Vjy, Oct 13: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో సెక్షన్ 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు తరఫు న్యాయవాది వాదించగా.. ఆ సెక్షన్ వర్తించదని సీఐడీ తరఫు న్యాయవాది వాదించారు. సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 17 (మంగళవారం) మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేసింది.
చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ స్కిల్ కేసు విచారణకు ఫైబర్‌నెట్ కేసుతో సంబంధం ఉందన్నారు. మరో కేసులో చంద్రబాబును 16న ప్రవేశపెట్టేందుకు వారెంట్ తీసుకున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. కేసులపై కేసులు పెట్టి తమను సర్కస్ ఆడిస్తున్నారని వెల్లడించారు. ఇక్కడ కూడా 17ఏను ఛాలెంజ్ చేస్తున్నారా? అని లూథ్రాను జస్టిస్ త్రివేది ప్రశ్నించగా.. అవును 17ఏ ప్రతిచోటా వర్తిస్తుందని లూథ్రా తెలిపారు.
అంగళ్లు కేసులో చంద్రబాబుకు ఊరట, ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. చట్టాన్ని రద్దు చేసినా, వెనక్కి తీసుకున్నప్పటికీ నేరం జరిగినప్పుడు ఉన్న చట్టమే వర్తిస్తుందన్నారు. కొత్త చట్టం అమలులోకి రాకముందే నేరం జరిగింది కాబట్టి సవరణ చట్టం ఈ కేసుకు వర్తించదన్నారు. ఎఫ్ఐఆర్ రద్దు చేయాలన్న అంశంపై ఎంసీ గుప్తా కేసును ప్రస్తావించారు. చట్టం అమలులో ఉన్నప్పుడు జరిగిన నేరాలకు అదే చట్టం వర్తిస్తుందని వాదించారు.‘‘అధికార విధులు నిర్వర్తించడమంటే అవినీతికి పాల్పడటం కాదు కదా? అధికార విధుల నిర్వహణ ముసుగులో అవినీతికి పాల్పడే పరిస్థితి ఉండ కూడదు’’ అని రోహత్గీ వాదించారు.
‘‘అసలు ఎంక్వయిరీ విషయంలోనే నిరోధం ఉన్నప్పుడు కేసులు ఎలా ఫైల్ చేస్తారు? ఎంక్వయిరీ లేదా ఎంక్వరీ మీద నిరోధం ఉన్నప్పుడు పోలీసు అధికారి కేసు పెట్టాలని ఎలా నిర్ణయిస్తారు? పోలీసు అధికారికి కేసు నమోదు చేసే అధికారం లేనప్పుడు ఎలా కేసు నమోదు చేస్తారు?’’ అని జస్టిస్ బోస్ ప్రశ్నించారు. చట్ట సవరణ తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.. కేసు పాతదే అంటారు అంతేనా? అని ఈ సందర్భంగా జస్టిస్ త్రివేది వ్యాఖ్యానించారు.
చట్టసవరణ ముందు కేసు కాబట్టే 17ఏ వర్తించదని నా వాదన అని రోహత్గీ తెలిపారు. ‘‘17ఏ అనేది పుట్టకముందే నేరం జరిగింది కాబట్టి ఈకేసుకు చట్టసవరణ వర్తించదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. 2018 జులైలో చట్ట సవరణ జరిగింది.. 2014, 2015 కేసులకు బెనిఫిట్ డౌట్ కింద పరిగణించలేము కదా?. 17ఏ అన్నది అవినీతికి రక్షణ కాకూడదు. అవినీతి పరులను రక్షించేందుకు 17ఏ చట్టసవరణ పరికరం కాకూడదు. సెక్షన్ 19 మాదిరిగా 17ఏ సంపూర్ణంగా కేసు నమోదుకు నిరోధం కల్పించలేదు. ఈ చట్టం వచ్చింది భవిష్యత్‌లో నిజాయతీ పరులైన అధికారులకు ఇబ్బంది తలెత్తకుండా ఉండటం కోసమే’’ అని రోహత్గీ వాదించారు.
‘‘పోలీసు కేసు పెట్టగానే వెంటనే హైకోర్టుకు వెళ్లారు.. ఆ వెంటనే సుప్రీంకోర్టుకు వచ్చారు. కనీసం పోలీసు అధికారులకు విచారణ జరిపే అవకాశం దొరకని పరిస్థితి ఏర్పడింది. వరుసగా కోర్టు తర్వాత మరో కోర్టుకు రావడం మూలంగా పోలీసు విచారణకు విఘాతం కలుగుతోంది. కనీసం పోలీసులు విచారణ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి కదా’’ అని రోహత్గీ అన్నారు.
ఈ దశలో జస్టిస్ బోస్ స్పందిస్తూ.. పిటిషనర్ నా ప్రమేయం లేదంటున్నారు, ఎస్‌ఎల్‌పీ మీద మీరేమంటారని ప్రశ్నించారు. నేరమే చేయనప్పుడు ఎస్‌ఎల్‌పీ ఎందుకు వేశారని రోహత్గీ వాదించారు. అధికార విధుల నిర్వహణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాను అని పిటిషనర్ అన్నప్పుడు 17ఏ వర్తిస్తుంది. కానీ, నిర్ణయంలో తన ప్రమేయం లేనప్పుడు 17ఏ ఎలా వర్తిస్తుంది? 2018 మే 14, జూన్ 6 తేదీల్లో ఉన్న పత్రాలను హైకోర్టు ముందుంచాం. ఈ పత్రాల ఆధారంగా అప్పటికే విచారణ ప్రారంభమైనట్టు కోర్టుకు నివేదించాం. మా వాదనలను ఏపీ హైకోర్టు ఆమోదించిందని రోహత్గీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
ఇదిలా ఉంటే ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. అంతకుముందు చంద్రబాబు తరఫు న్యాయవాది లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ఫైబర్ నెట్ కేసులో ముగ్గురికి ముందస్తు బెయిల్ వచ్చిందని తెలిపారు. ఇద్దరికి రెగ్యులర్ బెయిల్ వచ్చిందని, మరికొంతమంది ప్రస్తావన లేదన్నారు. కొందరికి ముందస్తు బెయిల్, మరి కొంతమందికి రెగ్యులర్ బెయిల్ ఉన్నప్పుడు మా క్లయింట్‌కు బెయిల్ ఎందుకివ్వరని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. వాదనల అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది.