Amaravati, Jan 10: జగన్ ప్రభుత్వం ఈ మధ్య తీసుకొచ్చిన జీవో నెంబర్ 1పై (GO No.1) జరుగుతున్న దుష్ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీపీ రవి శంకర్ అయ్యన్నార్ వివరణ ఇచ్చారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన (AP Additional DGP Ravi Shankar Ayyanar) మాట్లాడుతూ.. 1861 పోలీస్ యాక్ట్‌కు లోబడే జీవో నెంబర్ 1 విడుదల చేసినట్లు పేర్కొన్నారు. షరతులకు లోబడి సభలు, సమావేశాలకు అనుమతి ఇస్తామన్నారు. సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదన్నారు. బ్యాన్ అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
ఇటీవల ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ జీవో తీసుకొచ్చినట్లు ఏడీజీపీ రవి శంకర్ తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా సభలు నిర్వహించుకోవాలని సూచించారు. పోలీసులు వేదిక స్థలాన్ని పరిశీలించి అనుమతి ఇస్తారని తెలిపారు. రహదారులు, రోడ్లపై సభలకు అనుమతి లేదన్నారు. అదికూడా అత్యవసరమైతే అనుమతులతో నిర్వహించుకోవచ్చని వెల్లడించారు.
ఈ జీవో ఉద్దేశం నిషేధం కాదని స్పష్టం చేశారు. ప్రజల రక్షణ, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఉండటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని జీవో నెంబర్1ను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత చట్టం దేశ వ్యాప్తంగా అమలవుతున్నదేనని అన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా రహదారుల మీద సభలు వద్దన్నామని లా అండ్ ఆర్డర్ డీఐజీ రాజశేఖర్ తెలిపారు.
మరీ అత్యవసర పరిస్థితుల్లో అనుమతులు తీసుకోవచ్చని పేర్కొన్నారు. సన్నగా, ఇరుగ్గా ఉండే రోడ్లమీద సభల వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బంది ఏర్పుడుతుందని.. అంబులెన్సులు, విమాన ప్రయాణాల వారికి సమస్యలు తేవద్దని సూచించారు. అందువల్లే పబ్లిక్ గ్రౌండ్లలో సభలు జరుపుకోవాలని జీవోలో ఉందని పేర్కొన్నారు.
శ్రీకాకుళంలో జనసేన పార్టీ నిర్వహించే సభకు అనుమతిచ్చామని తెలిపారు. ఇటీవల కందుకూరు, గుంటూరులో జరిగిన ఘటనల ఆధారంగా ప్రభుత్వం జీవో నెంబరు 1 జారీ తీసుకొచ్చిందన్నారు. కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటనకు రెండు అంశాలకు సంబంధించి పోలీసులకు వివరణ ఇవ్వలేదని, వాటికి వివరణ ఇచ్చి ఉంటే స్థానిక పోలీసులు అనుమతి ఇచ్చే వారన్నారు. పోలీసు నిబంధనలు పాటించి బహిరంగసభలు, రోడ్ షోలు పెట్టుకోవచ్చన్నారు.