Uttam Kumar Reddy on Budget 2021: బడ్జెట్‌లో తెలంగాణకు ఒరిగిందేమి లేదు, ఎన్నికలున్న రాష్ట్రాల బడ్జెట్‌లా ఉంది, ఎంపీ ల్యాడ్స్ వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Telangana PCC chief Chief Uttam Kumar Reddy | (Photo Credits: ANI)

Hyderabad, Feb 1: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని టీపీసీసీ తాత్కాలిక చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy on Budget 2021) అన్నారు. ఈ బడ్జెట్‌తో తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇచ్చిన 10 వేల కోట్లు 29 రాష్ట్రాలకు ఏ మాత్రం సరిపోవన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై సెస్‌ విధించడం దారుణమన్నారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అయిపోయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ (Budget 2021-22) కేవలం ఎన్నికలున్న రాష్ట్రాల బడ్జెట్‌లా ఉంది తప్ప, మిగిలిన రాష్ట్రాల బడ్జెట్ కాదని టీపీసీసీ తాత్కాలిక అధ్యక్షుడు విమర్శించారు.

రైతుల ఆదాయం రెండింతలు చేస్తామన్న నినాదం పచ్చి అబద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. మెట్రో రైలు విస్తరణలో హైదరాబాద్‌కు నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లక్షల కోట్ల ప్రజల ఆస్తులను అమ్మేసే ప్రణాళిక రచించడం దారుణమన్నారు. హైదరాబాద్‌-విజయవాడ బుల్లెట్ ట్రైన్ కేటాయించాలన్నారు.కరోనా పేరుతో ఎంపీల నిధులు కట్ చేశారని, సెంట్రల్ విస్టాకు నిధులు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఎంపీ ల్యాడ్స్ వెంటనే పునరుద్ధరించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

3 లక్షల కోట్ల రూపాయల దేశ ప్రజల బడ్జెట్‌ను కేవలం 5 రాష్ట్రాలకు ఇవ్వడం దారుణమన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసిందని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ ఎంపిల వల్ల ఎటువంటి లాభం లేదన్నారు. రాష్ట్ర ప్రతిపాదనలు ఒక్కటి కూడా బడ్జెట్‌లో ప్రస్తావన చేయలేదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆరు సంవత్సరాలకు ప్యాకేజి ప్రకటించడం ప్రజలను మోసం చేయడమేనని ఉత్తమ్ విమర్శించారు. కనీస మద్దతు ధరపై కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావన లేదని, రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నా మేలు చేసే చర్యలు లేవన్నారు.

పోలవరం ఊసే లేదు, ఫిషింగ్ హార్బర్ చెప్పుకునేంతగా లేదు, ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై వరాలు కురిపించారు, బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

భారతదేశాన్ని ఆర్థికంగా దివాలా తీసే విధంగా ప్రజల ఆస్తులను అమ్మడం, 12 లక్షల కోట్ల అప్పులు చేయడం వంటి చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. విభజన చట్టంలోని అంశాలపై ప్రస్తావన లేదని, కేవలం అహమ్మదాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ తప్ప దేశంలో మిగిలిన రాష్ట్రాల గురించి పట్టించుకోలేదని దుయ్యబట్టారు.