Cyclone Michaung Update: బాపట్ల వద్ద తీరాన్ని తాకిన తుఫాను, కాసేపట్లో తీరం దాటే అవకాశం, తీరం వెంబటి పోటెత్తుతున్న అలలు, మరో 24 గంటల పాటు భారీ వర్షాలు
Cyclonic Storm (Photo-ANI)

మిచౌంగ్ తీవ్ర తుఫాన్ (Michaung Cyclone) బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, నెల్లూరు జిల్లాలో గాలుల తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ వర్షాలు కొనసాగనున్నాయి. తుఫాను ఉత్తర దిశగా నెమ్మదిగా ముందుకు కదులుతోంది.

తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 100 కిలోమీటర్లు కొన్నిసార్లు 110 కిలోమీటర్లు గాలులు వీస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో సముద్రం కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని హెచ్చరించారు. ఇటు రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు ఓ మోస్తారుగా కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు వర్షాలు కొనసాగనున్నాయి.

హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షం, పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్, మరో రెండు రోజుల పాటు భారీ వానలు, ఎల్లో, ఆరంజ్ అలర్ట్ జారీ

ప్రస్తుతం నెల్లూరు జిల్లా కావలికి 40కి.మీ, బాపట్లకు 80 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. తుపాను కారణంగా కోస్తాంధ్రతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరానికి అత్యంత దగ్గరగా తుపాను కదులుతోందని ఐఎండీ తెలిపింది. కొంతభాగం సముద్రంలో.. మరికొంత భూమిపై ఉన్నట్లు వెల్లడించింది. గడిచిన 6 గంటలుగా గంటకు 7కి.మీ వేగంతో ఉత్తర దిశగా తుపాను కదులుతున్నట్లు తెలిపింది.

Here's Rain Lash VIdeos

‘మిగ్‌జాం’ ఎఫెక్ట్‌తో కోస్తాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. విజయవాడ నగరంతో పాటు ఉమ్మడి గుంటూరు, జిల్లా, కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షం పడుతోంది. నాగాయలంక మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

వరదల్లో కొట్టుకుపోతున్న కార్లు, ఎయిర్‌పోర్ట్‌లోకి భారీగా వరద, మిచాంగ్ తుఫాను విధ్వంసానికి చెన్నై ఎలా విలవిలలాడుతుందో వీడియోల్లో చూడండి

వర్షాల తీవ్రతకు నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. ఆ జిల్లాలో తీర ప్రాంతంలోని 9 మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. తిరుమలలోని గోగర్భం, పాపవినాశనం జలాశయాల గేట్లను తితిదే అధికారులు ఎత్తివేశారు. భారీగా చేరిన వరదనీటితో జలాశయాలు పూర్తిగా నిండిన కారణంగా ఒక్కో గేటును ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. వర్షం, గాలుల తీవ్రతకు బాపట్ల జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చినగంజాం మండలంలో 15 గంటలుగా సరఫరా లేదు.

విజయవాడ నగరంలో నిన్న(సోమవారం) నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి. రోడ్లు నీట మునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మ్యాన్ హోల్స్ పూర్తిగా నిండిపోవడంతో రోడ్లమీదకు వర్షపు నీరు వచ్చి చేరుతున్నాయి. రహదారులపై భారీగా వర్షాలు నీరు వచ్చి చేరడంతో కొన్ని రోడ్లను అధికారులు పూర్తిగా మూసివేశారు.

మిగ్‌జాం తుపాను(Cyclone Michaung) ప్రభావం కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ వెల్లడించారు. ఈమేరకు విశాఖ నుంచి 23 విమానాల సర్వీసులను రద్దు(flights cancelled) చేస్తున్నట్లు చెప్పారు. ‘‘విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో ఆపరేషన్‌లో ఉంచుతున్నాం. అత్యవసర సర్వీసులు, మళ్లింపుల కోసం ఏటీసీ 24 గంటలూ పని చేస్తుంది. రన్‌వే నవీకరణ పనుల వల్ల రాత్రి 8 వరకే విమానాశ్రయంలో రాకపోకలకు అనుమతి ఇస్తున్నాం’’ అని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ తెలిపారు.

రాజమండ్రి విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దు అయ్యింది. రాజమండ్రి విమానాశ్రయం నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లే తొమ్మిది విమాన సర్వీసులను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.

తుఫాన్ కారణంగా తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో విద్యాశాఖ అధికారులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయకపోవటం వల్ల కళ్ళాల్లోనే ధాన్యం రాశులు ఉండిపోయాయి.