Lucknow, June 15: అనేక మంది భారతీయ అథ్లెట్లు అంతర్జాతీయ వేదికలపై (international platforms) పతకాలు సాధించడం ద్వారా మన దేశానికి గర్వం తెచ్చారు. అయితే వీరిలో కొందరి ప్రయాణాలు ఉన్నత స్థితిలో ఉండగా మరి కొందరి ప్రయాణాలు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నాయి. తాజాగా భారత్ నుంచి కరాటేలో ప్రపంచ ఛాంపియన్ గా అవతరించిన ఉత్తర ప్రదేశ్ కు చెందిన హరియోమ్ శుక్లా పరిస్థితి (Poverty forces world karate champion) తలుచుకుంటే ఎవరైనా అయ్యో అనక మానరు.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన హరిఓమ్ శుక్లా (Hari Om Shukla) పాతికేళ్లు కూడా నిండక ముందే 60కి పైగా పతకాలు సాధించి, కరాటేలో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించారు. పదునైన పంచ్‌లతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ప్రపంచ ఖ్యాతి గాంచారు. అటువంటి వ్యక్తి నేడు కుటుంబ పోషణ నిమిత్తం రోడ్డెక్కాడు. ఇల్లు గడవని దీన స్థితిలో రోడ్డు పక్కన టీ అమ్ముతూ (Hariom Shukla to sell tea in Uttar Pradesh) కాలం వెల్లబుచ్చుతున్నాడు.
2013లో థాయ్‌లాండ్‌లో జరిగిన జూడో కరాటే ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భారత్ తరఫున స్వర్ణ పతకాన్ని సాధించిన శుక్లా.. ఆరేళ్ల ప్రాయంలోనే కరాటేలో ఓనమాలు దిద్దుకున్నాడు. అతనికి 23 ఏళ్లు వచ్చేసరికి 60కి పైగా పతకాలు సాధించాడు. వివిధ దేశాల టోర్నమెంట్లలో పాల్గొన్నశుక్లా అనేక పతకాలను సాధించాడు.
మధుర జిల్లాలోని ఇసాపూర్ నివాసి అయిన హరియోమ్ 2008 లో ఖాట్మండులో మొదటి బంగారు పతకాన్ని గెలుచుకోవడం ద్వారా దేశానికి ఖ్యాతిని తెచ్చిపెట్టాడు. ఆ తర్వాత 2013 లో థాయ్‌లాండ్‌లో స్వర్ణంతో పాటు రజత పతకాన్ని కూడా గెలుచుకున్నాడు. 2015 లో తన రెండవ అంతర్జాతీయ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. యుఎస్, శ్రీలంకలో మొదటి సీనియర్ స్వర్ణం గెలుచుకున్నాడు. అతను ఇప్పటివరకు బంగారు, వెండి, కాంస్యాలతో సహా 60 పతకాలు సాధించాడు. ప్రపంచ ఛాంపియన్ పతకాన్ని కూడా గెలుచుకున్నాడు.
అయితే, ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందకపోవడంతో అతని ఆర్ధిక కష్టాలు మొదలయ్యాయి. టోర్నీల్లో గెలుచుకున్న ప్రైజ్ మనీ సైతం అడుగంటి పోయింది. ఈ క్రమంలో ఉద్యోగం కోసం ప్రభుత్వానికి ఎన్ని సార్లు మొర పెట్టినా ఫలితం లేకుండా పోయింది. రోజు రోజుకూ కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో ఓ టీ స్టాల్‌ను నడిపిస్తున్నాడు.
లాక్‌డౌన్‌కు ముందు వరకు స్కూల్ పిల్లలకు కరాటే పాఠాలు నేర్పిన శుక్లా.. ప్రస్తుతం ఛాయ్ వాలాగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. కరోనా కారణంగా పిల్లలెవరూ క్లాసులకు హాజరు కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీ స్టాల్ నడుపుతున్నాని అతను వాపోతున్నాడు. ప్రస్తుతానికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా.. ఆ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా తన వద్ద డబ్బు లేదని.. ఆ సర్టిఫికేట్ ఉంటే ఏదైనా ఉద్యోగం చూసుకునే వాడినని అంటున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్రీడాకారుల కోటాలో తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నాడు.
అనేక ప్రభుత్వ పథకాలు అథ్లెట్లకు ప్రయోజనం చేకూరుస్తాయని పేర్కొన్నప్పటికీ, గ్రౌండ్ రియాలిటీ వేరే కథను అందిస్తుందని ఇతని కథ ద్వారా తెలుస్తోంది. అతను ఓ ఛానల్ తో మాట్లాడుతూ..నేను 2006 నుండి ఈ క్రీడను ఆడుతున్నాను. జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించాను. నా రాష్ట్రానికి ఎన్నో పురస్కారాలను తీసుకువచ్చాను కాని ఈ దేశం నుంచి స్పోర్ట్స్ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగం పొందలేదు. నేను కూడా వివిధ రాజకీయ నాయకులను కలుసుకున్నాను మరియు సహాయం కోసం అడిగాను కాని భరోసా కంటే మరేమీ రాలేదు, "అని ఆయన అన్నారు.
విధిలేని పరిస్థితుల్లో రోజంతా టీని విక్రయిస్తున్నానని చెప్పాడు.తన తండ్రి అతనికి ఈ చిన్న వ్యాపారంలో సాయం చేస్తున్నాడు. ఈ విషయం మీద అతని తండ్రి దీనాదయాల్ మాట్గాడుతూ.. మొదటి నుండి నా కొడుకు క్రీడల పట్ల చాలా ఇష్టం. దేశం కోసం ఎన్నో పతకాలు సాధించాడు, కాని మాకు ఏ రాజకీయ నాయకుడు లేదా అధికారుల నుండి ఎలాంటి సహాయం రాలేదు" అని అన్నారు.