New Delhi, Mar 16: రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అందరూ భావిస్తుండగా మోదీ సర్కారు షాకిచ్చింది. ముడి పెట్రోలియం, పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం, సహజవాయువును వస్తు, సేవా పన్ను పరిధిలోకి (Goods and Service Tax) తీసుకురావాలనే ప్రతిపాదన ప్రస్తుతం లేదని (No proposal to bring petroleum products under GST) ప్రభుత్వం తెలిపింది.
లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నిన్న ఈ వస్తువులను జిఎస్‌టి కింద చేర్చడానికి జిఎస్‌టి కౌన్సిల్ (GST council) ఎలాంటి సిఫారసు చేయలేదని చెప్పారు. రెవెన్యూ చిక్కులతో సహా సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకుని తగిన సమయంలో ఈ పెట్రోలియం ఉత్పత్తులను (petroleum products) చేర్చడం గురించి కౌన్సిల్ పరిగణించవచ్చని ఆమె అన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేందుకు రిజర్వ్ బ్యాంక్, ప్రతిపక్షాలు చేసిన సలహాను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంతటితో ఆగకుండా బీమా రంగంలో ప్రైవేటుపరం చేసే చర్యలను కార్యరూపం దాల్చారు. 2017 జూలై 1వ తేదీన వచ్చిన జీఎస్టీలో పెట్రోలియం ఉత్పత్తులను చేరిస్తే ధరలు తగ్గుతాయని అందరూ చెబుతున్నారు. అయినా కూడా కేంద్రం పెడచెవిన పెట్టేసింది. దీంతో కేంద్రం తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
మరో కేంద్రమంత్రి చలికాలం అయిపోగానే పెట్రోల్ ధరలు తగ్గుతాయని ప్రకటించిన విషయం తెలిసిందే. అదీ కూడా ఇప్పుడు లేదని పేర్కొంటున్నారు. తాజాగా బీమా రంగంలో ఎఫ్‌డీఐల ప్రవేశంపై తీసుకొచ్చిన కొత్త బిల్లు ప్రకారం మొత్తం 74 శాతం బీమా రంగంలో ఎఫ్‌డీఐలకు అనుమతి ఇవ్వనున్నారు. అయితే ఈ బిల్లును ఆమోదం పొందితే బీమా రంగంలో కూడా ప్రైవేటు శక్తులు ఆధిపత్యం చలాయించనున్నాయి.
ఇక డీజిల్ మరియు పెట్రోల్ ధరల పెరుగుదలను తనిఖీ చేయడానికి కేంద్రం మరియు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని అనుబంధ సంస్థలకు సమాధానమిస్తూ ఠాకూర్ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను తగ్గించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను తగ్గించిన తరువాత కేంద్రం కూడా నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన అన్నారు.
ఇంధనం మీద వసూలు చేసే ఎక్సైజ్, సెస్, సర్‌చార్జీల ద్వారా కేంద్రానికి భారీ మొత్తంలో ఆదాయం వస్తున్నట్లు పార‍్లమెంట్ వేదికగా కేంద్రం తెలిపింది.మే 6, 2020 నుంచి ఇప్పటి వరకు కేంద్రం లీటర్ పెట్రోల్ మీద 33 రూపాయలు, లీడర్ డీజిల్ మీద 32 రూపాయలు లాభపడినట్లు వెల్లడించింది. ఈ మొత్తాన్ని ఎక్సైజ్ సుంకం, సర్ చార్జీల రూపంలో వసూలు చేస్తున్నట్లు తెలిపింది.
జనవరి 1, 2020 వరకు కేంద్రం లీటర్ పెట్రోల్‌పై 19.98 రూపాయలు, డీజిల్‌పై 15.83 రూపాయలు ఆర్జించగా.. మార్చి 14 నుంచి మే 5 వరకు ఈ మొత్తం రూ.22.98, 21.19కు పెరగగా.. మే 6 నుంచి డిసెంబర్ 31, 2020 వరకు లీటర్ పెట్రోల్ మీద ఏకంగా 32.98, లీటర్ డీజిల్(బ్రాండెడ్) మీద 34.19 రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నట్లు తెలిపింది.