File images of Uddhav Thackeray and Sharad Pawar | (Photo Credits: PTI)

Mumbai, November 11:   మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు (Maharashtra Govt Formation)లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  ఎవరూ ఉహించని కూటమితో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  సీఎం పదవిలో వాటా కోసం మిత్రపక్షం అయిన బీజేపీపై ఎదురుదాడికి దిగిన శివసేన (Shiv Sena), మొత్తానికి ఆ పార్టీతో తెగదెంపులు చేసుకొని, కొత్త పక్షాలతో జట్టుకట్టి ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.

అంతకుముందు, మహారాష్ట్ర అసెంబ్లీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ (BJP) ని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించారు. అయితే తమకు సంఖ్యా బలం లేని కారణంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని గవర్నర్ కు బీజేపీ తెలియజేసింది. దీంతో గవర్నర్ శివసేనను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో శివసేన, ఎన్‌సీపీ (NCP) మరియు కాంగ్రెస్ (Congress Party) ఒక జట్టుగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. కొత్త పొత్తుల్లో భాగంగా అనుకున్నట్లుగానే శివసేనకు ముఖ్యమంత్రి పదవి, ఎన్‌సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవి మరియు కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ దక్కేటట్లుగా మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తుంది. అయితే అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.  ఉద్ధవ్ థాకరే సీఎం అంటూ శివసేన చీఫ్ ఇంటి వద్ద ఫ్లెక్సీలు

ఈ సాయంత్రం 7 లోగా ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టతనివ్వాలని  గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ డెడ్ లైన్ విధించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే శివసేన, కాంగ్రెస్ మరియు ఎన్సీపీ పార్టీల అగ్ర నేతల నడుమ చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది.

ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత అసలేం జరిగింది?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని బీజేపీ మరియు ఉద్దవ్ థాకరే లోని శివసేన ఒక కూటమిగా కలిసి పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ మరియు ఎన్సీపీ ఒక జట్టుగా పోటీ చేశాయి. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ - ఎన్సీపీ కూటమిపై శివసేన దుమ్మెత్తి పోసింది.ఈ సారి కూడా మహారాష్ట్రలో బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్, పలు సర్వేలు అంచనా వేశాయి. అంచనాలకు తగినట్లుగానే బీజేపీ కూటమి ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.

288 సభ్యులుండే మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఒక పార్టీకి లేదా కూటమికి కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 145, బీజేపీ + శివసేన కలిసి సాధించిన ఎమ్మెల్యేల సంఖ్య 161. బీజేపీ నుంచి 105, శివసేన నుంచి 56 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44, ఎంఐఎం మరియు స్వతంత్రులకు కలిపి 29 సీట్లు వచ్చాయి.  దీంతో మహారాష్ట్రలో బీజేపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటు లాంఛనమే అని భావించారంతా. ఇక్కడే బీజేపీకి మిత్రపక్షమైన శివసేన ట్విస్ట్ ఇచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు తమ మద్ధతు కావాలంటే శివసేన అభ్యర్థి 2.5 సంవత్సరాల పాటు సీఎంగా ఉండాలని షరతు విధించింది. అయితే అందుకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అంగీకరించలేదు. దీంతో బీజేపీపై శివసేన విమర్శల దాడి చేసింది. బీజేపీ హయాంలో జరిగిన తప్పులన్నింటిని ఎత్తి చూపింది. ఇరు పక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతూ వచ్చాయి. వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు దిల్లీ నుంచి బీజేపీ పెద్దలు ముంబై వచ్చి శివసేనకు నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోయింది.

శివసేనతో వైరం వల్ల బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి 40 ఎమ్మెల్యేలు తక్కువయ్యారు. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని స్పష్టం చేసింది. ఇక సీఎం పీఠమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న శివసేన, తమ వైరి పక్షాలైన కాంగ్రెస్- ఎన్సీపీ కూటమితో జతకట్టేందుకు సిద్ధమైంది. ఈ మూడు పార్టీలు కలిస్తే (శివసేన 56 + ఎన్సీపీ 54+ కాంగ్రెస్ 44) 154 సీట్లు అవుతున్నాయి. దీంతో ఆ విధంగా పదవుల విషయంలో ఈ మూడు పార్టీలు ఒక ఒప్పందానికి వచ్చి, అందుకనుగుణంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఈసారి కూడా ప్రతిపక్షానికే పరిమితమనుకున్న ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమి, శివసేన చొరవతో ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతున్నాయి. ఇటు అధికార పక్షం అనుకున్న బీజేపీ ప్రతిపక్షానికి పరిమితం కాబోతుంది.

ఈ మొత్తం వ్యవహారం చూస్తే మొన్నటి కర్ణాటక రాజకీయాలే గుర్తుకు వస్తాయి. కర్ణాటక ఎన్నికల్లో కూడా బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ సాధించలేకపోయింది. అక్కడ కాంగ్రెస్ మద్ధతుతో తక్కువ ఎమ్మెల్యేలు గెలిచిన కుమార స్వామి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే సంవత్సరం కూడా తిరగకుండానే కాంగ్రెస్ నుంచి కుమార స్వామి నేతృత్వం వహించే జేడీఎస్ నుంచి ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అయ్యారు. దీంతో కుమార స్వామి ప్రభుత్వం మైనార్టీలోకి పోయింది, ఆ తర్వాత బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏరాటు చేయగలిగింది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా బీజేపీ ఇదే విధానం అవలంభించాలని భావిస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఇప్పుడు శివసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినా ఆ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో చెప్పలేని పరిస్థితి. దీనిని బట్టి రాబోయే కాలంలో కూడా మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనాలు రావడం ఖాయంగా తెలుస్తుంది.