Mumbai, December 20: మిత్రపక్షమైన బీజేపీతో తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్- ఎన్సీపీలతో చేతులు కలిపి మహారాష్ట్ర (Maharashtra) లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేన (Shiv Sena) చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే (CM Uddhav Thackeray) , కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విపక్ష కాంగ్రెస్ కంటే ధాటిగా విమర్శల దాడి చేస్తున్నారు. 'గంగ పూర్తిగా చంద్రముఖిలా మారినట్లు' కరుడుగట్టిన హిందుత్వ భావజాలం కలిగిన శివసేన పార్టీ ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా మారిందనడానికి ఉద్ధవ్ ఠాక్రే చేస్తున్న విమర్శలే అందుకు నిదర్శనం.
ముస్లిమేతర శరణార్థులకు భారతీయ పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ చట్టం కు వ్యతిరేకంగా ఇటీవల దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు నిరసన చేపట్టారు. ఆ సమయంలో పోలీసులు యూనివర్శిటీ క్యాంపస్ లోకి చొరబడి విద్యార్థులపై లాఠీఛార్జి జరిపిన విషయం తెలిసిందే. విద్యార్థులపై పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించిన ఉద్ధవ్ ఠాక్రే, ఈ ఘటనను బ్రిటీష్ పరిపాలన సమయంలోని 'జలియన్ వాలా బాగ్' ఘటనతో పోల్చారు.
ఇదిలా ఉండగా, మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చిన మహారాష్ట్ర సీఎం, కేంద్రంలోని బీజేపి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు.
గతంలో మరాఠా రాజ్యంలో ఉండి ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతున్న 'బెలగావి పట్టణ' పరిధిలోని భూభాగాలను తిరిగి మహారాష్ట్రలో కలిపేయాలని ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేస్తున్నారు. అక్కడ మరాఠి ప్రజలను కన్నడిగులు చిన్నచూపు చూస్తున్నారు. వారికి కన్నడ ప్రజలతో సమాన హక్కులు లేవు. ఈ అంశం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినపుడు కేంద్రంలోని బీజేపీ, కర్ణాటక ప్రభుత్వాన్ని సమర్థించడం దురదృష్టకరం అని ఉద్ధవ్ అన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ మరాఠీ ప్రజలపై పక్షపాతంగా వ్యవహరించడం శోచనీయమని, మహారాష్ట్ర ప్రజల హక్కులు, ఆశయాల సాధన కోసం బీజేపి కట్టుబడి ఉండాలి అని ఉద్ధవ్ కోరారు.
బెలగావిని "కర్ణాటక ఆక్రమిత మహారాష్ట్ర" (Karanataka Occupied Maharashtra) గా ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు 'పాక్ ఆక్రమిత కాశ్మీర్' ను పోలి ఉండటం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఇంతకాలం ఏ సమస్య లేనిది, ఇప్పుడు ప్రాంతాల మధ్య కొత్తగా సమస్యలు సృష్టించడం ఏంటని ఠాక్రేపై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంతో పాటు, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం, కర్ణాటకలోని నార్త్-ఈస్ట్ ప్రాంతం కలిపి హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేది.
1956 తర్వాత దేశంలో మాట్లాడే భాష ప్రతిపాదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఈ క్రమంలో దక్షిణ మహారాష్ట్రకు చెందిన కొన్ని ప్రాంతాలు కర్ణాటకలో కలిశాయి. తెలంగాణ (హైదరాబాద్) రాష్ట్రంలోని చాలా వరకు భూభాగం మహారాష్ట్రలో, కర్ణాటకలో కలిసింది.