Washington January 12 : వైద్యశాస్త్రంలో అద్భుతాన్ని చేసి చూపించారు అమెరికా వైద్యులు. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పంది గుండెను మనిషికి అమర్చారు (Pig Heart Implant). అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మేరీలాండ్‌ మెడికల్‌ సెంటర్‌( University of Maryland Medical School ) నిపుణులు ఈ ఘనత సాధించారు. మరణం ముప్పును ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిని కాపాడేందుకు చివరి ప్రయత్నంగా వారు ఈ ప్రయోగాత్మక శస్త్రచికిత్స(Surgery) నిర్వహించారు. ఆపరేషన్‌ ముగిసి మూడు రోజులు గడిచాయని, రోగి చక్కగా కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. ఇది విజయవంతమైతే అవయవ మార్పిళ్లను విస్తృతంగా చేపట్టడానికి మార్గం సుగమమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ శస్త్రచికిత్స ఫలిస్తుందా అని ఇప్పుడే చెప్పలేమని, అయితే ప్రాణాంతక పరిస్థితుల్లో జంతువుల అవయవాలను మానవులకు అమర్చేందుకు దశాబ్దాలుగా సాగుతున్న ప్రయత్నాల్లో ఇదొక ముందడుగని వారు తెలిపారు.

అమెరికాకు చెందిన 57 ఏళ్ల డేవిడ్‌ బెనెట్‌ (David Bennett)గుండె విఫలమైంది. దీనికితోడు ఆ అవయవం కొట్టుకునే తీరులోనూ తేడాలు ఉన్నాయి. అతడికి మానవ గుండె(Human Heart)ను గానీ హార్ట్‌ పంప్‌ను గానీ అమర్చడం సాధ్యం కాలేదు. మరణం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పంది గుండె(Pig Heart)ను అమర్చడం మినహా ప్రత్యామ్నాయం లేకపోయిందని బెనెట్‌ కుమారుడు తెలిపారు. ఈ ప్రయోగం ఫలిస్తుందన్న భరోసా ఏమీ లేదని తన తండ్రికి తెలుసన్నారు. ‘‘నేను బతకాలి. ఇది చీకట్లో రాయి విసరడం లాంటిదని నాకు తెలుసు. ఇది తుది ప్రయత్నం’’ అని శస్త్రచికిత్సకు ఒక రోజు ముందు బెనెట్‌(David Bennett) తెలిపారు.

గత శుక్రవారం బార్ట్‌లీ గ్రిఫిత్‌(Bartley Griffith) నేతృత్వంలోని వైద్యులు ఏడు గంటల పాటు శ్రమించి ఈ శస్త్రచికిత్సను నిర్వహించారు. బాల్టిమోర్‌ ఆసుపత్రి ఇందుకు వేదికైంది. బెనెట్‌ ఇప్పుడు సొంతంగా శ్వాస తీసుకుంటున్నారు. అయితే ఆయన కొత్త గుండెకు తోడ్పాటుగా హార్ట్‌-లంగ్‌ మెషీన్‌ను వైద్యులు కొనసాగిస్తున్నారు. వచ్చే కొద్దివారాలు కీలకం కానున్నాయి. ఆయన గుండె పనితీరును డాక్టర్లు నిశితంగా గమనిస్తున్నారు(carefully monitored).

తాజా ప్రయోగంలో ఉపయోగించిన గుండెను జన్యు మార్పిడి పంది నుంచి సేకరించారు. ఫలితంగా ఆ అవయవాన్ని రోగి శరీరం తక్షణం తిరస్కరించబోదని వైద్యులు తెలిపారు. ఆ గుండె సాధారణంగానే పనిచేస్తుందన్నారు. తొలుత.. అవయవాన్ని వేగంగా తిరస్కరించడానికి కారణమయ్యే మూడు జన్యువులను శాస్త్రవేత్తలు తొలగించారు. అలాగే పంది గుండె కణజాలం మితిమీరి వృద్ధి చెందేందుకు కారణమయ్యే ఒక జన్యువును నిర్వీర్యం చేశారు. కొత్త అవయవాన్ని రోగి సాఫీగా స్వీకరించడానికి వీలు కల్పించే ఆరు మానవ జన్యువులనూ ఆ పందిలోకి చొప్పించారు.

ప్రస్తుతం మానవ అవయవాలకు భారీగా కొరత ఉంది. గత ఏడాది అమెరికాలో రికార్డు స్థాయిలో 3,800కుపైగా గుండె మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. అయినా డిమాండ్‌ తగ్గడంలేదు. అమెరికాలో ఇప్పటికీ 1.1 లక్షల మంది అవయవాల కోసం ఎదురుచూస్తున్నారు. వాటిని పొందేలోగానే ఏటా 6వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఇబ్బందిని అధిగమించడానికి జంతువుల అవయవాలను ఉపయోగించే అంశంపై శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరహా అవయవ మార్పిడిని ‘జెనో ట్రాన్స్‌ప్లాంటేషన్‌’గా పిలుస్తారు. గతంలో జరిగిన ఈ ప్రయోగాలు చాలా వరకూ విఫలమయ్యాయి. మార్పిడి చేసిన అవయవాలను రోగి శరీరం వేగంగా తిరస్కరించడమే ఇందుకు కారణం. శాస్త్రవేత్తలు మొదట్లో వానరాల అవయవాలను ఉపయోగించారు. 1984లో బేబీ ఫే అనే చిన్నారి.. ఓ బబూన్‌ గుండెతో 21 రోజుల పాటు జీవించింది.

అవయవ మార్పిడి కోసం మొదట్లో వానరాలపై ఆధారపడ్డ శాస్త్రవేత్తలు.. ఆ తర్వాత పందులపై దృష్టి సారించారు. పందుల్లోని అవయవాల పరిమాణం చాలా వరకూ మానవుల్లోని అవయవాలకు దగ్గరగా ఉంటాయి. పందుల గుండె కవాటాలనూ(pig heart valves ) దశాబ్దాలుగా మనుషులకు అమరుస్తున్నారు. తాజాగా గుండె మార్పిడి చేయించుకున్న బెనెట్‌కూ ఇలాంటి కవాటాన్ని కొన్నేళ్ల కిందట అమర్చారు. పందుల గుండెతో పాటు మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులను మనుషులకు ఉపయోగించేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి.

మొదట్లో అలాంటి ప్రయత్నాలు విఫలమయ్యాయి. జన్యు వైరుధ్యాల వల్ల ఆ కొత్త అవయవాలను మానవ శరీరం తిరస్కరించడమే ఇందుకు కారణం. జన్యు మార్పిడితో ఈ ఇబ్బందిని శాస్త్రవేత్తలు అమర్చారు. ఈ దిశగా గత ఏడాది న్యూయార్క్‌లో ఒక ప్రయోగాన్ని నిర్వహించారు. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తికి కి పంది మూత్ర పిండాలను అమర్చి చూశారు. ఆ జీవులు మానవుల్లో అవయవ మార్పిడికి ఉపయోగపడతాయని తేల్చారు. తాజాగా బెనెట్‌కు శస్త్రచికిత్స చేసిన గ్రిఫిత్‌.. ప్రయోగాత్మకంగా పందుల గుండెలను దాదాపు 50 బబూన్‌లకు అమర్చారు. మానవుల్లో కాలిన గాయాలకు గ్రాఫ్టింగ్‌ చేయడానికి వరాహాల చర్మాన్ని ఉపయోగిస్తున్నారు. పందులు చాలా వేగంగా ఎదగడం, అవి ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కనడం వంటివి కూడా వాటివైపు మొగ్గడానికి కారణమవుతున్నాయి.