల్ చేస్తాడని భావించానని.. అతడిని చూస్తే ఆనందంగా ఉందన్నాడు. ఈ మ్యాచ్‌ను రాయుడు చాలా కాలంపాటు గుర్తుంచుకుంటాడన్న ధోనీ.. రాయుడు కూడా తనలాగే ఫోన్‌ను ఎక్కువగా వాడడని చెప్పాడు.

మ్యాచ్ అనంతరం రాయుడు మాట్లాడుతూ.. ముంబై, చెన్నై జట్ల తరఫున ఐపీఎల్లో ఆడటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు. నా మిగతా జీవితం మొత్తం హాయిగా నవ్వగలనని ఆరు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన రాయుడు తెలిపాడు. గత 30 ఏళ్లుగా నేను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇలా కెరీర్‌ను ముగిస్తుండటం సంతోషంగా ఉందని రాయుడు తెలిపాడు. మా నాన్నకు, కుటుంబానికి ధన్యవాదాలు. వాళ్లు లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదని రాయుడు తెలిపాడు.

Mumbai Indians Tweet

YSRCP Tweet

ఈ సారి తాను ఫైనల్ ఆడటం ఖాయమని ​రాయుడు పదే పదే చెప్పేవాడని.. అతడి నమ్మకమే నిజమైందని చెన్నై పేసర్ దీపక్ చాహర్ చెప్పాడు. అతడి నమ్మకం అమోఘమైందన్నాడు. ఈ ఐపీఎల్ టైటిల్‌ను అంబటి రాయుడికి సీఎస్కే అంకితం ఇచ్చింది. గత ఏడాది ప్లేఆఫ్స్ చేరకోలేక చతికిల పడిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈసారి టైటిల్ గెలవడం ఆనందాన్ని ఇచ్చిందన్న రుతురాజ్ గైక్వాడ్.. రిటైర్ అవుతోన్న రాయుడికి టైటిల్‌ను అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఫైనల్ ముగిశాక రాయుడు, జడేజాతో కలిసి ధోనీ నవ్వుతూ గడిపిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడకుండా.. 200కిపైగా ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఏకైక భారత క్రికెటర్ రాయుడే కావడం విశేషం. ఆరుసార్లు ఐపీఎల్ ఛాంపియన్, లెజెండ్.. విన్నర్.. హ్యాపీ రిటైర్మెంట్ అంబటి అంటూ.. ముంబై ఇండియన్స్ రాయుడిని ఉద్దేశించి ట్వీట్ చేసింది.

చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన ఈ విజయం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఆ జట్టుకు అభినందనలు తెలియజేసింది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పారటీ చీఫ్ వీ విజయసాయి రెడ్డి కొద్దిసేపటి కిందటే ట్వీట్ పోస్ట్ చేశారు. చివరి బంతి వరకు ఉత్కంఠతను రేకెత్తించిన ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కూడా అద్భుతంగా పోరాడాయని అన్నారు.

ఈ పోరాటంలో ఎవరో ఒకరే విజయం సాధిస్తారని వ్యాఖ్యానించారు.అలాగే గుంటూరుకు చెందిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడి పేరును విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు తన ట్వీట్‌లో. అంబటి రాయుడికి బెస్ట్ విషెస్ తెలియజేస్తోన్నానని పేర్కొన్నారు. ఐపీఎల్‌‌కు రిటైర్మెంట్ ప్రకటించి, తన జీవితంలో నెక్స్ట్ ఇన్నింగ్‌ను ఆరంభించనున్న అంబటి రాయుడుకు ఆల్ ది బెస్ట్.. అంటూ ట్వీట్‌ను ముగించారు.