Bengaluru, February 9: కర్ణాటకలో గత కొన్ని రోజులుగా హిజాబ్‌పై వివాదం జరుగుతున్న సంగతి విదితమే. హైకోర్ట్ సింగిల్ బెంచ్ న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్ ( Justice Krishna Dixit) బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపారు. హిజాబ్‌పై పిటిషన్లు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అయితే ఏ ఒక్క బాలికను చదువుకోకుండా అడ్డుకోకూడదని పిటిషనర్ తరుఫు న్యాయవాది సంజయ్ హెడ్గే వాదించారు. దీంతో రాజ్యాంగం, ముస్లిం పర్సనల్ చట్టం ప్రకారం చాలా అంశాలకు సంబంధించిన ప్రశ్నలను చర్చించాల్సి ఉందని సింగిల్ బెంచ్ అభిప్రాయపడింది.
దీని కోసం పెద్ద ధర్మాసనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదా అన్నది నిర్ణయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. మరోవైపు హిజాబ్ ధారణకు సంబంధించి ముస్లిం బాలికలకు ఎలాంటి మధ్యంతర ఉపశమనం హైకోర్టు సింగిల్ బెంచ్ ఇవ్వలేదు. దీనిపై కూడా పెద్ద బెంబ్ మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. ఈ మేరకు ఈ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి (Single Bench Refers Matter to Larger Bench) బదిలీ చేసింది.
కాగా ఉడిపి జిల్లాలో హిజాబ్ ధరించిన ముస్లిం బాలికలను ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లోకి అనుమతించడం లేదు. అయితే ఇది తమ హక్కు అని ముస్లిం బాలికలు వాదిస్తున్నారు. హిజబ్ ధరించే తరగతులకు హాజరవుతామంటూ నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో క్లాస్‌లో హిజబ్‌పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఉడిపి జిల్లాకు చెందిన ముస్లిం బాలికల బృందం కర్ణాటక హైకోర్టును (Karnataka High Court) ఆశ్రయించింది.
హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటక సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే పాఠశాలలు, కాలేజీలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. విద్యాసంస్థలకు దగ్గరలో సమావేశాలు, నిరసనలు చేపట్టకుండా రెండు వారాల పాటు నిషేధం విధించింది. బెంగళూరు వ్యాప్తంగా నిరసనలపై నిషేధం తక్షణం అమలులోకి వస్తుదని పేర్కొంది. 200 మీటర్ల పరిధిలో ఎలాంటి సమూహాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు అమలు చేపట్టేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
పాఠశాలలు, కళాశాలల యూనిఫాం నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరుతూ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నట్లు గుర్తించామని ఉత్తర్వుల్లో పేర్కొంది. కొన్ని చోట్ల నిరసనలు హింసకు దారి తీశాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించాయని.. బెంగళూరు నగరంలోనూ ఇలాంటి ఆందోళనలు, నిరసనలు జరిగే అవకాశం ఉండడంతో నిషేధం విధించినట్లు పేర్కొంది. ఉత్తర్వులతో ఎవరైనా ప్రతికూలంగా ప్రభావితమైనట్లు భావిస్తే ఆర్డర్‌ను సవరించేందుకు, రద్దు చేసేందుకు సంబంధిత శాఖ, కర్ణాటక ప్రభుత్వానికి అప్పీల్ చేయొచ్చని పేర్కొంది.