New Delhi, AUG 17: ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ మయం అయ్యాయి. ఆయా లావాదేవీల (Cash Transactions) పరిధి దాటితే పన్ను భారం పడుతుంది. అన్ని లావాదేవీలకు డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నా.. నగదు లావాదేవీలు గణనీయంగానే సాగుతున్నాయి. ఈ విషయమై దృష్టి సారించాలని ఆదాయం పన్ను విభాగం (Income Tax Department)ను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (Central Board of Direct Taxes – CBDT) ఆదేశించింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)తో పోలిస్తే పన్ను ఎగవేత వసూళ్లు పెరగాలని స్పష్టం చేసింది. హోటళ్లు, వేడుకలు నిర్వహించే బాంక్విట్ హాళ్లు, లగ్జరీ బ్రాండ్ రిటైలర్లు, ఐవీఎఫ్ క్లినిక్స్, హాస్పిటళ్లు, డిజైనర్ క్లాథింగ్ స్టోర్లలో లావాదేవీలు, ఎన్ఆర్ఐ కోటా మెడికల్ సీట్ల ఫీజు చెల్లింపులు భారీ మొత్తంలో నగదు ద్వారా జరుగుతున్నాయని ఆదాయం పన్ను విభాగం గుర్తించింది.
భారీ మొత్తంలో నగదు చెల్లింపులు జరిగినప్పుడు నిబంధనలను అనుసరించడం లేదని నిర్ధారణకు వచ్చింది. రూ.2 లక్షల పై చిలుకు నగదు చెల్లింపులు జరిగితే సంబంధిత సంస్థ ఆర్థిక లావాదేవీల ప్రకటన (ఎస్టీఎఫ్)లో తప్పనిసరిగా ఆ వివరాలు నమోదు చేయాల్సి ఉందని ఐటీ శాఖ సీనియర్ అధికారులు పీటీఐకి చెప్పారు. భారీ విలువతో కూడిన వినియోగ ఖర్చు చేసిన టాక్స్ పేయర్ ను గుర్తించాల్సి ఉందని ఆదాయం పన్ను విభాగానికి సీబీడీటీ సూచించింది. నిర్దిష్ట లావాదేవీలకు ఆదాయం పన్ను చట్టంలోని 139ఏ సెక్షన్ ప్రకారం ‘పాన్ కార్డు’ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో పన్ను ఎగవేత విషయమై 1100 ప్రాంతాల్లో తనిఖీల్లో రూ.2,500 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశామని, వాటిలో రూ.1700 కోట్ల నగదు ఉందని ఐటీ విభాగం తెలిపింది. డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్ ద్వారా పన్ను ఎగవేతకు చెక్ పెట్టాలని ఐటీ అధికారులకు సీబీడీటీ ఆదేశాలు జారీ చేసింది. భారీ మొత్తంలో పన్ను చెల్లింపుదారులను గుర్తించాల్సి ఉందని పేర్కొంది.