Mumbai, November 12: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర్నించీ 20 రోజులుగా కొనసాగుతున్న హైడ్రామాకు ఫుల్ స్టాప్ పడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో ఎన్నో మలుపులు తిరిగిన మహారాష్ట్ర రాజకీయాలు చివరకు రాష్ట్రపతి పాలన (President's Rule) వైపు దారితీశాయి. గవర్నర్ విధించిన నిర్ణీత గడువులోగా ప్రభుత్వం ఏర్పాటుకు ఏ రాజకీయ పక్షం ముందుకు రాకపోవడంతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర కేబినేట్, గవర్నర్ సిఫారసును ఆమోదించారు. దీంతో గవర్నర్ సిఫారసు మరియు అందుకు కేంద్ర కేబినేట్ తీర్మానాన్ని అధికారులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు పంపారు. ఈ క్రమంలో రామ్‌నాథ్ కోవింద్ (Ramnath Kovind) తన విశేషాధికారాలను ఉపయోగిస్తూ ఆర్టికల్ 356 (Article 356) ప్రకారం మహారాష్ట్రలో 'రాష్ట్రపతి పాలన' విధిస్తూ సంతకం పెట్టారు. దీంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. ఇక 6 నెలల పాటు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలులో ఉండనుంది.
రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటయ్యే పరిస్థితి లేదు, రాష్ట్రపతి పాలన అనివార్యం: గవర్నర్
నవంబర్ 08న అసెంబ్లీ పదవీకాలం ముగిసిన తర్వాత ప్రధాన పక్షాలైన బీజేపీ, శివసేన మరియు ఎన్సీపీలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానం పంపారు. అయితే తమకు సంఖ్యాబలం లేదని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ నిరాకరించడంతో, ఇక సెకండ్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన శివసేన వంతు వచ్చింది. శివసేన, ఎన్సీపీ ఒక కూటమిగా ఏర్పడినా, వీరికి కాంగ్రెస్ పార్టీ నుంచి మద్ధతు రావడంలో జాప్యం జరిగింది. దీంతో శివసేన మరో 48 గంటల గడువు ఇవ్వాలని గవర్నరును కోరగా అందుకు గవర్నర్ నిరాకరించి, మూడవ లార్జెస్ట్ పార్టీ ఎన్సీపీని ఆహ్వానిస్తూ మంగళవారం రాత్రి 8:30 లోపు బలనిరూపణ చేసుకోవాల్సిందిగా సూచించారు.
అయితే మద్ధతు ఇచ్చే అంశంలో కాంగ్రెస్ హైకమాండ్ తర్జనభర్జనలు పడింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తమకు మరికొంత సమయం ఇవ్వాలని గవర్నరును కోరారు. దీంతో రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు జరిగే పరిస్థితులు లేవని, ఇక్కడ రాష్ట్రపతి పాలన అనివార్యమని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. అందుకనుగుణంగా ఆయన సిఫారసు చేయడం, దానికి కేంద్ర కేబినేట్ ఆమోదం తెలపటం, ఆపై రాష్ట్రపతి ఆమోదం చకచకా జరిగిపోయాయి.
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడం పట్ల శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు మంగళవారం రాత్రి 8:30 వరకు సమయం ఉన్నా, ఈలోపే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు, కేంద్రం కుట్రపూరితంగా ఆమోదం తెలిపింది. ఈ అంశాన్ని సుప్రీంలో తేల్చుకుంటాం అని పేర్కొన్నారు. అయితే కేంద్ర హోంశాఖ మాత్రం 6 నెలల లోపు ఎవరైనా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకొస్తే రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తాం అని చెప్తున్నప్పటికీ అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు.
నిబంధనల ప్రకారం, ఒకసారి రాష్ట్రపతి పాలన అమలులోకి వస్తే, అక్కడ అసెంబ్లీ రద్దు చేయబడిందన్నట్లే. మళ్ళీ 6 నెలల్లోపు మరోసారి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి ఆమోదం పొంది, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు కూడా నిర్ణయం తీసుకోలేదు.
బీజేపీ ఆలోచన ఇదేనా!
ఇప్పటికే ఎన్నికల్లో శివసేనతో పొత్తులో భాగంగా తమకు కొన్ని సీట్లు తక్కువ వచ్చాయని బీజేపీ భావిస్తుంది. అదీకాక, ఫలితాలు వెలువడిన తర్వాత శివసేన తీరు పట్ల బీజేపీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారు. సీఎం కుర్చీ కోసం శివసేన మరియు ఇతర రాజకీయ పక్షాలు వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారు. కాబట్టి మరోసారి ఎన్నికలకు వెళ్తే ఈ సారి స్పష్టమైన మెజారిటీ సాధించవచ్చునని బీజేపీ ఆలోచనగా అర్థమవుతుంది. స్వంతంగా మెజారిటీ సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఇక శివసేనను ఎంతమాత్రం ఎదగనీయకుండా చూడాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. అలాగే ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలను కూడా ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టి తమ బలం, ప్రతిష్ఠ మరింత పెంచుకునే లక్ష్యంగా ఈసారి వచ్చే ఎన్నికలను ఒక అవకాశంగా బీజేపీ వినియోగించుకోనున్నట్లు తెలుస్తుంది.