Make life a celebration: పండగలు ఎందుకు జరుపుకుంటారు? రారండోయ్ పండగ చేసుకుందాం!

ఈ భూమిపై నివసించే జీవరాశి మొత్తంలో పండుగలు ( Festivals) జరుపుకునే ఏకైక జీవి మనిషి. మీరెప్పుడైనా ఆలోచించారా అసలు మనం ఈ పండగలను ఎందుకు జరుపుకుంటామో? ఒకసారి టైం ట్రావెల్ చేసి అలా చాలా కాలం వెనక్కి వెళ్లి వద్దాం పదండి.

ప్రపంచంలోని మనుషులందరూ ప్రాంతాల వారీగా, జాతుల వారీగా, మతాల వారీగా విభజింపబడ్డారు. మనిషి దేనికీ సంతృప్తి చెందడు. తన దగ్గర అన్నీ ఉన్నా ఇంకా ఏదో లోటుగానే ఉన్నట్లుగా భావిస్తాడు.  ఇంకా ఏదో కావాలనుకుంటాడు. తనని తాను ఇంకొకరితో పోల్చుకుంటూ మనసులో కొంత అసంతృప్తిని కలిగి ఉంటాడు. ఈ రకంగా మనుషుల్లో అసంతృప్తి విపరీతంగా పెరిగిపోతున్న దశలో ఆయా ప్రాంతానికి లేదా మతానికి చెందిన పెద్దలు దీనికి పరిష్కారం దిశగా ఒక తంతుగా వేడుకలను  (Celebrations) జరుపుకోవడం పరిచయం చేశారు.

ఆ విధంగా చేస్తే ఇక ముందు అందరికీ అంతా మంచే జరుగుతుంది అనే ఒక సానుకూల దృక్పథాన్ని (Positive Attitude) కల్పించారు. ఆ విధంగా ఒక్కోచోట ఒక్కోరకంగా వారికి నిర్ధేశించిన విధంగా పండుగలను జరుపుకోవటం ప్రారంభమైంది.

కాలానుగుణంగా, విభిన్న ప్రాంతాలవారు, విభిన్న మతాల వారు అందరిలో తమ ప్రత్యేకత చాటుకోవటానికి, తమ  పద్ధతులు, సంప్రదాయాలు, గొప్పతనం ఇతరులకు తెలియజెప్పటానికి అనేకానేక పండుగలకు పుట్టుకనిచ్చారు.

మొదట్లో పండగలను ముఖ్యంగా పంట వేసే ముందు, తర్వాత పంట చేతికందే సమయాల్లొ జరుపుకునేవారు. రాబోవు కాలంలో పంటలు సమృద్ధిగా పండాలని, తినే తిండి ఎప్పటికి దొరకాలని వారి ఆరాధ్య దేవతలను కొలుస్తూ జంతు బలులు ఇచ్చేవారు.

భారతదేశం కూడా ఎన్నో రకాల పండగలకు పెట్టింది పేరు. విభిన్న మతాలు, సంస్కృతుల వారు ఇక్కడ ఉండటం వలన ఎవరికి వారు వారి సంస్కృతి, సంప్రదాయాలకనుగుణంగా పండుగలు జరుపుకుంటారు. ఒక దశలో భారతదేశంలో 365 రోజులకు 365 పండగలు ఉండేవి. కానీ పేదరికం, ఇతర కారణాల వలన ప్రతీరోజు పండగ జరుపుకోవడం సాధ్యపడలేదు. అవి కాలక్రమేణా తగ్గుతూ వస్తూ దేశవ్యాప్తంగా ఇప్పుడు 30- 40 పండగలు జరుపుకుంటున్నారు.

ఒకప్పుడు పండగ అంటే ఊరిలో జనాలు అందరూ కలిసి ఐకమత్యంగా జరుపుకునేవారు. కానీ ఇప్పటి తరం పండగ అంటే కేవలం ఒక సెలవు దినంగా మాత్రమే భావిస్తున్నారు. పండగ అసలు ఉద్దేశ్యాన్ని విస్మరిస్తూ ఇంట్లో విశ్రాంతికే పరిమితమవుతున్నారు. ఇప్పుడు ఎవరికీ పండగ జరుపుకునేందుకు సమయం లేదు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న తరానికి పండగ అంటే ఒక హాలిడే మాత్రమే అనే పరిస్థితి ఏర్పడుతుంది.

పండగ అంటే ఒక పవిత్రదినం, పండగ అంటే ఒక ఆనందం, పండగ అంటే ఒక నూతన ఉత్తేజం, పండగ అంటే ఒక ప్రత్యేకమైన రోజు.  అందుకే నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉన్నా, పండగరోజు మాత్రం అందరూ కలిసి తమకు ఉన్న దాంట్లోనే వేడుక చేసుకుంటూ సంతోషంగా గడుపుతారు. మనకు ఏం ఉన్నా, లేకపోయినా సంతోషగా గడపడమే పండగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

పండుగ జరుపుకునే క్రమంలో తమకున్న బాధలు మరిచిపోయి, ఉల్లాసంగా గడుపుతారు. ఈ విధంగా పనిభారం, ఒత్తిడి, ఇతర మానసిక సమస్యల నుంచి ఊరట లభిస్తుంది.

కాబట్టి, పండగ ఏదైనా, ఎవరిదైనా  మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకోవటానికి, మీకు సానుకూల దృక్పథాన్ని కలిగించే ఏ సందర్భాన్ని వదులుకోకండి. అందరితో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా పండగ చేస్కోండి.

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన కొన్ని పండుగలు

హిందూ పండగలు:

 • సంక్రాంతి పండుగ - జనవరి రెండవ వారం 13,14, 15 తేదీలలో
 • హోలీ మార్చిలో
 • హైదరాబాద్ బోనాలు - ఆషాఢమాసంలో జూన్- ఆగష్టు మధ్యకాలంలో
 • గణేశ్ ఉత్సవాలు సెప్టెంబర్ మొదటి వారం ప్రారంభమై 9 నుంచి 11 రోజుల వరకు కొనసాగుతాయి.
 • దేవీ నవరాత్రులు -దసరా, బతుకమ్మసెఫ్టెంబర్ చివర లేదా అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభమై 9 రోజుల పాటు
 • దీపావళి అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ ప్రారంభంలో .

ముస్లిం పండుగలు:

 • ఈద్-ఉల్-ఫిత్ర్ (రంజాన్) - మే లేదా జూన్ నెలలో
 • ఈద్- ఉల్- జుహా (బక్రీద్) - జూలై లేదా ఆగష్టు నెలలో

క్రైస్తవ పండుగలు:

 • గుడ్ ఫ్రైడే - మార్చి లేదా ఏప్రిల్ నెలలో
 • క్రిస్ మస్ - డిసెంబర్ 25న