New Delhi, March 31: ఇండియాలో కరోనావైరస్ వ్యాప్తి (Coronavirus Outbreak in India) ఒక వైపు ఉండనే ఉంది. మరో రకంగా కూడా ఈ వైరస్ ప్రజలకు సైడ్ ఎఫెక్ట్‌గా మారింది. కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో బయటకు వెళ్లలేక, ఇంట్లో ఉండి కూడా ఏం చేయాలో అర్థం కాక, ఏమి తోచక కొంత మంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఎన్నిరోజులో ఈ లాక్‌డౌన్ అని భవిష్యత్తుపై బెంగ పెట్టుకొని కూడా మానసిక ఒత్తిడికి (Mental Stress, Anxiety) గురవుతున్నారు.
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్-19 కేసులు మరియు మరణాల సంఖ్య మిగతా వారినీ కలవరపాటుకు గురిచేస్తుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా ఎక్కడ తమకు ఈ వైరస్ అంటుకుంటుందోన్న భయాందోళనలకు గురవుతున్నారు. అనుకోకుండా, ఇతర ఏ కారణం చేత దగ్గినా, తుమ్మినా కరోనానేమో అనే అనుమానాలను పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతూ లేని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు.
భారత్ లో మానసిక రోగుల సంఖ్య అకస్మాత్తుగా 20 శాతం పెరిగిందని 'ఇండియన్ సైకియాట్రీ సొసైటీ' వారు నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ప్రతీ ఐదుగురు భారతీయుల్లో ఒకరు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని సర్వే పేర్కొంది. ఎక్కువ మంది తమ వ్యాపారాలు, ఉద్యోగాలు, ఆదాయాలు, పొదుపులు లేదా వనరులను కోల్పోతామేమోనన్న భయంతోనే మానసిక ఆనారోగ్యానికి గురవుతున్నారని సర్వే పేర్కొంది.
ఇక మద్యానికి బానిసైన కొంతమంది లాక్ డౌన్ కాలంలో మద్యం దొరకక వింతగా ప్రవర్తిస్తున్న ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. ఈ రకంగా కూడా మెంటల్ హాస్పిటళ్లలో కేసుల సంఖ్య పెరుగుతుందని వెల్లడైంది.
లాక్ డౌన్ ప్రజల సాధారణ జీవనశైలిని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ సమయంలో వారిలో ఉత్పన్నం అవుతున్న భయాందోళనలు, మానసిక ఒత్తిడితో వివిధ రకాల సిండ్రోమ్ లకు దారితీస్తుంది. సంతానాన్ని కోరుకునే మగవారిలో సైతం ఇది వీర్యకణాల నాణ్యతను కూడా దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో ఆరోగ్యకరం ఏమిటో తెలుసుకోండి
ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. లాక్డౌన్ సమయంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి (to maintain mental health) కొన్ని ఆరోగ్య సలహాలను పాటించమని ప్రజలను కోరుతోంది. ఆందోళన ఎక్కువైతే వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందిగా సూచిస్తుంది.
సామాజిక దూరాన్ని పాటిస్తూనే లాక్ డౌన్ కాలంలో ప్రజలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవచ్చో తెలియజెప్పిన కేంద్ర ఆరోగ్య శాఖ
1. ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉండండి, రెగ్యులర్ గా ఒక షెడ్యూల్ కలిగి ఉండండి
2. సంగీతం వినడం, చదవడం, టెలివిజన్‌లో వినోదాత్మక కార్యక్రమం చూడటం ద్వారా ప్రతికూల భావోద్వేగాల నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకోండి.
3. బాగా తినండి, నీరు మరియు పండ్ల రసాలు పుష్కలంగా తీసుకోండి
4. శారీరకంగా చురుకుగా ఉండండి.
5. పనుల్లో భాగస్వామ్యమే నిజమైన ప్రేమ (షేరింగ్ ఈజ్ కేరింగ్)
6. ఇంట్లోని పెద్దల అవసరాలు చూసుకోవడం, వారి మందులను, ఇతర పనులు చేయడంలో సహాయం చేయడం వంటివి చేయాలి.
7. ఇంట్లో పిల్లలు ఉంటే వారితో ఆడుకోవడం, వారికి ఇంటి పనులు, కొత్త కొత్త విషయాలు నేర్పించడం లాంటివి చేయాలి.
ఒత్తిడి తగ్గించుకోవటానికి చేయాల్సినవి
1. ఆందోళన సమయంలో, కొన్ని నిమిషాలు నెమ్మదిగా శ్వాసించడం సాధన చేయండి. ప్రశాంతంగా మరియు నిర్మలంగా ఆలోచించండి అన్నింటికి పరిష్కారం ఉంటుంది.
2. కోపం మరియు చిరాకు లాంటివి ఆవహించినపుడు దృష్టి మరోదానిపై మరల్చుకోవాలి.
3. ఏదైనా భయం కలిగితే, ముందుగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మిమ్మల్ని భయపెట్టే ఆ ఆలోచనను కొంత కాలానికి వాయిదా వేయండి, ప్రస్తుత కార్యకలాపాలలో గడపడానికి ప్రయత్నించండి.
4. సోషల్ మీడియా, ఫోన్ల ద్వారా ఇతరులతో కనెక్ట్ అవ్వండి.
5. ఒకవేళ ఈ భయాందోళనలు, భావోద్వేగాలు చాలా రోజుల తరబడి కొనసాగితే దానిని ఇతరులతో పంచుకోండి.
ఇవన్నీ పాటిస్తునే ఇతరుల ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలను గుర్తించి వారిని కూడా ఆ సమస్యల నుంచి బయటకు వచ్చేలా మీ వంతు ప్రయత్నం చేయండని సూచించింది. ఇలాంటి సంక్షోభ సమయంలో ఒకరినొకరు ఆదరించుకోవాలని ప్రజలను కోరింది.