New Delhi, January 26: కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ.. రిపబ్లిక్ డే నాడు రైతులు తలపెట్టిన కిసాన్ ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖలోని సీనియర్ అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని వాళ్లు సేకరిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు (Amit Shah takes stock of law and order situation) సమీక్షిస్తున్నారు. పారామిలిటరీ దళాలను హైఅలెర్ట్‌లో ఉండాలని ఆదేశించారు. ఎర్రకోట దగ్గర మరిన్ని బలగాలను మోహరించారు.
మంగళవారం ఉదయం రైతులు తమకు కేటాయించిన రూట్‌లో కాకుండా మరో రూట్‌లో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి సెంట్రల్ ఢిల్లీలోకి దూసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దేశ రాజధానిలో వేలాది మంది రైతులు హంగామా సృష్టించారు. ఎర్రకోటపైకి దూసుకెళ్లి.. ఆగస్టు 15 నాడు ప్రధానమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగరేసే చోట తమ జెండాను ఎగరేశారు. ఎర్రకోటలోని మినార్‌పైకి ఎక్కి అక్కడా తమ జెండాను ఉంచారు. రైతులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేసినా, టియర్ గ్యాస్ ప్రయోగించినా ఫలితం లేకపోయింది.
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ పరేడ్ (Farmers' Tractor Rally) ఉద్రిక్తతలకు దారితీసింది. బారికేడ్లను తొలగించి రైతులు ముందుకు దూసుకుపోవడంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు. పలు అడ్డంకులను అధిగమించి రైతులు (Farmers) ఎర్రకోట వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.
రైతుల నిరసనలతో ఢిల్లీ (Delhi), దేశ రాజధాని ప్రాంతంలో కొన్ని చోట్ల ఇంటర్‌నెట్ సేవలను (Internet) నిలిపివేశారు. ఢిల్లీలో శాంతిభద్రతలు మళ్లీ అదుపులోకి తీసుకువచ్చేందుకే ఈ నిర్ణయమని పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఈ హింసాత్మక ఘటనలకు తాము బాధ్యలము కాదని, ఎవరో సంఘ విద్రోహ శక్తులు తమ ర్యాలీలోకి ప్రవేశించారని రైతులు చెప్పడం గమనార్హం.
Here's ANI Update:
Union Home Minister Amit Shah (file photo) takes stock of law and order situation in Delhi from senior Home Ministry officials: Sources pic.twitter.com/2ZJpbKCrsd
— ANI (@ANI) January 26, 2021
ఇదిలా ఉంటే సెంట్రల్ ఢిల్లీలోని మింటో రోడ్ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో అదే ట్రాక్టర్ కింద పడి ఓ రైతు మరణించాడు. మృతుడిని ఉత్తరాఖండ్‌లోని బాజ్‌పూర్‌కు చెందిన నవనీత్ సింగ్‌గా గుర్తించినట్టు చెప్పారు. అయితే ట్రాక్టరు తిరగబడటంతో రైతు చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. మరణించిన రైతుపై జాతీయ జెండా కప్పి ఐటీఓ ఇంటర్ సెక్షన్ వద్ద రైతులు నిరసనకు దిగారు. సదరు రైతు మరణానికి కారణం పోలీసు కాల్పులు జరపడమేనని నిరసన చేస్తున్న రైతులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్‌ను మలుపు తీసుకునే సమయంలో పోలీసులు కాల్పులు జరిపారని, ఆ ప్రమాదంలో రైతు మరణించాడని వారు చెప్పుకొస్తున్నారు.
వీటన్నిటితో దేశ రాజధానిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఢిల్లీలోని మెట్రో సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది. దిల్షన్ గార్డెన్, ఝిల్‌మిల్, మాన్‌సరోవర్ పార్క్, జామా మసీదుతో పాటు ‘గ్రే లైన్’లో ఉన్న అన్ని స్టేషన్లు మూసివేస్తున్నట్లు డీఎంఆర్‌సీ ప్రకటించింది. ఈ వివరాలను డీఎంఆర్‌సీ ట్విటర్ ద్వారా తెలిపింది.
మరొక ట్వీట్‌లో, సమయ్‌పూర్ బడ్లీ, రోహిణి సెక్టర్ 18/19, హైదర్‌పూర్ బడ్లి మోర్, జహంగీర్ పురి, ఆదర్శ్ నగర్, ఆజాద్‌పూర్, మోడల్ టౌన్, జీటీబీ నగర్, విశ్వవిద్యాలయం, విధాన సభ, సివిల్ లైన్స్ మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన హింసాత్మకంగా మారింది. వేలాది ట్రాక్టర్లతో రాజధానిలోకి వచ్చిన రైతులు పలు చోట్ల హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించినా అదుపులోకి రాలేదు. కొన్నిచోట్ల పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టినా ఢిల్లీ రోడ్లపైకి వేలాది మంది రైతులు తమ ట్రాక్టర్లతో వచ్చేశారు.
ఎర్రకోటపైకి ఎక్కిన రైతులు తమ జెండాలు ఎగురవేశారు. రైతుల ర్యాలీ హింసాత్మకంగా మారడంతో పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేశారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.
రైతులు శాంతియుతంగా ట్రాక్టర్ పరేడ్‌ను నిర్వహించినా ర్యాలీ సాగాల్సిన రూట్లపై గందరగోళంతో ఇబ్బందులు తలెత్తాయని రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ అన్నారు. ఇక వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం తక్షణమే వెనక్కితీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
మరోవైపు ర్యాలీ రూటు మార్పులో తమ పాత్ర ఏదీ లేదని సంయుక్త కిసాన్ మోర్చ నాయకులు పేర్కొన్నారు. కొంతమంది అరాచకవాదులు, అసాంఘిక శక్తులు తమ శాంతియుత ఉద్యమంలోకి చొరబడ్డాయని ఆరోపించారు.