Pakistan Foreign Minister Shah Mahmood Qureshi | File Image

ఎట్టకేలకు పాకిస్థాన్ కు జ్ఞానోదయం అయినట్లుంది. భారత ప్రభుత్వం కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయగానే పాకిస్థాన్ కి ఎక్కడ లేని దు:ఖం వచ్చింది. తమ ఆస్తి ఏదో కోల్పోయినట్లు కాశ్మీర్ పట్ల, అక్కడి ప్రజల పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఏయ్ ఇండియా నిన్ను వదిలిపెట్టం, ప్రపంచ దేశాలన్నింటినీ ఏకం చేస్తాం, ఐరాసకు ఈడుస్తాం, భూకంపం పుట్టిస్తాం అని భారీ డైలాగులు పేల్చింది. చివరకు పాక్ ఎంత గొంతు చించుకున్నా, ఒక్క దేశమూ పట్టించుకోలేదు. ప్రాణ స్నేహితుడు చైనా హ్యాండిచ్చాడు, పెద్దన్నగా భావించిన అమెరికా కూడా సారీ బ్రదర్ అనేశాడు. చివరకి ఐరాస కూడా కళ్ళు, చెవులు, నోరు అన్ని మూసుకుంది. అప్పటికీ గానీ, పాకిస్థాన్ కు తన స్థాయి ఏంటో, అంతర్జాతీయంగా భారత్ స్థాయి ఏంటనేది తెలిసిరాలేదు.

తాజాగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షాహ్ మహమూద్ ఖురేషి చేసిన వ్యాఖ్యలు వారి నిస్సహాయతకు అద్దం పడుతున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ముజఫరబాద్ లో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఖురేషీ మాట్లాడుతూ "Jazbaat ubharna bahut aasan hain, aitraaz karna usse bhi aasan hain, lekin ek masle ko samjhaakar aage le jaana pechda kaam hain, aage woh log aap keliye haar leke nahi khade hain." (కాశ్మీర్ విషయంలో భావోద్వేగాలను రెచ్చగొట్టడం సులభమే, భారత్ చర్యలను వ్యతిరేకించటం మరింత సులభమే. కానీ, ఒక సమస్యను అర్థం చేసుకొని, దానిని ముందుకు తీసుకెళ్లడం అత్యంత కష్టమైన పని, కాశ్మీర్ విషయంపై ఐరాసలో మన కోసం ఎవ్వరూ పూలమాలలు పట్టుకొని ఎదురుచూడడం లేదు.ఇప్పటికైనా ఒక అజ్ఞానపు స్వర్గంలో జీవించడం నుంచి బయటకు వస్తే మంచిది" అంటూ వ్యాఖ్యానించారు.

ఐరాసలోని శాశ్వత సభ్యత్వ దేశాలు కూడా పాకిస్థాన్ ను వ్యతిరేకించే అవకాశం ఉంది. కనీసం ఇస్లాం కమ్యూనిటీ కూడా కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కు మద్ధతిచ్చే సూచనలేవి కన్పించడం లేదు. భారత్ మార్కెట్ చాలా పెద్దది, ఇస్లాం దేశాలు కూడా భారత్ ను వ్యతిరేకించి తమనుతాము నష్టపరుచుకోవు. ఈ విషయాలు ప్రజలు అర్థం చేసుకొని కాస్త వివేకంతో మెలగాలి అని ఖురేషి వారి ప్రజలనుద్దేశించి పేర్కొన్నారు. కాశ్మీర్ అంశంలో పాక్ ప్రభుత్వం పట్ల ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వారి విదేశాంగ మంత్రి ఖురేషి తమ ప్రజల పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తూ, అసలు విషయాన్ని తెలియజేశారు.

అయితే కాశ్మీర్ విషయంలో అతిగా ఆవేశపడిన పాకిస్థాన్ ఎన్నో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంది. తమ ఆర్థిక వ్యవస్థ ఏంటి, అంతర్జాతీయ మార్కెట్లో తమ విలువ ఏంటి, ఇటు భారత్ విలువ ఏంటి అని ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంతో అది పాకిస్థాన్ కే రివర్స్ అయింది. ఇటు భారత్ తో వాణిజ్యం రద్దు చేసుకోవడం అనేది మరింత మూర్ఖపు ఆలోచన. దీనివల్ల ఆ దేశంలో నిత్యావసరాల కొరత ఏర్పడింది, ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో ఉన్న పాకిస్థాన్, ఆ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయాలతో పరిస్థితి మరింత దిగజారినట్లయింది. ఇప్పుడు పాకిస్థాన్ కు ఉన్న ఏకైక మార్గం, భారత్ తో సంధి చేసుకోవడం , ఆ తర్వాత ఎప్పట్లాగే భారత్ ను నేరుగా ఢీకొట్టకుండా తమకు తెలిసిన 'ఉగ్ర' సహాయంతో కొన్ని వెన్నుపోటు దాడులు చేసి ఈగో చల్లార్చుకోవడం. ఇప్పటికే కన్ఫ్యూజన్ లో ఉన్న ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇకపై తీసుకునే నిర్ణయంపైనే పాక్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.