Hyderabad, November 18: తెలంగాణ ఆర్టీసీ సమ్మె (TSRTC Strike)పై సోమవారం హైకోర్టు (High Court of Telangana)లో విచారణ ముగిసింది. ఈ అంశాన్ని ఇక కార్మిక న్యాయస్థానం (Labour Court) చూసుకుంటుందని హైకోర్ట్ స్పష్టం చేసింది. సమ్మెకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్ట్ తెలిపింది. కొన్ని అంశాలలో కోర్టుకు కూడా పరిమితులు ఉంటాయని పేర్కొంది. ప్రభుత్వంతో చర్చల కోసం కమిటీ వేయాలని ఆర్టీసీ జేఏసీ (TSRTC JAC) కోరగా, కమిటీ వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ధర్మాసనం తెలిపింది. కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేలేమని హైకోర్ట్ తేల్చి చెప్పింది. చర్చలు స్వచ్ఛంధంగా, సామరస్యంగా ఉండాలని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఇక ఆర్టీసీ జేఏసీ చేస్తున్న సమ్మె చట్టబద్ధమా, కాదా? అనే విషయం హైకోర్ట్ ప్రకటించలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ అధికారం లేబర్ కోర్టుకు ఉంటుందని తెలిపింది. దీనిపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని కార్మిక శాఖ కమీషనర్ ను హైకోర్ట్ ఆదేశించింది. హైకోర్ట్ ఏం చేయలేదు అనే విషయం అర్థమవడంతోనే ఆర్టీసీ జేఏసీ...
విలీనంపై ఆర్టీసీ జేఏసీ వెనక్కి తగ్గింది, 45 రోజులుగా సమ్మె జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జీతాలు లేక కార్మికులకు కుటుంబ పోషణ భారమవుతుంది. ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులను నడిపిస్తూ ప్రమాదానికి కారణమవుతుంది, సరిపడా బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆర్టీసీ జేఏసీ వివరించంగా, ఆ విషయం లేబర్ కోర్ట్ చూసుకుంటుందని, ఈ విషయంలో తాము ప్రభుత్వాన్ని ఆదేశించలేమని హైకోర్ట్ పేర్కొంది. హైదరాబాద్ నగర ప్రజలు సిటీ బస్సులు లేకపోయినా, మెట్రో, ఎంఎంటీఎస్ ఉపయోగించుకుంటున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నాయని హైకోర్ట్ తెలిపింది.
అంతకుముందు, ప్రభుత్వం తరఫున లాయర్ వాదనలు వినిపిస్తూ ఆర్టీసీ జేఏసీ, విలీనం డిమాండ్ తాత్కాలికంగా వదులుకున్నా, మళ్లీ లేవనేత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలతో కలిసి జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు పన్నారని తెలిపారు. ఆర్టీసీ కార్పోరేషన్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని ఖరాఖండిగా ధర్మాసనం ఎదుట తమ వాదనలు వినిపించారు.