అమెజాన్ 30వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అమెజాన్ ఉచితంగా బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఒక వాట్సాప్ సందేశం (Fake WhatsApp Message) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇది ఫేక్ అని ఇలాంటి వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది ఇలాంటివి రాగానే అందులో నిజమెంతో తెలుసుకోకుండా కొందరు ఇతరులకు ఫార్వార్డ్ చేస్తుంటారు. బహుమతి సంగతి ఏమో కానీ అలాంటి లింకులు క్లిక్ చేయడం వల్ల సైబర్ నేరగాళ్ల బారిన పడడం మాత్రం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
తాజాగా అమెజాన్ పేరిట కూడా ఇలాంటి లింక్ (Amazon's 30th anniversary) వాట్సాప్ గ్రూపుల్లో తెగ వైరల్ అవుతోంది. అయితే అమెజాన్ లోగోతోనే ఈ లింకుతో వస్తుండడం వల్ల ఎక్కువ మంది సులభంగా నమ్మడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కానీ, నిశితంగా పరిశీలిస్తే యూఆర్‌ఎల్ HTTPతో ప్రారంభమవుతోంది. ఎప్పుడైనా లింకులో ‘S’ లేదంటే అది సెక్యూర్ కాదని అర్థం చేసుకోవాలి. ఇలాంటి లింకులు హెచ్‌టీటీపీతోనే ప్రారంభమవుతాయని గమనించాలి.
అలాగే యూఆర్‌ఎల్ xyz అనే దానితో ముగుస్తుంది. ఎక్కువ శాతం వ్యాపార సంస్థలు .comతో ముగుస్తాయని గుర్తుంచుకోవాలి. అసలు అమెజాన్ స్థాపించి 30 ఏళ్లు పూర్తీ కాలేదు. ఇక లింక్ క్లిక్ చేస్తే ఫలానా ఫోన్ గెలుచుకోవాలంటే ఈ సందేశాన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ, వ్యక్తులకు పంపించాలని వస్తుంది. వాస్తవానికి అమెజాన్ ఎలాంటి ఆఫరూ ప్రకటించలేదు. అంతపెద్ద కంపెనీ ఇలాంటి ఆఫర్లు ప్రకటించినప్పుడు తన వెబ్‌సైట్‌లో పొందుపరచకుండా ఉంటుందా? కాబట్టి ఇలాంటి ఫేక్ మెసేజులు నమ్మొద్దు.