New Delhi, February 1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సోమవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై (Budget 2021) భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరిని సెస్ అంశం కలవరపెడుతోంది. ఇక మీదట క్రూడ్ ఆయిల్, ఆల్కహాల్, ముడి ఆయిల్, కొన్ని దిగుమతి చేసుకునే వస్తువులపై వ్యవసాయ, మౌలికసదుపాయల అభివృద్ధి సెస్‌ని విధించేందుకు కేంద్రం సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో ఆల్కాహాల్, క్రూడ్ ఆయిల్, పామయిల్, వంట నూనెల ధరలు భారీగా (Expensive) పెరగనున్నాయి. ఆల్కాహాల్ బివరేజేస్‌పై కేంద్రం 100 శాతం సెస్‌ని ప్రతిపాదించింది. దాంతో మద్యం ధరలు మరింత పెరగనున్నాయి.
ముడి పామాయిల్‌పై 17.5 శాతం, దిగుమతి చేసుకున్న యాపిల్స్‌పై 35 శాతం, ముడి సోయాబీన్, సన్ ఫ్లవర్ నూనెలపై 20శాతం వ్యవసాయ సెస్‌ని బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఫలితంగా వంట నూనెలు ధరలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే వంట నూనెలు లీటర్ 140 రూపాయలుగా ఉండగా.. వ్యవసాయ సెస్ అమల్లోకి వస్తే.. ఇది మరింత పెరగనుంది. ఇక పెట్రోల్, డీజిల్‌పై విధించిన వ్యవసాయ సెస్‌ని సుంకం నుంచి మినహాయిస్తామని.. ఫలితంగా వాటి ధరలు యథాతధంగా ఉంటాయిన నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక కాటన్‌పై 10శాతం కస్టమ్స్ డ్యూటీ పెంపుతో దిగుమతి చేసుకునే ప్రీమియం దుస్తులు మరింత ప్రియం కానున్నాయి. అదే విధంగా లెదర్ ఉత్పత్తులు, సోలార్ ఇన్వెర్టర్ల ధరలు పెరగనున్నాయి. ఆటోమొబైల్ రంగంలో కస్టమ్ డ్యూటీ పెంపుతో కార్ల విడిభాగాల ధరలు కూడా పెరగనున్నాయి. ఇక బంగారం, వెండి ధరలు మాత్రం దిగిరానున్నాయి. అదే విధంగా రాగిపై పన్ను మినహాయింపులు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కాగా అక్టోబర్ 21 నుంచి కొత్త కస్టమ్స్ పాలసీ అమల్లోకి రానుంది
యూనియన్ బడ్జెట్ 2021 మొబైల్ ప్రియులకు షాకిచ్చింది. బడ్జెట్ 2021 ప్రసంగంలో మొబైల్ విడిభాగాలపైన 2.5శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఆయా వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ ఐదు నుంచి పది శాతం పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల ఫోన్లు, ఛార్జర్ల ధర 1 నుండి 2 శాతం వరకూ పెరగవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
ఛార్జర్లపై సుంకాన్ని 15 నుంచి 30 శాతానికి, మదర్‌బోర్డ్‌లపై సుంకాన్ని 10 నుంచి 20 శాతానికి, మొబైల్ తయారీలో వినియోగించే ఇతర పరికరాలపై కూడా సుంకాన్ని పెంచారు. మొబైల్ ఫోన్లకు ఇస్తున్న 10 శాతం సర్వీస్ వెల్ఫేర్ సెస్ మినహాయింపును కూడా ఈసారి రద్దు చేశారు. మొబైల్ ఫోన్‌లలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి అవసరమైన భాగాలు, ఉప భాగాలపై ఇప్పటివరకు ఎటువంటి పన్ను విధించలేదు. కానీ, ఇప్పుడు 2.5 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. దేశీయంగా ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించేందుకు ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ప్రపంచ ఉత్పత్తి గొలుసులో భారత్‌ను భాగస్వామిగా చేసేందుకు , ఉద్యోగావకాశాలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. మేకిన్ ఇండియా విధానంలో భాగంగానే మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి విడిభాగాలపై కస్టమ్స్ సుంకాల రేట్లలో పెరుగుదల ఉంటుంది.
