AP High Court (Photo-Video Grab)

Amaravati, Jan 12: ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1ని ఈ నెల 23 వరకు సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెం.1ని రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతి పక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర పూరితంగా జీవో జారీ చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడిన డివిజన్‌ బెంచ్‌ కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది.

సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదు, రహదారులు, రోడ్లపై సభలకు అనుమతి లేదు, జీవో నెంబర్‌ 1పై క్లారిటీ ఇచ్చిన ఏపీ అడిషనల్‌ డీజీపీ రవి శంకర్‌

జగన్ ప్రభుత్వం ఈ మధ్య తీసుకొచ్చిన జీవో నెంబర్‌ 1పై (GO No.1) జరుగుతున్న దుష్ప్రచారంపై ఆంధ్రప్రదేశ్‌ అడిషనల్‌ డీజీపీ రవి శంకర్‌ అయ్యన్నార్‌‌ వివరణ ఇచ్చారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన (AP Additional DGP Ravi Shankar Ayyanar) మాట్లాడుతూ.. 1861 పోలీస్‌ యాక్ట్‌కు లోబడే జీవో నెంబర్‌ 1 విడుదల చేసినట్లు పేర్కొన్నారు. షరతులకు లోబడి సభలు, సమావేశాలకు అనుమతి ఇస్తామన్నారు. సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదన్నారు. బ్యాన్‌ అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.