New Delhi, November 4: దీపావళి వేళ కేంద్రం సామాన్యులకు మరో ఊరట కలిగించే వార్తను తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉల్లి ధరలు (Onion Price) చౌకగా ఉన్నాయని, ధరలను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలను ఇస్తోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉల్లిగడ్డలు ఆల్ ఇండియా రిటైల్, హోల్‌సెల్ మార్కెట్లో ప్రస్తుతం కిలో రూ.40.13 ఉందని, క్వింటాల్‌కు రూ.3215.92 ధర పలుకుతోందని పేర్కొంది.
భారీ వర్షాల కారణంగా అక్టోబర్ మొదటివారం నుంచి ఉల్లిపాయల ధరలు పెరగడం ప్రారంభించాయని.. ధరలను తగ్గించేందుకు (Onion cheaper than last year) వినియోగదారుల వ్యవహారాల శాఖ చర్యలు చేపట్టిందని పేర్కొంది. ఇందులో భాగంగా అడిగిన వారికి అడిగినట్లుగా బఫర్ నిల్వల నుంచి ఉల్లి సరఫరా చేశామని, దీంతో ధరలు దిగివచ్చాయని పేర్కొంది. నవంబర్ 2 వరకు హైదరాబాద్, దిల్లీ, కోల్‌కతా, లఖ్‌నవూ, పట్నా, రాంచీ, గువాహటి, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, ముంబయి, ఛండీగఢ్, కోచి, రాయ్‌పుర్‌లాంటి ప్రధాన మార్కెట్లకు 1,11,376.17 మెట్రిక్ టన్నుల ఉల్లి సరఫరా చేశామని, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌ల్లోని స్థానిక మార్కెట్లకూ అందించినట్లు చెప్పింది. ధరలు ఏవైనా పెద్దగా పెరిగినా వాటిని ఎదుర్కోవడానికి కేంద్రం ఆగస్టులో 200,000 టన్నుల ఉల్లిపాయలను రికార్డు స్థాయిలో నిల్వ చేసింది.
వినియోగదారుల వ్యవహారాల శాఖ రాష్ట్రాలకు రూ.21కే కిలో ఇవ్వడానికి సిద్ధమైందని, రిటైల్ మార్కెట్ చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు రవాణా ఖర్చులతో కలిపితే వచ్చే ధరకు (ల్యాండెడ్ ప్రైస్-వాస్తవ ధర) ఉల్లి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంది. ధరల స్థిరీకరణ నిధితో వినియోగ వ్యవహారాల శాఖ బఫర్ నిల్వలు నిర్వహిస్తోందని కేంద్రం పేర్కొంది.
2020 అక్టోబర్‌లో కూడా ఉల్లిపాయల ధరలు రెట్టింపు అయ్యాయి, అదే సంవత్సరం మార్చి మరియు ఏప్రిల్‌లలో అకాల వర్షపాతం కారణంగా, పంటలు కుంగిపోయాయి. రిటైల్ ధరలు మొదటగా ముంబై మరియు ఢిల్లీ వంటి నగరాల్లో సాధారణ రేట్లు ₹35 మరియు ₹40 నుండి కిలోకు ₹70కి పెరిగాయి, ఆపై కిలోకు ₹100కి చేరాయి. కాలానుగుణంగా కొన్ని ఆహార పదార్థాల ధరలు అస్థిరంగా ఉంటాయి. అందులో ఉల్లి ఒకటి. దీని రేట్లు తరచుగా ఆహార ద్రవ్యోల్బణాన్ని రేకెత్తిస్తాయి. పేద లేదా ధనిక వినియోగదారుల యొక్క నెలవారీ బడ్జెట్‌లను తట్టిలేపుతాయి.