ఈ చర్య వల్ల దేశీయ ఉత్పత్తి సామర్ధ్యం పెరగనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఐతే దిగుమతి సుంకంలో పెరుగుదల ప్రభావం వినియోగదారులపై అంతగా ఉండకపోవచ్చని.. దేశీయ మొబైల్ ఫోన్ మార్కెట్ 97 శాతం అవసరాలు స్థానిక ఉత్పత్తుల వల్లనే సరిపోతాయని కొందరు పరిశీలకులు అంటున్నారు.
బడ్జెట్‌లో పన్ను మినహాయింపులు, తగ్గింపులు ఏమీ చెప్పకపోయినా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్తగా ఓ సెస్ మాత్రం విధించారు . ఆ కొత్త సెస్ పేరు అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్. ఈ సెస్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నారు.
Here's Finance Secretary AB Pandey Statemet
We are expecting Rs 30,000 crores through Agriculture Infrastructure and Development Cess. This cess has been designed such a manner that it won't impact common man: Finance Secretary AB Pandey pic.twitter.com/As9IgaWLeu
— ANI (@ANI) February 1, 2021
ఈ సెస్‌ను దేశంలోని ప్రతి ఒక్కరూ వినియోగించే వస్తువులైన పెట్రోల్, డీజిల్, ఆల్కహాల్, బంగారం, వెండి, పప్పులు, ఆపిల్స్, పామాయిల్ వంటి వాటిపై విధిస్తారు. అయితే ఈ కొత్త సెస్ ద్వారా ఏడాదికి సుమారు రూ.30 వేల కోట్ల ఆదాయం అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఏబీ పాండే వెల్లడించారు. అయితే ఈ సెస్‌ను సగటు పౌరుడిపై ఎలాంటి భారం మోపకుండా రూపొందించినట్లు ఆయన చెప్పారు.
అయితే వ్యవసాయ సెస్సు విధింపుపై ప్రతిపక్షాలు, సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోన్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై స్పందించారు. సెస్సు విధింపు వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోవని స్పష్టం చేశారు. వ్యవసాయ సెస్ విధించి.. ఇతర ట్యాక్స్‌లు తగ్గిస్తామని వెల్లడించారు. సెస్‌ల భారాన్ని సుంకం నుంచి మినహాయిస్తామని.. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు యథాతధంగా ఉంటాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు
ఇక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన అనంతరమే సోషల్ మీడియాలో బడ్జెట్‌పై చర్చ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి ఒక్కో కేటాయింపు గురించి ప్రకటిస్తూ ఉంటే నెటిజెన్లు పెద్ద ఎత్తున చర్చ చేస్తూ వచ్చారు. ఈ చర్చ ఎంతలా జరిగిందంటే.. ‘బడ్జెట్ 2021’ అనే హ్యాష్‌ట్యాగ్‌పై ఇప్పటి వరకు ఏకంగా 13 లక్షల ట్వీట్లు వచ్చాయి. ట్విట్టర్‌తో పాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి పబ్లిక్ వేదికల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
ఈసారి బడ్జెట్ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగడానికి కారణం అదొకటని అంటున్నారు. అంతే కాకుండా డిజిటల్ విధానం నానాటికీ అభివృద్ధి చెందుతుండడం, సోషల్ మీడియా యూజర్లతో పాటు వాడకంలోనూ అనేక మార్పులు రావడంతో ఈ వేదికలపై చర్చలు పెరిగాయి. ఈ తరుణంలో తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారంనాడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్‌పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెదవి విరిచారు. మోనిటైజేషన్ ప్లాన్‌తో జాతి ఆస్తులను అమ్మకానికి పెట్టేస్తున్నారంటూ మండిపడ్డారు. బడ్జెట్‌పై రాహుల్ ఓ ట్వీట్‌లో తన స్పందన తెలియజేశారు. 'జనం చేతుల్లో డబ్బులు ఉంచడానికి బదులు, మోదీ ప్రభుత్వం దేశానికి చెందిన ఆస్తులను తన క్రోనీ క్యాపిటలిస్ట్ మిత్రులకు ధారాదత్తం చేసేందుకు ప్లాన్ చేసింది' అని ఆయన తప్పుపట్టారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో సోమవారంనాడు ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. దేశ ప్రజలకు మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని అన్నారు. భారతదేశ దృఢ సంకల్పాన్ని, ఆత్మనిర్భరతను ప్రపంచానికి చాటుతోందని పేర్కొన్నారు. స్వయంసమృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవర్చేలా కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని ప్రశంసించారు. ఆసాధారణ పరిస్థితుల నేపథ్యంలో 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు.
