New Delhi, April 11: సీబీఐ అరెస్ట్ పై ఎమ్మెల్సీ కవిత కోర్టును (Kavitha Arrest) ఆశ్రయించారు. రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరుపు న్యాయవాది రోహిత్ రావు పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా తమ పిటిషన్ ను విచారించాలని కోరారు. నోటీసులు లేకుండా సీబీఐ (CBI) కవితను జైల్లో ఎలా అరెస్ట్ చేస్తుందని లాయర్ రోహిత్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితను తీహార్ జైల్లోనే సీబీఐ తమ కస్టడీలోకి తీసుకుంది. ఏప్రిల్ 6న సీబీఐ కవితను లిక్కర్ పాలసీ కేసుకి సంబంధించి ప్రశ్నించింది. కవిత సీబీఐ దర్యాఫ్తుకు సహకరించకపోవడంతో ఆమెను కస్టడీలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రేపు కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇవాళ రంజాన్ పర్వదినం సందర్భంగా రౌస్ అవెన్యూ కోర్టుకు సెలవు.అయితే, డ్యూటీ మేజిస్ట్రేట్ ముందు కవిత తరుపు న్యాయవాది కవిత సీబీఐ అరెస్ట్ ను సవాల్ చేస్తూ పిటిషన్ ను (Moves Court) ఫైల్ చేశారు. అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. అయితే రేపు ఎలాగూ కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. సీబీఐ అదుపులోకి తీసుకున్న 24 గంటల్లో కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. రేపు కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ రిపోర్టును కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. కవితను ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? కవితను ఎందుకు కస్టడీలో ప్రశ్నించాల్సి ఉంది? అన్న అంశాలకు సంబంధించి సీబీఐ కోర్టుకు తెలపనుంది.
గతంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) మనీలాండరింగ్ కేసులో కవితను 10 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని తమ కార్యాలయంలోనే ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు సీబీఐ కూడా తమ కస్టడీలోకి తీసుకుని తమ కార్యాలయంలోనే కవితను ప్రశ్నించనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీలాండరింగ్.. రెండు కేసుల్లో అటు ఈడీ, ఇటు సీబీఐ రెండు దర్యాఫ్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సీబీఐ కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఆర్థిక లావాదేవీల వ్యవహారాలకు సంబంధించి ఈడీ సైతం దర్యాఫ్తు చేస్తోంది. మనీలాండరింగ్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో కవిత ఉన్నారు. కోర్టు అనుమతి తీసుకుని ఏప్రిల్ 6న తీహార్ జైల్లోనే కవితను విచారించింది సీబీఐ.