ట్విటర్‌పై కన్నేసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అనుకున్న విధంగానే ఆ సంస్థను సొంతం చేసుకున్నారు. ట్విటర్ బోర్డ్ ఈ ఒప్పందానికి ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. టేకోవర్ విలువ దాదాపు 44 బిలియన్ డాలర్లు. షేరు కొనుగోలు ధర 54.20 డాలర్లు. టేకోవర్ కోసం 46.5 బిలియన్ డాలర్ల నిధులు కూడా సిద్ధం చేసుకున్నానంటూ మస్క్ ప్రకటించడంతో ట్విటర్ యాజమాన్యంపై తొలుత ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో సోమవారం మస్క్‌తో చర్చలు జరిపింది. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా వ్యవస్థాపకుడైన మస్క్ సంపద విలువ ప్రస్తుతం 279 బిలియన్ డాలర్ల పైమాటే. టెస్లాలో అయనకు 17 శాతం వాటాలు ఉన్నాయి.
ఫేస్‌బుక్, టిక్‌టాక్‌తో పోలిస్తే తక్కువ మంది యూజర్లున్నప్పటికీ, ప్రముఖ సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, జర్నలి్‌స్టలు, మేధావి వర్గం ఖాతాలతో ట్విటర్‌కు ప్రపంచవ్యాప్తంగా అమిత ప్రాచుర్యం లభించింది. ట్విటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్న మస్క్ కూడా ట్విటర్ ప్రముఖ యూజర్లలో ఒకరు. ఈ వేదికలో ఆయనకు 8.1 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. వాక్ స్వేచ్ఛకు వేదిక అవుతుందన్న నమ్మకంతోనే కంపెనీలో పెట్టుబడులు పెట్టానని, కాకపోతే ప్రస్తుత స్థితిలో కంపెనీ వాక్ స్వేచ్ఛను పెంచకపోవడమే కాదు, కల్పించనూ లేదని పెట్టుబడులు పెట్టాక నాకు అవగతమైందంటూ ట్విటర్ చైర్మన్ బ్రెట్ టేలర్‌కు రాసిన లేఖలో మస్క్ పేర్కొన్నారు. లిస్టెడ్ కంపెనీగా ఉన్న ట్విటర్‌ను ప్రైవేట్ కంపెనీగా మారాల్సిన అవసరం ఉందని.. అందుకే సంస్థను పూర్తిగా కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు లేఖలో ప్రతిపాదించారు.
అమెరికాకు చెందిన మైక్రోబ్లాగింగ్, సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్ ట్విటర్‌ను జాక్ డోర్సీ, బిజ్ స్టోన్, ఎవాన్ విలియమ్స్, నోవా గ్లాస్ కలిసి 2006లో ఏర్పాటు చేశారు. కొన్ని పదాల్లో క్లుప్తంగా అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు ఉపయోగపడేలా దీన్ని ఉద్దేశించారు. ప్రస్తుతం దీనికి ప్రవాస భారతీయుడైన పరాగ్ అగర్వాల్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. గతేడాది రెండో త్రైమాసికం గణాంకాల ప్రకారం ట్విటర్‌కు 20 కోట్ల పైగా యూజర్లు ఉన్నారు. అమెరికాలో అత్యధికంగా 7.7 కోట్ల పైచిలుకు ఉండగా.. భారత్‌లో వీరి సంఖ్య 2.36 కోట్ల స్థాయిలో ఉంది.