ISRO Chief K Sivan (Photo Credits: DD News/ANI/ISRO)

Bengaluru, September 07:  భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్ 2 (Chandrayaan2) లక్ష్యానికి చేరువగా వచ్చి ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈరోజు సెప్టెంబర్ 7న జాబిల్లిపై చంద్రయాన్ 2 చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టి ఉండాల్సింది. అయితే ప్రయోగం చివరి దశలో ల్యాండింగ్ చేస్తుండగా ల్యాండర్ "విక్రమ్" నుంచి సంకేతాలు నిలిచిపోవడంతో ఈ ప్రతిష్ఠాత్మక మిషన్ ఆశలు గల్లంతయాయి.

ప్రయోగం విఫలమవడంతో ఇస్రో చైర్మన్ చైర్మన్ కె. శివన్ తీవ్ర భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే, అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఆయన వెన్నుతట్టి, దగ్గరకు తీసుకొని ఓదార్చారు, తానున్నానంటూ కొండంత ధైర్యాన్నిచ్చారు.

అయితే అప్పటికీ కూడా చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైందని ఇస్రో ధృవీకరించలేదు. కేవలం విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ మాత్రమే అందడం లేదని. అది ల్యాండ్ అయిందో, క్రాష్ ల్యాండ్ అయిందో ఇంకా తెలియ రాలేదని గత అర్ధరాత్రి ఇస్రో తెలిపింది.

కాగా, తాజాగా శనివారం సాయంత్రం ఇస్రో చీఫ్ శివన్ (K.Shivan)  మాట్లాడుతూ చంద్రయాన్ 2 ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని ప్రకటించారు. చంద్రయాన్ 2 యొక్క విక్రమ్ ల్యాండర్‌తో కోల్పోయిన లింక్‌ను తిరిగి కనెక్ట్ చేసే ప్రయత్నాలు రాబోయే 14 రోజుల పాటు జరుగుతాయని డిడి న్యూస్‌తో తెలిపారు.

శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శనివారం వేకువ ఝామునకు మధ్యకాలంలో ఓ సరికొత్త చరిత్రను సృష్టించడానికి భారత్ అత్యంత సమీపానికి వచ్చి అర్ధాంతరంగా నిలిచిపోయింది. అయితే, చంద్రుని ఉపరితలం నుండి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ఇస్రో స్పేస్ కమ్యూనికేశషన్ సెంటర్ తో విక్రమ్ ల్యాండర్ సిగ్నల్స్ కోల్పోయాడు. దీంతో అనుకున్న లక్ష్యాన్ని చంద్రయాన్ 2 మిషన్ చేరుకోలేకపోయింది. ఇది పూర్తిగా విఫల ప్రయోగం అని కాకుండా 95% విజయంగా చెప్పబడింది. కాగా, చంద్రయాన్ 2 100 శాతం విజయానికి చాలా దగ్గరగా ఉందని శివన్ మరోసారి ఆశలు కల్పిస్తున్నారు.

ప్రయోగం చివరి క్షణంలో అనుకున్న ప్రణాళిక సరిగా అమలు చేయలేకపోయామని. ఆ దశలో మాత్రమే మేము విక్రమ్ లాండర్‌తో సంబంధాన్ని కోల్పోయాము మరలా కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేయలేకపోయామని శివన్ చెప్పారు. ప్రస్తుతానికి విక్రమ్ ల్యాండర్ కనెక్షన్ మాత్రమే కోల్పోయినట్లుగా తాము భావిస్తున్నాము. రాబోయే 14 రోజుల్లో మరో కొత్త కమ్యూనికేషన్ లింక్‌ను ఏర్పాటు చేయడానికి ఇస్రో ప్రయత్నిస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే చంద్రుని చుట్టూ ఆర్బిటార్ ఎలాంటి అంతరాయం లేకుండా పరిభమిస్తుందని, అందులో అదనపు ఇంధనం అందుబాటులో ఉండటం చేత అది మరో ఏడున్నర సంవత్సరాల పాటు సమాచారాన్ని చేరవేస్తుందని శివన్ తెలిపారు.