SC Stays Bombay HC Order: బాంబే హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు, తీర్పు ఆందోళనకరంగా ఉందంటూ కేకే వేణుగోపాల్ పిటిషన్, స్త్రీల ఎద బాగాలు దుస్తుల పైనుంచి తాకితే నేరం కాదంటూ తీర్పు ఇచ్చిన బాంబే హైకోర్టు
ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే (Chief Justice SA Bobde) హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వివాదాస్పదంగా మారిన అంశంపై తుది విచారణ ముగిసే వరకు స్టే విధిస్తున్నట్లు తెలిపారు.
New Delhi, January 27: పనెండేళ్ల బాలికపై లైంగిక దాడికి సంబంధించిన కేసులో ఇటీవల బాంబే హైకోర్టులోని నాగపూర్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు (Supreme Court Stays Bombay High Court's Order) తీవ్ర వివాదాస్పదంగా మారింది. స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్ (శారీరక స్పర్శ) లేకుండా... దుస్తుల పైనుంచి బాలిక పై అవయువాలను తాకడాన్ని ( 'Skin to Skin' Contact) పోక్సో చట్టం కింద నేరంగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. ఇదే కారణంతో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది.
నాగపూర్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై దేశ వ్యాప్తంగా నిరసన స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే (Chief Justice SA Bobde) హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వివాదాస్పదంగా మారిన అంశంపై తుది విచారణ ముగిసే వరకు స్టే విధిస్తున్నట్లు తెలిపారు. బాంబే హైకోర్టు (Bombay High Court) ఇచ్చిన తీర్పు ఆందోళనకరంగా ఉందని, దీనిపై మరోసారి సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని కేకే వేణుగోపాల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
మహారాష్ట్రకు చెందిన 12 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో విచారణ జరిపిన జస్టిస్ పుష్పా గనేడివాలా ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు పెను దుమారానికి దారితీసింది. ఈ తీర్పుపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు తీర్పుపై ఆందోళన సైతం వ్యక్తం చేశారు. ఈ కేసులో స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్ (శారీరక స్పర్శ) అనేది జరగలేదు కాబట్టి పోక్సో చట్టంలోని సెక్షన్ 8 కింద (POCSO Sexual Assault) దీన్ని లైంగిక దాడిగా పరిగణించలేమని బాంబే హైకోర్టు పేర్కొంది. నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది.
ఈ కేసు పూర్తి వివరాల్లోకెళితే.. మహారాష్ట్రకు చెందిన 39 ఏళ్లు ఓ వ్యక్తి 12 ఏళ్ల మైనర్ బాలికను ఏదో ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం తలుపులన్నీ మూసి ఆమె ఛాతీభాగాన్ని నొక్కాడు. అంతేకాకుండా బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. అయితే కామాంధుడి కోరికను పసిగట్టిన బాలిక పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి అతనికి దేహశుద్ధి చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టం-2012 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దిగువ న్యాయస్థానంలో నిందితుడిని ప్రవేశపెట్టారు.
ఐపీసీ సెక్షన్ 354 కేసు కింద కూడా అతడిపై మరో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షను విధించింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును దోషిగా తేలిన వ్యక్తి బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్‌లో తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ పుష్ప ఈనెల 19న తుది తీర్పును వెలువరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
దుస్తుల పై నుంచి చిన్నారి ఒంటిని తాకినంత మాత్రాన అది పోక్సో చట్టం ప్రకారం నేరంగా పరిగణించలేం. చర్మాన్ని చర్మం తాకాలి, కానీ ఈ కేసులో అలా జరగలేదు. స్కిన్–టు–స్కిన్ కాంటాక్టు లేదు. దుస్తుల లోపల చేతులు పెట్టినట్టి ఆధారాలు కూడా లేవు. పోక్సో చట్టం కింద నమోదైయ్యే కేసుల్లో ఆధారాలు పక్కాగా ఉండాలి’ అని జస్టిస్ పుష్ప తన తీర్పు సందర్భంగా పేర్కొన్నారు.
చిన్నారుల ఒంటిని తాకకూడని చోట తాకడం పోక్సో చట్టం కింద నేరం అవుతాయి కనుక, అతడు ఆ పని చేయలేదని ఈ చట్టం ప్రకారం అతడు నిర్దోషే అని తీర్పును వెలువరించారు. ఐపీసీ సెక్షన్ 354 కింద మాత్రమే అతడిని నేరస్థుడిగా గుర్తిస్తామని పేర్కొన్నారు. దీనిపై యూత్ బార్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా సైతం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. పలువురు ఈ తీర్పును బహిరంగంగానే వ్యతిరేకించారు.
(The above story first appeared on LatestLY on Jan 27, 2021 06:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

