Srikakulam, Jan 12: శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన యువశక్తి సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan Speech in YuvaShakti) ప్రసంగించారు. అందరికీ స్వామి వివేకానందుడి జయంతి శుభాకాంక్షలు అంటూ ప్రసంగం ప్రారంభించారు. వయసొచ్చిన తర్వాత చేతికర్ర కావాల్సి వచ్చినప్పుడే మనవడి విలువ తెలుస్తుందని, అలాగే ఒక తరం వయసు పెరుగుతున్నప్పుడు భావితరం విలువ తెలిసొస్తుందని అన్నారు.
ఇప్పుడున్న నేతలు ఎంత సేపు వారి కోసం, వారి బిడ్డల కోసం ఆలోచిస్తున్నారు తప్ప మీకోసం ఆలోచించడంలేదు అని వ్యాఖ్యానించారు. నేను మీ అందరికీ ఇష్టమైన వ్యక్తిని కావొచ్చు... కానీ నేను సగటు మధ్యతరగతి మనిషిని, సామాన్యుడ్ని అని తెలిపారు. నాకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఉత్తరాంధ్ర గడ్డపైనే నటనలో ఓనమాలు దిద్దుకున్నాను. ఆట, పాట, కవిత, కళ అన్నీ ఉత్తరాంధ్ర నేర్పినవే. ఏం పిల్లడో ఎల్దమొస్తవా అంటూ పాడిన వంగపండు వంటి వారు నాకు స్ఫూర్తి. యే మేరా జహా... ఏ మేరా ఘర్ ఏ మేరా ఆషియా అన్నా గానీ ఆ చైతన్యం నాకు వచ్చింది ఉత్తరాంధ్రలోనే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని భావించే విశాఖ ఉక్కు కార్మికులు నేను నటన నేర్చుకునే సమయంలో నాకు అండగా నిలబడ్డారు" అని వివరించారు.
ఇవాళ తిట్టడానికి ఈ సభ పెట్టలేదని, తనకున్నదల్లా సగటు మనిషి తాలూకు ఆలోచనే అని స్పష్టం చేశారు. "ఈ దేశం నాకు ఎందుకు సహకరించదు, ఎందుకు నాకోసం నిలబడదు అని ప్రతి సగటు మనిషిలోనూ కోపం ఉంటుంది. నేను కూడా అలాంటి సగటు మనిషినే. నాలోనూ అలాంటి ప్రశ్నలే తలెత్తాయి. నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నా గురించి నేను చేసిన పోరాటం అంటే తొలిప్రేమ నుంచి ఖుషి సినిమా వరకు మాత్రమే.
నాకు కోరికలు లేవు. ఇంకా పెద్ద స్టార్ అవ్వొచ్చేమో, ఇంకా డబ్బులు రావొచ్చేమో, ఇంకా కృషి చేస్తే జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పేరు రావొచ్చేమో అని ఖుషీ తర్వాత అనిపించింది. కానీ నాలో ఏదో అశాంతి. అంత స్థాయికి చేరినా కూడా నాలో సంతోషం కలగలేదు. అన్ని విజయాలు సాధించినా, కోట్ల మంది ప్రజలు జేజేలు పలుకుతున్నా నాలో అశాంతికి కారణం ఏంటో నాకు అర్థం కాలేదు. అయితే, నా మనసు... బాధల్లో ఉన్న ప్రజల గురించి ఆలోచిస్తోందని తెలుసుకున్నాను. ఆ కష్టమే నన్ను ఆనందంగా ఉండనివ్వలేదు.
ఇవాళ ప్రతి సన్నాసి చేత, ప్రతి వెధవ చేత మాటలు అనిపించుకుంటుంటే నాకేమీ బాధగా లేదు. ఇలాంటి వెధవలు, ఇలాంటి సన్నాసులతో మాట అనిపించుకోకుండా బతికేయగలను... నా చేతుల్లో ఆ జీవితం ఉంది. రాజకీయాల్లోకి రాకపోతే ఇలాంటి సన్నాసులు నా పక్కన నిలబడి ఫొటోలు కూడా తీయించుకుంటారు.
నాకు తిట్టించుకోవడం ఓకే... ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడుతున్నప్పుడు (Our fight is for a better future) తిట్టించుకోవడం నాకేమీ బాధ కలిగించదు. మన కోసం మనం జీవించే జీవితం కంటే కూడా సాటి మనిషి కోసం జీవించడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. సినిమాల్లో కష్టాలు రెండున్నర గంటల్లో తీర్చగలను, కానీ నిజజీవితంలో ఉద్దానం వంటి కష్టాన్ని ఈ రోజుకీ తీర్చలేను. ఇవన్నీ చూసి, విభజన సమయంలో పరిస్థితులు చూసి రాజకీయాల్లోకి వచ్చాను.
మొన్న విజయనగరం జిల్లాలో టిడ్కో ఇళ్ల పరిశీలనకు వెళ్లినప్పుడు ఒక అంశం గమనించాను. యువత ప్రశ్నించేందుకు భయపడుతున్నారు. ఈ రాజకీయ నాయకులేమైనా దిగొచ్చారా? వాళ్లు కూడా మనలాంటి రక్తమాంసాలు ఉన్నవారే. వాడొక మాట అన్నప్పుడు మనమొక మాట అంటే వాడూ బాధపడతాడు. వాడొక దెబ్బకొట్టినప్పుడు లాగిపెట్టి మనం కూడా దెబ్బకొడితే వాడికీ దెబ్బతగులుతుంది" అని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర పోరాటాల గడ్డని, ఇది కళింగాంధ్ర కాదు కలియబడే ఆంధ్ర, తిరగబడే ఆంధ్ర... ఇక్కడి ప్రజలు మౌనంగా ఉంటే ఎలా? మీ ఉపాధి కోసం మీరు నిలదీయకపోతే ఎలా? ఇక్కడి నుంచి ఎందుకు వలస వెళ్లాలి? అని ఆలోచించకపోతే ఎలా? అని కర్తవ్యబోధ చేశారు.
యువత(youth)కు బంగారు భవిష్యత్ కోసం బాధ్యతగా పనిచేస్తామని జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హామీ ఇచ్చారు. యువతకు మంచి భవిష్యత్ కోసమే తన పోరాటమని పవన్ అన్నారు. ఒక దేశపు సంపద నదులు, ఖనిజాలు కాదని, ఒక దేశపు సంపద యువత కలల ఖనిజాలు అని పవన్ స్పష్టం చేశారు. తనకూ సగటు మనిషి ఆలోచనే ఉందని, చేతికి చేతికర్ర కావాల్సిన రోజు వచ్చినప్పుడే మనవడి విలువ తెలుస్తుందన్నారు. వయస్సు పెరుగుతూ వచ్చినప్పుడు భావితరం విలువ తెలుస్తుందని పవన్ తెలిపారు. ఎవరినో తిట్టడానికి ఈ సభ పెట్టలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇతరుల కోసం జీవించడాన్నే తాను ఆనందంగా భావిస్తానని పవన్ అన్నారు.
రాజకీయ నాయకులకు ఏమైనా కొమ్ములు ఉంటాయా?, వాళ్లను నిలదీయాలంటే ఎందుకంత భయం? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వెధవలను, సన్నాసులను ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని, గూండాలు, రౌడీలను ఎలా తన్నాలో కూడా తనకు తెలుసని పవన్ హెచ్చరించారు. ఓటమిని గాయంగా భావించానే తప్ప పరాజయంగా కాదని, తన చివరి శ్వాస వరకూ రాజకీయాలను వదిలే ప్రసక్తే లేదని పవన్ స్పష్టం చేశారు.