Mumbai, October 29: మహారాష్ట్రలో అధికార భాగస్వామ్యంపై మిత్రపక్షం అయిన శివసేనకు ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) మంగళవారం స్పష్టం చేశారు. రొటేషన్ పద్ధతిలో ముఖ్యమంత్రి పీఠాన్ని శివసేన (Shiv Sena)తో పంచుకోవడాన్ని ఫడ్నవిస్ తిరస్కరించారు. బీజేపితో సమానంగా అధికారాన్ని పంచుకునేందుకు శివసేనతో తమ పార్టీ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని ఆయన తేల్చిచెప్పారు. అధికారం '50-50' పై ఎలాంటి చర్చలు జరగలేదని, శివసేనకు సీఎం పదవిపై ఎలాంటి హామీ ఇవ్వలేదని బీజేపీ ((BJP)) అధ్యక్షుడు అమిత్ షా (Amit Shah) తమకు తెలియజేసినట్లుగా ఫడ్నవిస్ పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి 161 స్థానాల్లో గెలుపొందింది. ఇందులో బీజేపీ సాధించిన సీట్లు 105 కాగా, శివసేన 56 స్థానాల్లో గెలుపొందింది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహరాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య 145. మేజిక్ ఫిగర్ కు 40 స్థానాల దూరంలో నిలిచిన బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే శివసేన మద్ధతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో తమ మద్ధతు కావాలంటే, సీఎం కుర్చీపై తమకూ వాటా కావాలనే డిమాండ్ ను శివసేన పార్టీ తెరపైకి తెచ్చింది. ఇందుకు ప్రతిపక్షాల మద్ధతు కూడా తోడైంది. దీంతో శివసేన పార్టీ '50-50' ఫార్ములాపై స్వరం పెంచింది. ఎన్నికల ఫలితాలు ఎలువడిన దగ్గర్నించీ తమ అనుబంధ పత్రిక అయిన 'సామ్నా' ద్వారా బీజేపీపై వ్యతిరేక కథనాలు ప్రచురిస్తుంది. దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలో మహరాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది అంటూ తీవ్ర విమర్శలు చేస్తూ వస్తుంది.
అయితే, సామనా (saamana) పత్రికా కథనాలపై కూడా స్పందించిన ఫడ్నవీస్, ఇలాంటి చర్యలు శివసేన మానుకోకపోతే పరిస్థితి చాలా దూరం వెళ్తుందని ఆ పార్టీకి హెచ్చరిక చేశారు. అయితే శివసేనతో తమ బంధం విడిపోయే అవకాశం లేదని కూడా తెలిపిన ఆయన, ప్రస్తుతం ఉన్నట్లుగానే మరో ఐదేళ్ల పాటు మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం సుస్థిరమైన పాలన కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray) మాత్రం, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తన ఇంటికి వచ్చినపుడు సీఎం పదవిపై మాట ఇచ్చారని, ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకోవాలని కోరుతున్నట్లుగా చెప్తున్నారు.
కాగా, మిత్రపక్షంగా ఉన్న బీజేపీ మరియు శివసేనలు తమ మధ్య ఇన్ని వైశమ్యాలు పెట్టుకొని ఎన్నికలకు కలిసి ఎందుకు వెళ్లినట్లు అని ప్రజలు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కూటమి 98 సీట్లు సాధించింది. ఇందులో కాంగ్రెస్ సాధించినవి 44 సీట్లు కాగా, శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ సాధించిన సీట్లు 54. ఒకవేళ ఈ కూటమికి శివసేన మద్ధతు తెలిపితే 154 (44+54+56) స్థానాలతో ఒక కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అయితే అంతవరకూ బీజేపీ అవకాశం ఇస్తుందా, శివసేనకు 'ఎంతో కొంత నచ్చజెప్పి' ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? మహరాష్ట్రలో ఎవరి ప్రభుత్వం ఏర్పడబోతుంది? అనే అంశాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.