Moranchapalle village Floods (Photo-Twitter)

Warangal, July 27: తెలంగాణలో రెండు మూడురోజులుగా కురుస్తున్న జడివానకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. గ్రామ శివారులో ఉన్న వాగులోకి భారీగా వరద చేరడంతో గ్రామంలోకి ముంచెత్తింది. దీంతో ఇండ్లన్నీ నీటమునిగాయి.

సమాచారం అందుకున్న అధికారులు గ్రామస్తులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. సహాయక బృందాలు గ్రామానికి చేరుకొని  అందరినీ సురక్షితంగా కాపాడారు. ముంపు ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతానికి బోట్ల ద్వారా తరలించారు. అక్కడి నుంచి పునరావాస కేంద్రానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తరలించాయి.

మోరంచపల్లిలో ఇళ్లు పూర్తిగా నీటిలో ఎలా మునిగిపోయాయో చూడండి, దాదాపు 15 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వాగు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

హెలికాప్టర్లు, బోట్ల ద్వారా గ్రామస్తులను అధికారులు రక్షించారు. సహాయక చర్యల్లో 2 హెలికాప్టర్లు పాల్గొన్నాయి. గ్రామస్తులను  6 ఫైర్‌ డిపార్ట్‌మెంట్ బోట్లు తరలించాయి. గ్రామం మొత్తాన్ని అధికారులు ఖాళీ చేయించారు. వరదల్లో చిక్కుకున్న ఆరుగురిని హెలికాప్టర్ ద్వారా  సిబ్బంది రెస్క్యూ చేశారు.

Here's Video

వరదలో ఇంకెవరైనా చిక్కుకున్నారేమోననని సహాయక బృందాలు గాలిస్తున్నాయి. మోరంచపల్లిలో రెండు ఆర్మీ హెలికాప్టర్ల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, వరదలపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌ మోరంచపల్లిలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్‌ను పంపాలని సీఎస్‌ను ఆదేశించారు.

భారీ వరదలకు చెరువులా మారిన కాజీపేట్‌ రైల్వే స్టేషన్‌, పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ మిలటరీ అధికారులతో సీఎస్‌ శాంతికుమారి సంప్రదింపులు జరిపారు. సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్‌ వినియోగించడం కష్టంగా మారడంతో సైన్యంతో చర్చలు జరిపారు. సైన్యం అంగీకారం తెలపడంతో ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లను ప్రభుత్వం మోరంచపల్లి గ్రామానికి పంపి.. సహాయక చర్యలు చేపట్టింది.

Here's Videos

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుతున్నాయి. కుండపోత కారణంగా మోరంచ వాగు ప్రవాహం ప్రమాదకర స్థాయి దాటి మోరంచపల్లి గ్రామాన్ని ముంచెత్తిన విషయం తెలిసిందే. దీంతో కొందరు గ్రామస్తులు వర్షంలోనే బిల్డింగ్‌లపైకి ఎక్కి రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని గ్రామస్తులు వణికిపోతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది.

చాలామంది సెల్‌ఫోన్లు కూడా పని చేయడం లేదని.. దీంతో అధికారుల సాయం కోరేందుకు కూడా వీలుకావడం లేదని వాపోతున్నారు. వందేళ్ల తర్వాత ఇలాంటి స్థాయిలో వరద ముంచెత్తినట్లు తెలుస్తోంది. మోరంచపల్లి గ్రామంలో వెయ్యి జనాభా దాకా ఉంది. వానాకాలం వచ్చినప్పుడల్లా మోరంచవాగు ప్రవాహంతో గ్రామం చుట్టూ నీరు చేరుతుంటుంది.

అయితే ఈ దఫా గ్రామాన్ని వాగు పూర్తిగా ముంచెత్తడం గమనార్హం. ఈ ప్రభావంతో భూపాలపల్లి-హన్మకొండ వైపు రహదారిపై ఆరు అడుగుల ఎత్తు నుంచి నీరు ప్రవహిస్తుండగా.. రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మోరంచ వద్ద సుమారు 15 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది.