
New Delhi, June 4: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను (Vijay Mallya) భారత్‌కు అప్పగించే విషయంలో యూకే ప్రభుత్వం (UK Govt) ఊహించని మెలిక పెట్టింది. ఇంకా న్యాయ ప్రక్రియ పూర్తి కాలేదనీ.. పెండింగ్‌లో ఉన్న సమస్య పూర్తయ్యే వరకు మాల్యాను భారత్‌కు పంపలేమని బ్రిటిష్ హైకమిషన్ (British High Commission) పేర్కొంది. చట్ట పరమైన నిబంధనల కారణంగా భారతదేశానికి అప్పగించలేమని బ్రిటిష్ హైకమిషన్ ప్రతినిధి వ్యాఖ్యలను ఉటంకిస్తూ సీఎన్‌బీసీ రిపోర్టు చేసింది. యూకే హైకమిషన్ ఈ విషయాన్ని ధృవీకరించిందని కూడా తెలిపింది. బ్లాక్‌లిస్టులో తబ్లిగీ జమాత్ విదేశీ సభ్యులు, 2 వేలకు పైగా విదేశీయులు వీసా నిబంధనలకు విరుద్ధంగా దేశంలోకి ప్రవేశించారని తెలిపిన కేంద్రప్రభుత్వం
చట్ట సమస్యలను పరిష్కరించిన తరవాత మాత్రమే మాల్యాను పంపిస్తామని బ్రిటిష్ హై కమిషన్ పేర్కొంది. ఇది చాలా గోప్యమైన వ్యవహారమంటూ ఇంతకుమించి వివరాలను అందించేందుకు నిరాకరించారు. ఆ చట్ట సమస్య ఏంటన్నది చెప్పేందుకు నిరాకరించింది. అది రహస్యమని, యూకే లా ప్రకారం ఆ సమస్య పరిష్కరించాకే మాల్యాను దేశం దాటిస్తామని స్పష్టం చేసింది. అలాగే ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా అంచనా వేయలేమనీ, వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని ప్రతినిధి తెలిపారు. దీని పరిష్కారానికి ఎంత సమయం పడుతుందనేది కూడా చెప్పలేం. అయితే సాధ్యమైనంత వరకు త్వరగా పూర్తిచేయడానికి మేం ప్రయత్నిస్తాం..’’ అని సదరు ప్రతినిధి వెల్లడించారు.
ముఖ్యంగా చట్టపరమైన కారణాల వల్ల మాల్యాను అప్పగింత ఆదేశాలపై యూకే హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ సంతకం చేయకపోవడమే ఆలస్యానికి కారణమనే అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు మాల్యా న్యాయవాది ఆనంద్ దూబే కూడా మాల్యాను వెనక్కి రప్పించే వ్యవహారం తమ దృష్టిలో లేదని వ్యాఖ్యానించినట్టు సమాచారం. కాగా పరారీలో ఉన్న మాల్యాను ముంబైకి తరలించనున్నారని, ఆయనతో పాటు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు ఉంటారంటూ పలు వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.
తనను భారత్‌కు అప్పగించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాల్యా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ గత నెలలో తిరస్కరణకు గురైంది. అయితే ఇప్పుడు ఆయన అప్పగింత కంటే ముందు మరో విషయం తేలాల్సిన అవసరం ఉంది..’’ అని యూకే హైకమిషన్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. కాగా 2018లో తనను భారత్‌కు అప్పగించాలన్న నిర్ణయాన్ని లండన్ హైకోర్టు సమర్థించడంపై.. యూకే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నించిన మాల్యాకు ఇటీవల భంగపాటు ఎదురైన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు ఆయనకు తలుపులు మూసేయడంతో ఇక అప్పగింతకు మార్గం సుగమమైందనీ.. ఏ క్షణమైనా ఆయనను భారత్‌కు తీసుకొచ్చే అవకాశం ఉందని భావించారు. ఈ నేపథ్యంలోనే యూకే ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. వాస్తవానికి యూకేలో నేరస్తుల అప్పగింత చట్టం ప్రకారం.. సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పు వెలువరించిన 28 రోజుల్లో నేరస్తుడిని అప్పగించాలి. ఒకవేళ సదరు వ్యక్తి ఆ దేశంలో శరణార్థిగా ఉండేందుకు ఆశ్రయం కోరితే.. ఆ వ్యవహారం తేలేదాకా అప్పగింతకు అవకాశం ఉండదు. అయితే మాల్యా యూకే ఆశ్రయం కోరారా లేదా అన్నదానిపై స్పష్టత లేదని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి.