Supreme Court | (Photo Credits: PTI)

New Delhi, August 28:   డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్ట్ శుక్రవారం స్పష్టతను ఇచ్చింది. పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాల్సిందేనని, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల ప్రకారం పరీక్షలు జరగాలని సుప్రీంకోర్టు పేర్కొంది. పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను ప్రమోట్ చేయడం సరికాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ విషయంలో యూజిసి నిర్ణయాన్ని సుప్రీం సమర్థించింది.

అయితే, ఏ రాష్ట్రమైనా లేదా కేంద్రపాలితమైనా యూజిసి నిర్ధేశించిన సెప్టెంబర్ 30 గడువులోగా పరీక్షలు నిర్వహించలేని పక్షంలో పరీక్షలను వాయిదా వేసుకునే అధికారం ఆయా రాష్ట్రాలకు లేదా యూటీలకు ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది, వాయిదా వేయాలనుకున్నప్పడు నేరుగా యూజిసిని సంప్రదించి కొత్త పరీక్షల తేదీలను తీసుకోవాల్సిందిగా సుప్రీం సూచించింది.

గత నెల జూలై 6న ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలను తప్పనిసరి చేస్తూ యూజిసి నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 లోపు దేశంలోని అన్ని రాష్ట్రాలు పరీక్షలు పూర్తిచేయాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే యూజిసి నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొన్ని విద్యార్థి సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దేశంలో కరోనావైరస్ విజృంభిస్తున్న వేళ, పరీక్షలు నిర్వహించడం సరికాదని అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్ర, ఒడిశా, దిల్లీ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సెప్టెంబర్ 30 లోగా పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి చేయాలన్న యూజిసి నిర్ణయాన్ని సవాలు చేశాయి.

Here's the update:

ఈ పిటిషన్లపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఆగష్టు 18న విచారణ పూర్తి చేసి తన నిర్ణయాన్ని రిజర్వులో పెట్టింది. ఎట్టకేలకు ఈరోజు జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు తన తీర్పును వెలువరించింది. యూజిసి నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. యూజిసి జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని సూచించింది. అయితే కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలకు ఉండే "రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారం చట్టం" ప్రకారం పరీక్షలు వాయిదా వేసుకోవచ్చునని తెలిపింది, అందుకోసం యూజిసిని సంప్రదించాలని తెలిపింది. అంతేకానీ విద్యార్థుల గత ఉత్తీర్ణత ఆధారంగా పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేయమని సూచించే అధికారం ఉండదని సుప్రీం స్పష్టం చేసింది.