సమాజంలోని అన్ని వర్గాలకు చేయూత నిచ్చేలా బడ్జెట్ ఉందని, మౌలిక వసతులకు నిర్మలా సీతారామన్ పెద్ద పీట వేశారని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు. ఆత్మనిర్భర భారత్‌కు బడ్జెట్ విజిన్‌లా పనిచేస్తుందని అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడంపై బడ్జెట్ దృష్టి సారించిందని చెప్పారు. ఈ దిశగా అనేక చర్యలు తీసుకున్నామని అన్నారు. రైతులు చాలా సులువుగా రుణాలు తీసుకోగలగుతారని అన్నారు.
అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్టక్చర్ ఫండ్ సహాయంతో ఏపీఎంసీ మార్కెట్లు పటిష్టమవుతాయని అన్నారు. యువతకు కొత్త అవకాశాల కల్పనతో పాటు మానవ వనరులు, మౌలిక వసతుల వృద్ధితో సాంకేతకపరంగా పురోగమించడానికి బడ్జెట్ సంస్కరణలు ఎంతగానో దోహదపడతాయని ఆయన అన్నారు. సామాన్యుడిపై పన్ను భారం ఉంచినట్టు చాలామంది అభిప్రాయపడవచ్చని, అయితే, బడ్జెట్ పారదర్శకతపై తాము దృష్టి సారించామని మోదీ పేర్కొన్నారు
ఈసారి బడ్జెట్ ఇలా ఉంటుందని ప్రజలు ఏమాత్రం ఊహించలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే గతంలో తమ ప్రభుత్వం ఐదు మిని బడ్జెట్‌లను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లలోనే కొన్ని ప్యాకేజీలు ప్రకటించామని, ఆత్మనిర్భర భారత్ అందులో భాగమేనని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ సూపర్ బడ్జెట్ అని, ఎంత ప్రశంసించినా తక్కువే అని, అంత బాగుందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
ధరలు పెరిగేవి
ఎలక్ట్రానిక్ వస్తువులు
మొబైల్ ఫోన్లు(ఇంపోర్టు డ్యూటీ 2.5 పెంపు)
చెప్పులు
పర్సులు
చార్జర్స్(మొబైల్ విడిభాగాల్లో కొన్నింటికి మినహాయింపు)
సింథటిక్ జెమ్‌స్టోన్స్
లెదర్ ఉత్పత్తులు
సోలార్ ఇన్వర్టర్లు(డ్యూటీ 5 శాతం నుంచి 20 శాతానికి పెంపు)
సోలార్ లాంతర్లు(5 నుంచి 15 శాతానికి పెంపు)
ఆటో విడిభాగాలు
స్టీలు స్క్రూలు(10 నుంచి 15 శాతానికి పెంపు)
కాటన్(0 నుంచి 10 శాతం)
రా సిల్స్, యాన్ సిల్క్(10 నుంచి 15 శాతానికి పెంపు)
ఆల్కహాలిక్ బీవెరేజెస్
క్రూడ్ పామాయిల్
క్రూడ సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్
ఆపిల్స్
బొగ్గు, లిగ్నైట్, పిట్
యూరియా తదితర ఫర్టిలైజర్లు
బఠాణీలు
కాబూలీ శనగలు
బెంగాల్ గ్రాం
పప్పులు
ధరలు తగ్గేవి
ఐరన్
స్టీలు
నైలాన్ దుస్తులు, నైలాన్ ఫైబర్
కాపర్ వస్తువులు
ఇన్సూరెన్స్
షూస్
బంగారం, వెండి ధరలు
నాప్తా(హైడ్రోకార్బన్ లిక్విడ్ మిక్చర్)