File Images of Sharad Pawar, Uddhav Thackeray & Sonia gandhi | (File Photo)

Mumbai, November 22:  మహారాష్ట్రకు నాయకత్వం వహించడానికి శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే  (Uddhav Thackeray) ముఖ్యమంత్రిగా ఉండాలని శివసేన- కాంగ్రెస్-ఎన్‌సిపి (Shiv Sena- NCP -INC)  మధ్య జరిగిన నిర్ణయాత్మక సమావేశంలో నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ మేరకు ఈ మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. శివసేన పార్టీకి సీఎం పదవి, కాంగ్రెస్ మరియు ఎన్సీపీలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కనున్నాయి. ఇక ప్రభుత్వం ఏర్పాటుపై ఈ మూడు పార్టీలు సంయుక్తంగా శనివారం అధికారిక ప్రకటన చేయనున్నాయి.  అనంతరం గవర్నరును కలవనున్నట్లు సమాచారం.  రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో దిల్లీలో జరిగే గవర్నల సమావేశానికి హాజరు కావాల్సి ఉన్న మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి, తన పర్యటనను రద్దు చేసుకొని ముంబైలోనే ఉండిపోయారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో శుక్రవారం సాయంత్రం నుంచి శివసేన- కాంగ్రెస్-ఎన్‌సిపి కలిసి సుదీర్ఘంగా చర్చించుకున్నాయి. ముందుగా మహారాష్ట్ర సీఎంగా ఎవరు ఉండాలి, డిప్యూటీ సీఎంలుగా ఎవరు ఉండాలనే అంశాలపై ఈ మూడు పార్టీలు ఒక ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఇక కీలక మంత్రి పదవుల విషయంలో మాత్రం మూడు పార్టీలకు సమానంగా వాటా దక్కాలని నిర్ణయించుకున్నారు. మంత్రి పదవులు "16-15-12" నిష్పత్తిలో ఉండాలని ప్రధానంగా వినిపిస్తుంది. ఈ ప్రకారంగా శివసేనకు 16, ఎన్సీపీకి 15 మరియు కాంగ్రెస్ కు 12 మంత్రి పదవులు దక్కేలా ఒప్పందాలపై నేతలు సంతకాలు చేసినట్లు నివేదికల ద్వారా వెల్లడవుతుంది. స్పీకర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే ఉండాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.

మహారాష్ట్రలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడి 20 రోజులైనా, పదవుల విషయంలో విబేధాలు ఏర్పడి సరైన మెజారిటీ లేక ఏ కూటమి కూడా ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో 10 రోజుల కిందట నవంబర్ 12న మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించబడింది. ఎట్టకేలకు నెలరోజుల తర్వాత రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం ముగింపుకు వచ్చింది.

ఇక పార్టీల బలాలను ఒకసారి పరిశీలిస్తే, బీజేపీ నుంచి 105, శివసేన నుంచి 56 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44, ఎంఐఎం మరియు స్వతంత్రులకు కలిపి 29 సీట్లు వచ్చాయి. 288 సభ్యులుండే మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఒక పార్టీకి లేదా కూటమికి కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 145. ఇప్పుడు శివసేన 56 + ఎన్సీపీ 54+ కాంగ్రెస్ 44 కలిస్తే మొత్తం 154 సీట్లు అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం ఉంది. దీంతో మహారాష్ట్రలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడబోతుంది.