New Delhi, AUG 17: ఇప్పుడన్నీ డిజిటల్ చెల్లింపులే.. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) చెల్లింపులను సరళతరం చేసేసింది. క్యూఆర్ కోడ్, యూపీఐ ఐడీ సిస్టమ్ ద్వారా క్షణాల్లో చేసేయొచ్చు. డిజిటల్ చెల్లింపులతోపాటు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీఐ పేమెంట్స్ (UPI Payments) చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. సైబర్ మోసగాళ్లు (New UPI Scam Alert) చేసే అన్ని రకాల కొనుగోళ్లకు మీ మనీ వాడేస్తారు. మీరు ఈ-షాపింగ్, రెస్టారెంట్లు, మాల్స్, పార్కింగ్ ప్లేసెస్ వద్ద యూపీఐ క్యూఆర్ స్కాన్ చేయడంతో సైబర్ మోసగాళ్లు వాటిని తేలిగ్గా తస్కరించగలరు కూడా.
సైబర్ మోసగాళ్లు మిమ్మల్ని నమ్మించడానికి రకరకాల కట్టుకథలు వినిపిస్తుంటారు. గుర్తు తెలియని యూపీఐ ఐడీ నుంచి వచ్చే కలెక్ట్ మనీ లేదా ఆటో పే రిక్వెస్టులను ఆమోదించొద్దని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అటువంటి రిక్వెస్టులు వస్తే అవి నిజమా? కాదా? అన్న సంగతి చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. సాధారణంగా ఇటువంటి రిక్వెస్టులు సైబర్ మోసగాళ్లే పంపుతుంటారు. సైబర్ మోసగాడు తన నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ కోసం మీ యూపీఐ ఐడీ తస్కరిస్తాడు. అటుపై మోసగాళ్లు మీకు నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ కోసం రిక్వెస్ట్ పంపుతారు. అందుకు ఆటో పే ఆప్షన్ ఓకే చేయమని కోరతారు. అదీ కూడా మీకు తెలిసిన వ్యక్తుల పేర్లతో రిక్వెస్ట్ పెడతారు. వాస్తవంగా సదరు సైబర్ మోసగాళ్లు తమ నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ పేమెంట్ కోసం ఇన్సియేట్ చేస్తారు. అటువంటి రిక్వెస్టులను అప్రూవ్ చేస్తే మీ ఖాతా నుంచి మనీ మొత్తం తస్కరిస్తారు సైబర్ మోసగాళ్లు. కనుక ఇటువంటి రిక్వెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పట్ల పూర్తిగా అవగాహన లేని సీనియర్ సిటిజన్లు మోసగాళ్ల భారీగా పడే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. సీనియర్ సిటిజన్లు తమకు వచ్చిన రిక్వెస్టుల గురించి సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ ను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా రిక్వెస్ట్ పంపిన వారి యూపీఐ ఐడీ, ఆ వ్యక్తి వివరాలు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి.
మరి కొందరు సైబర్ మోసగాళ్లు ఎమోషనల్ వ్యూహాలు అనుసరిస్తారు. మీ కుటుంబ సభ్యుడినని నమ్మించడానికి ప్రయత్నిస్తుంటారు. యూపీఐ లావాదేవీల పట్ల సీనియర్ సిటిజన్లకు అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎవరైనా యూపీఐ రిక్వెస్టులు పంపినప్పుడు కుటుంబ సభ్యులు, లేదా స్నేహితుల్లో నమ్మకమైన వారిని సంప్రదించేలా సీనియర్ సిటిజన్లను ప్రోత్సహించాలని చెబుతున్నారు.