Kolkata, NOV 11: ఒకరు లేదా ఇద్దరి పై ఆధారపడకుండా జట్టు మొత్తం సమిష్టిగా రాణించే అతి కొద్ది టీమ్స్‌లలో న్యూజిలాండ్ (New Zealand) ఒకటి. ఆల్‌రౌండర్లే ఆ జట్టుకు అతి పెద్ద బలం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కివీస్ ఎంతో ప్రమాదకారి. నిలకడగా రాణించడం ఆ జట్టుకు సాధ్యమైనంతగా మరే జట్టుకు సాధ్యం కాదు అనడంలో అతి శయోక్తి లేదేమో. వన్డే ప్రపంచకప్ 2023లో శ్రీలంకను ఓడించి కివీస్ తన సెమీస్ ఫైనల్ అవకాశాలు మెరుగుపరచుకుంది. అఫ్గాన్, పాకిస్థాన్‌లు తమ చివరి మ్యాచుల్లో విఫలం కావడంతో కివీస్ సెమీస్‌కు (Semi Finals) చేరుకుంది. వన్డే ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్స్‌కు చేరుకోవడం కివీస్ కు వరుసగా ఇది ఐదో సారి. 2007, 2011, 2015, 2019, 2023 వన్డే ప్రపంచకప్‌లలో సెమీఫైనల్స్ చేరుకుంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు మెగాటోర్నీల్లో ఆ జట్టు ఎంత నిలకడగా రాణిస్తుందో అని చెప్పడానికి. ఇందులో రెండు సార్లు సెమీ ఫైనల్‌లోనే ఓడిపోగా, మరో రెండు సార్లు ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. ఓడిన ఆ రెండు సార్లు కూడా శ్రీలంక చేతిలోనే కావడం గమనార్హం.
FIVE STRAIGHT ODI WORLD CUP SEMI-FINALS 👏
2007 ✅
2011 ✅
2015 ✅
2019 ✅
2023 ✅
Take a bow for the ever-consistent New Zealand 🙇 #CWC23 #ENGvPAK pic.twitter.com/civs7A4Drf
— ESPNcricinfo (@ESPNcricinfo) November 11, 2023
2007 వన్డే ప్రపంచకప్‌లో (World Cup) శ్రీలంకతో న్యూజిలాండ్ తలపడింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. అయితే.. లక్ష్య ఛేదనలో విఫలమైన కివీస్ 41.4 ఓవర్లలో 208 పరుగులకే కుప్పకూలింది. దీంతో శ్రీలంక 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక బ్యాటర్ మహేలా జయవర్థనే సెంచరీతో రాణించాడు.
2011లోనూ సెమీస్‌కు చేరింది కివీస్. సెమీఫైనల్ లో మళ్లీ శ్రీలంకనే ప్రత్యర్థిగా ఎదురైంది. ఈ మ్యాచ్‌లో కివీస్ మొదట బ్యాటింగ్ చేసింది. 48.4 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని లంక 47.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో వరుసగా రెండోసారి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో లంక చేతిలో కివీస్‌కు పరాభవం తప్పలేదు.
ఈ ప్రపంచకప్‌లో శ్రీలంక సెమీస్ చేరడంలో విఫలం కావడంతో న్యూజిలాండ్‌కు గండం తప్పింది. సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 43 ఓవర్లలలో 5 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. లక్ష్యాన్ని న్యూజిలాండ్ 42.5 ఓవర్లలో ఛేదింది. ఫైనల్‌కు దూసుకువెళ్లింది. అయితే.. ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.
2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్‌ను భారత అభిమానులు అంత త్వరగా మరిచిపోరు. ఈ మ్యాచ్‌లో ధోని రనౌట్ భారత అవకాశాలను దెబ్బతీసింది. ధోనికి ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 49.3 ఓవర్లలలో 221 పరుగులకే ఆలౌటైంది. దీంతో కివీస్ 18 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. సూపర్ ఓవర్‌ను నిర్వహించగా అక్కడ కూడా స్కోర్లు సమం అయ్యాయి. అయితే.. బౌండరీల లెక్క ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది.
ఈ సారి కూడా భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీ ఫైనల్‌లోనే తలపడుతున్నాయి. బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి భారత్ పై సెమీ ఫైనల్‌లలో తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని కివీస్ భావిస్తోండగా.. 2019 సెమీస్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.