New Delhi, Feb 1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్ (Union Budget 2021) ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర లభించింది. చేతిలో రాజముద్రతో ఉన్న బ్యాగులో ట్యాబ్ తీసి ఆమె బడ్జెట్ (Budget like never before) ప్రసంగించారు. లాక్‌డౌన్ వల్ల అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. దేశంలో కనీవినీ ఎరుగని పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని వ్యాఖ్యానించారు.
అయితే కేంద్ర బడ్జెట్-2021లో మెట్రో రైలు కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాల ఊసేలేకుండా పోయింది. హైదరాబాద్‌లో మెట్రో అభివృద్ధికి గానీ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మెట్రో కేటాయింపులకు సంబంధించి కానీ ఎక్కడా (Telugu States Metros) పేర్కొనలేదు. కేవలం కేరళ, బెంగుళూర్, చెన్నై, నాగ్‌పూర్ మెట్రోల అభివృద్ధికి, రెండో దశ కేటాయింపులు జరిగాయి. చెన్నై మెట్రో రైలుకు రూ.63, 246 కోట్లు, బెంగళూరు మెట్రోకు రూ.14,788 కోట్లు కేటాయింపులు జరిగాయి. వీటితో పాటు నాసిక్‌లో కొత్త కారిడార్ ఏర్పాటుకూ కేటాయింపులు జరిగాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మెట్రో గురించి మాత్రం ఆర్థికమంత్రి నిర్మల ఎక్కడా ప్రస్తావించలేదు.
ఈ బడ్జెట్లో రోడ్డు రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి, ప్రజా రవాణాకు 2021-22 బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించామని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రోడ్డు రవాణా, రహదారులకు రూ 1.18 లక్షల కోట్లు కేటాయించారు.రైల్వేలకు 1.10 లక్షల కోట్లు, ప్రజా రవాణాకు రూ. 18.000 కోట్లు కేటాయించామని బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ కోలుకునే దిశగా బడ్జెట్‌లో పలు చర్యలు చేపట్టామని వివరించారు. దేశంలో ఏడు కొత్త టెక్స్‌టైల్ పార్క్‌లను డెవలప్ చేయనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
దేశవ్యాప్తంగా మరిన్ని ఎకనామిక్ కారిడార్లను నిర్మించనున్నట్లు ఆమె చెప్పారు. రోడ్డు మౌళికసదుపాయాలను పెంచేందుకు ఈ కారిడార్లు పనిచేస్తాయని ఆమె తెలిపారు.రోడ్డు మౌళిక సదుపాయాల్లో భాగంగా.. తమిళనాడులో 3500 కిలోమీటర్ల మేరకు జాతీయ హైవే పనులు చేపట్టనున్నారు. దీని కోసం సుమారు 1.03 లక్ష కోట్లు ఖర్చు చేయనున్నారు. దీనిని ఎకనామిక్ కారిడార్‌గా మారుస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేరళలో సుమారు 1100 కిలోమీటర్ల హైవే పనులు జరగనున్నాయి. దీని కోసం 65వేల కోట్లు కేటాయించారు.
పశ్చిమ బెంగాల్‌లోనూ 675 కిలోమీటర్ల మేర హైవే పనులు చేపట్టనున్నారు. దీని కోసం 75 వేల కోట్లు కేటాయించారు.ముంబై - కన్యాకుమారి మధ్య కూడా ఎకనామిక్ కారిడార్‌ను నిర్మిస్తామని తెలిపారు. పశ్చిమ బెంగాల్ - సిరిగురి మధ్య నేషనల్ హైవేను నిర్మిస్తామని ప్రకటించారు. మరో మూడేళ్లలో అసోంలో కూడా ఎకనామిక్ కారిడార్‌తో పాటు నేషనల్ హైవేలను కూడా నిర్మిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖకు ఈ ఏడాది లక్షా 80 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు మంత్రి సీతారామన్ తెలిపారు. తమిళనాడులో రెండు హైవే కారిడార్లను నిర్మించనున్నారు. ఆ పనులు వచ్చే ఏడాది ప్రారంభంకానున్నట్లు ఆమె చెప్పారు. అస్సాంలోనూ 19000 కోట్ల హైవే పనులు జరుగుతున్నట్లు మంత్రి వెల్లడించారు.