New Delhi, Feb 1: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం పదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) వార్షిక బడ్జెట్ వివరాలు తెలిపారు. మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. బడ్జెట్‌కు కేబినెట్ ఆమోద ముద్ర తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సెషన్ రెండో రోజు ప్రారంభం కానుంది. 80సీ కింద మినహాయింపులు(లక్షన్నర నుంచి రూ. 3లక్షల పెంచుతారనే ఆశ) మీద వేత జీవుల ఆశలు, స్టాండర్డ్ డిడక్షన్ 50 వేల నుంచి లక్ష రూ. పెంచడం లాంటి అంశాల మీద అందరి దృష్టి ఉంది.
దేశం కరోనాతో గత రెండేళ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక పురోగతికి ఈ ఏడాది కలిసి రావొచ్చనే అంచనాలు ఆర్థిక సర్వే 2022 ద్వారా మిణుకుమిణుకుమంటున్నాయి. ప్రస్తుతం మూడో వేవ్‌లో ఉన్నప్పటికీ.. పరిస్థితి గతంతో పోలిస్తే కొంత మెరుగైందనే చెప్పొచ్చు. ఈ తరుణంలో రూ.2.5 లక్షలుగా ఉన్న ఐటీ పరిమితి మినహాయింపులు పెరిగే అవకాశాలు తక్కువనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ సారి బడ్జెట్ (Union Budget 2022) దాని మీదే ఫోకస్ ఉండే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
వ్యవసాయ, పారిశ్రామికరణ.. ఇతరత్ర కేటాయింపులు ఉండొచ్చనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది. గతంలో ఎలక్షన్ సంబంధిత రాష్ట్రాలకు జరిగిన కేటాయింపులనే దీనికి ఉదాహరణలుగా చూపిస్తున్నారు. వ్యవసాయం మాత్రమే కాదు.. మౌలిక వసతులు, రోడ్లు, రైల్వే, ఇరిగేషన్, మెడిసిన్ సంబంధిత బడ్జెట్
వరాలు సైతం ఆయా రాష్ట్రాల పైనే బడ్జెట్ వరాలు ఉండవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు బీజేపీ వ్యతిరేక రాష్ట్రాల్లోనూ పట్టు కోసం బడ్జెట్ ఫోకస్ ఉండొచ్చనే వాదనా వినిపిస్తోంది. దీంతో అసంతృప్త రాష్ట్రాల పరిస్థితిపై జోరుగా చర్చ నడుస్తోంది.
2022-2023 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8-8.5 శాతంగా ఉండొచ్చనే లెక్కల నడుమ.. రాబడి పెరగడంతో(గత రెండేళ్లలో పోలిస్తే) ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యపరంగా ఆసరా అందించే ఆస్కారం ఉందనే ఆశ మాత్రం ఉంది. వ్యాక్సినేషన్, సర్వీస్ సెక్టార్, నియంత్రణల సడలింపులు, ఎరువుల రాయితీలు, అంతరిక్షంలో ప్రైవేటీకరణ, రైల్వేలో పెట్టుబడులకు అవకాశం, రహదారుల నిర్మాణం, స్టార్టప్‌లకు అండదండలు.. తదితర అంశాలపైనే ఈ భడ్జెట్ ప్రధాన ఫోకస్ ఉన్నట్లు అర్థమవుతోంది. ఏది ఏమైనా మరికొద్ది గంటల్లో బడ్జెట్ విషయం తేలిపోనుంది.