New Delhi, Jan 8: రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే పథకాన్ని మార్చి నాటికి భారత ప్రభుత్వం ప్రారంభించనుందని, ఇది జాతీయ స్థాయిలో అమలులోకి వస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ చొరవ కింద, బాధితులు ప్రమాదం జరిగిన ఏడు రోజులకు రూ. 1.5 లక్షల వరకు వైద్య చికిత్సకు అర్హులు. అన్ని రకాల రోడ్లపై వాహనాల వల్ల జరిగే ప్రమాదాలకు ఈ పథకం వర్తిస్తుంది.
నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) పోలీసులు, ఆసుపత్రులు మరియు రాష్ట్ర ఆరోగ్య సంస్థల సహకారంతో కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తుంది. ఇది IT ప్లాట్‌ఫారమ్ ద్వారా పని చేస్తుంది, ఇది NHA యొక్క లావాదేవీ నిర్వహణ వ్యవస్థతో రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ యొక్క ఇ-డిటైల్ యాక్సిడెంట్ రిపోర్ట్ (eDAR) అప్లికేషన్‌ను ఏకీకృతం చేస్తుంది. ఈ స్కీమ్ మార్చి 14, 2024న చండీగఢ్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైంది. తరువాత 6 ఇతర రాష్ట్రాలకు విస్తరించబడింది. ప్రమాదం జరిగిన తర్వాత సకాలంలో వైద్యం అందించడమే దీని లక్ష్యం.
ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడితే చికిత్సకు అయ్యే ఖర్చులో గరిష్ఠంగా రూ.1.50 లక్షలు ఈ పథకం ద్వారా ప్రభుత్వమే భరిస్తుందని గడ్కరీ తెలిపారు. అయితే ఇది మొదటి ఏడు రోజుల చికిత్సకు అయ్యే బిల్లుకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రమాద ఘటన జరిగిన 24 గంటల్లోగా పోలీసులకు సమాచారాన్ని అందిస్తేనే ఈ స్కీం ద్వారా నగదు రహిత చికిత్సను పొందొచ్చని గడ్కరీ స్పష్టం చేశారు. అదేవిధంగా హిట్ అండ్ రన్ కేసుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందిస్తామని గడ్కరీ తెలిపారు.
పలు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి గడ్కరీ మంగళవారం సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఢిల్లీలోని భారత్ మండపంలో మీడియాతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలకే తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. 2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.8 లక్షల మంది చనిపోయారని.. అందులో 30 వేల మంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే మరణించినట్లు తెలిపారు.
మృతుల్లో 66 శాతం మంది 18 నుంచి 34 ఏండ్ల మధ్య వయస్సుగల వారే ఉండటం బాధాకర విషయమన్నారు. ఇక స్కూళ్లు, కాలేజీల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల తప్పుల వల్ల 10,000 మంది పిల్లలు చనిపోయారని గడ్కరీ వివరించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు వాహనాలు నడపడం వల్ల మూడు వేల మంది మరణించినట్లు తెలిపారు.